అమ్మాయీ ఓ అమ్మాయీ 15
telugu stories sahithi అమ్మాయీ ఓ అమ్మాయీ 15 "ఏం కావాలన్నా చేస్తాం!" అరిచాడు రాజేష్.
"ఇంక నుంచీ పండగల్లో కూడా మన పేపరు పబ్లిష్ చేయాలని మేము నిర్ణయించాం. దాని వల్ల మన పేపరు సర్యులేషన్ లో ఎంతో మార్పు వస్తుందని మా ఆశ! మరి మీకు పండుగనాడు పనిచేసినందుకు గాను రెట్టింపు జీతం ఇచ్చే స్తోమతు మన తెలుగు కిరణానికి లేదు. కనుక ఈ విషయం మీరే నిర్ణయించాల్సి వుంది..."
"మాకు 'డబుల్ పే' అక్కర్లేదు ! ఫ్రీగా పనిచేస్తాం!" అన్నాడు కొంతమంది లేచి నిలబడి మిగతావాళ్ళు అసంతృప్తిగా ఉన్నా పైకి ఏమీ అనలేకపోతున్నారు.
భవానీశంకర్ అది గమనించాడు.
"యస్ కామ్రేడ్స్ - మీలో కొందరికి ఏవో అనుమానాలు, అసంతృప్తి కలుగుతున్నట్లు అనిపిస్తోంది. ఇది మేము చేస్తున్న ఎక్స్ ప్లాయిటేషన్ కాదు బ్రదర్! కేవలం సహాయం! ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం అనే నీతి సూత్రం! అంతే! ఏమంటారు?" అందరి మొఖాలు వికసించినాయ్.
"శభాష్ కామ్రేడ్స్! మీ సహకారంతో ఇక మిగిలిన నాలుగు నెలల్లో మన 'తెలుగు కిరణం' అత్యధిక సర్క్యులేషన్ సాధిస్తున్న నమ్మకం నాకిప్పుడు పూర్తిగా కలిగింది - "
"మళ్ళీ చప్పట్లు.
"కామ్రేడ్స్- ఇప్పటికే మీ సమయం చాలా వాసేశాను! ఇంక మీరు తేనీటి విందు మీద దాడి చేయవచ్చు-"
అందరూ ఓ పక్క సిద్దంగా ఉంచిన ఫలహారాల ప్లేట్ల మీదకు దాడి చేశారు.
చిరంజీవి హడావుడిగా వచ్చాడక్కడికి.
"కెమెరా . టేప్ రికార్డర్ తెచ్చేశాడు! మనం ఇంక బయల్దేరదామా?"
"ఆయామ్ రడీ మైడియర్ ఫ్రెండ్! ఆల్వేస్ రడీ! మనం వెళ్ళేది ఆ ఆడపిల్లల హాస్టల్ కెనా?"
"అవును! అందులోని హాస్టల్ మేట్స్ కొందరిని కలుసుకుని హాస్టల్ రహస్యాలు తెలుసుకోవాలి! నేను మిగతా ప్రెస్ రిపోర్టర్స్ అందరితో కలిసి ఆ ఆడపిల్లలను కలుసుకుని ప్రశ్నలడిగాను. కానీ వార్డెన్ పక్కనే వుండడం వల్ల వాళ్ళేమీ చెప్పటం లేదు. కనుక రాత్రి మనం దొంగ తనంగా హాస్టల్ కెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి-"
భవానీశంకర్ ఓ క్షణం ఆలోచించాడు.