అమ్మాయీ ఓ అమ్మాయీ 1

By | August 6, 2022
telugu kathalu navalalu sahithi అమ్మాయీ ఓ అమ్మాయీ 1 వైజాగ్ రైల్వే స్టేషన్ చాలా హడావుడిగా ఉంది. స్టేషన్ బయటా లోపలా జనం క్రిక్కిరిసి పోయి వున్నారు. వేసవి సెలవులు ఆ రోజు నుంచీ మెదలవటమే ఆ సందడికి కారణం. ఆ గుంపుల మధ్యలో చాలా మంది కంటే పొడుగ్గా, చాల మంది కంటే చక్కని విగ్రహంతో, చాలామంది కంటే బావున్న ముక్కూ మొఖంతో నిలబడి ఆశ్చర్యంగా చూస్తున్నాడో యువకుడు. అతనిలో ఉత్సాహం, సరదా, చిలిపితనం, ఆసక్తీ , ధైర్యం, పట్టుదలా, ఇవన్నీ పుష్కలంగా శరీరంలో పాక్ చెసినట్లనిపిస్తోంది చూసేవారికి. అతన్ని చూసి "మేము కూడా పెళ్ళి చేసుకోకుండా , జీవితాంతం బ్రహ్మచారిగా గడుపుతే ఎంత బావుండేది" అని ఈర్ష్యపడిపోతున్నారు చాలా మంది భర్తలు. అతని వివరాలు తెలుసుకోవడం పెద్ద కష్టమేంకాదు. ఆ రైల్వే స్టేషన్ లోనే బుక్ స్టాల్ లో తీగకు వేలాడుతోన్న "వైజాగ్ కాలింగ్" అనే ఈవెనింగ్ న్యూస్ డెయిలీ లో మొదటి పేజీలో ఓ వార్త మీకు తాటికాయంత అక్షరాలతో కనబడుతుంది. "బీచ్ రోడ్ లో స్మగ్లర్స్ భీకరపోరాటం! ఒకరి హత్య! ముగ్గురికి గాయాలు" అన్న హెడ్డింగ్ కింద "మా ప్రత్యేక విలేకరి భావానీశంకర్ నుంచి" అన్న వాక్యం ఉంటుంది. అదిగో -- ఆ భవానీశంకరే ఇతను! భావానీశంకర్ ఉండుండి బుక్ స్టాల్ వైపు చూస్తున్నాడు - ఎవరైనా ఆదమరుపున "వైజాగ్ కాలింగ్" కొంటారేమోనని. అరగంట గడిచిపోయింది గానీ ఒక్కరు కూడా ఆ పేపరు కొన్న పాపాన పోవటం లేదు. మిగతా ప్రత్రికలూ, పేపర్లూ అన్నీ కొనేస్తున్నారు. భవానీశంకర్ కి అది కొంచెం నిరుత్సాహం కలిగించింది గానీ, అతని శరీరంలో క్రిక్కిరిసినట్లున్న ఉత్సాహం , సరదా -- ఇవన్నీ ఆ నిరుత్సాహాన్ని అనవాల్లెకుండా తరిమికొట్టినయ్. అతను టైమ్ చూసుకున్నాడు. సాయంత్రం నాలుగవలేదింకా! "విజ్జీ ఇంకా రాలేదేమిటి?" అనుకున్నాడతను పోర్టికో వేపు చూస్తూ. హటాత్తుగా అతని దృష్టి - ఓ అద్బుతమయిన ఆనందకరమయిన దృశ్యం మీద పడింది. ఓ ముసలాయన "వైజాగ్ కాలింగ్' న్యూస్ పేపర్ కొంటున్న దృశ్యం అది! చిరునవ్వుతో ఆ ముసలాయన దగ్గరకు నడిచాడు. ముసలాయన "వైజాగ్ కాలింగ్ "పేపరంతా (కేవలం నాలుగు పేజీలే) రెండు నిమిషాల్లో చదివేశాడు. పేపరు మడుస్తున్న సమయంలో "ఎక్స్ క్యుజ్ మి" అన్నాడు భవానీశంకర్. ముసలాయన ఆశ్చర్యంగా భవానీశంకర్ వేపు చూశాడు. "నాపేరు భవానీశంకర్! వైజాగ్ కాలింగ్ స్పెషల్ కరెస్పాండెంట్ ని!" "అయితే?" అనుమానంగా అడిగాడు ముసలాయన. "నధింగ్ సర్! మీరు మా వైజాగ్ కాలింగ్" పేపర్ చదువుతుంటేనూ - ఈ పేపర్ మీకెంతవరకు నచ్చిందో - జస్ట్ - ఎంక్వయిరీ చేద్దామనీ- "ఏం పేపరది?" "అదేనండీ! 'వైజాగ్ కాలింగ్' మోస్ట్ ప్రిస్టేజియస్ ఈవెనింగ్ పేపర్!" "నేనప్పుడూ చూళ్ళేదు , వినలేదు!" అన్నాడాయన చిరాగ్గా. భవానీశంకర్ కేం మాట్లాడాలో తెలీలేదు. "మీ చేతుల్లో ఉన్నది 'వైజాగ్ కాలిగే'కదండీ !" వినయంగా చెప్పాడు. "నేనీ పేపర్ కొన్నది చదవటానిక్కాదు! రైల్లో కింద వేసుకుని పడుకోటానికని ఓ పనికిరాని పేపర్ ఇమ్మని స్టాల్ అతనిని అడిగాను." అన్నాడతను. భవానీశంకర్ అక్కడి నుంచి నేరుగా నడిచి జనంలో నుంచి పోర్టికో వేపు ఈదుకెళ్ళిపోయాడు. అందుక్కారణం ఆ ముసలాయన చెప్పిన నగ్నసత్యం కాదు. పోర్టికో బయట అప్పుడే అటో దిగి దిక్కులు చూస్తోన్న ఓ అందమైన తెల్లటి మల్లెపూవులాంటి అమ్మాయి. "హలో హలో హలో ...." అన్నాడు భవానీశంకర్ ఆమె దగ్గరకు వస్తూ. "ఓ వచ్చేశావన్నమాట! రిజర్వేషన్ చార్ట్ చూశావా!" అడిగిందామె. "ఓ! 'డి' కోచ్! బెర్త్ నెంబర్ ఫిప్టీ సిక్స్" "థాంక్యూ!" అందామె. "వెళ్దామా!' అడిగాడతను. ఇద్దరూ ప్లాట్ ఫారం మీదకెళ్ళి నిలబడ్డారు. "షల్ వుయ్ హావ్ కూల్ డ్రింక్స్?" "ఓ! పద!" ఇద్దరూ ఆ పక్కనే వున్న కూల్ డ్రింక్ స్టాల్ దగ్గర కెళ్ళారు. ఆ స్టాల్ చుట్టూ జనం మూగిపోయి వున్నారు. వాళ్ళ మీద నుంచీ చేతులు చాచి రెండు కూల్ డ్రింక్ లు అందుకున్నాడు భవానీశంకర్. "ఈ రెండు నెలలూ నువ్వేం చేయదలచుకున్నావ్?" అడిగిందామె కూల్ డ్రింక్ తాగుతూ. భవానీశంకర్ కొంచెం తడబడ్డాడు. ఏం చెప్పాలో తెలీలేదు. ఏం చెప్తే ఏం తంటానో అన్న జంకు! "ఏముందీ.....ఏమీ లేదు.....జస్ట్ - టైమ్ పాస్!" అన్నాడు నవ్వుతూ. "అంతేగానీ ఆ "వైజాగ్ కాలింగ్" ఉద్యోగం వదలవన్న మాట!' చిరాకుగా అందామె. ఆమె అందమయిన ముఖంలో కోపం వస్తే బాగానే ఉంటుంది గానీ భవానీశంకర్ కది ఇష్టం లేదు. 'అబ్బే! అలా అని కాదనుకో! కానీ అందులో కొంచెం 'థ్రిల్ ' ఉంది...." "ఏమయినా సరే! నువ్వు ఇంకేదయినా మంచి ఉద్యోగం చేయాల్సిందే. మా డాడీ సంగతి నీకు చెప్పను కదా! ఈ విషయంలో ఆయనకు చాలా పట్టింపు...." "అవునవును! చెప్పావ్-" పొడిగా అన్నాడతను. "ఇంకొక ముఖ్యమైన విషయం మర్చిపోకు!" అందామె హటాత్తుగా ఏదో గుర్తుకొచ్చినట్లు. "ఏమిటది?" అడిగాడు భయంగా. "మీ గాంగ్ తో తిరగడం మానేస్తే మంచిది...." భవానీ శంకర్ భయపడినంతా అయింది. ఈ టాపిక్ అయితే రాకూడదని కోరుకుంటూన్నాడో అది రానే వచ్చేసింది. "అంటే........" ఏం మాట్లాడాలో తెలీక ఆగిపోయాడు. "అంటే అదే! మీ రాబీన్ హుడ్, లాంటి జులాయి వాళ్ళతో నువ్వు స్నేహం చేయడం నాకు నచ్చలేదని చెప్పను కదా!" "ఆఫ్ కోర్స్ - చెప్పావ్ చెప్పావ్!" "స్నేహితులనే వాళ్ళు ఎప్పుడూ మర్యాదస్తులూ, మంచి ప్రినిపుల్స్ గలవాళ్ళూ అయుండాలి! కళలూ, సాహిత్యం లాంటి వాటిల్లో మంచి అభిరుచి ఉన్నవాళ్ళయి ఉండాలి!" భవానీశంకర్ కి కొంచెం విసుగు పుట్టిన మాట నిజం! తన స్నేహితులెలాంటి వాళ్ళుండాలి అనే సబ్జెక్టు మీద ఆమె ఇప్పటికే పద్నాలుగు సార్లు లెక్చరిచ్చింది. ఖాళీ అయిన ఇద్దరి బాటిల్సూ తీసుకెళ్ళి స్టాల్లో ఇచ్చేసి డబ్బు ఇవ్వడానికి జేబులో చెయి పెట్టడతను. గుండెలు ఝల్లుమన్నాయ్. జేబులో కేవలం రెండే రూపాయలున్న విషయం గుర్తుకొచ్చింది. ఈలోగా టక్కున తనే పర్స్ తీసి స్టాల్ అతనికి పదిరూపాయల నోటు ఇచ్చేసింది విజ్జీ. ఇలా జరగటం ఇదేం కొత్తకాదు. ఆమెతో పరిచయమయిన ఈ కొద్ది కాలంలో చాలాసార్లు - అలాగే తమ బిల్లు కట్టాల్సి రావటం - సరిగ్గా అసమయంకే తన దగ్గర అంత డబ్బు లేకపోవటం - టక్కున విజ్జీయే బిల్లు కట్టేయటం జరిగిపోయింది. 'అయినా ఎప్పుడూ నేనే బిల్లు కడుతున్నా' అనే ఫీలింగ్ ఆమెకి ఉండేది కాదు. ఎటొచ్చీ తన ఫ్రెండ్స్ విషయంలో, తన సరదాల విషయంలో మాత్రం కొంచెం ఓవర్ గా రియాక్టవుతుందేమో అనేది తన ఫీలింగ్! ఇద్దరూ మళ్ళీ ఆమె 'కోచ్ ' దగ్గరకు బయల్దేరారు. ట్రైన్ బయల్ద్రేరే టైమ్ అయినట్లు గార్డ్ హడావుడిగా విజిల్ ఊదుతున్నాడు. "భవానీ - " పిలిచిందామె. "యస్. డియర్!" "నువ్వు ....నువ్వు .....నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా?" భావానీశంకర్ ఆశ్చర్యపోయాడు. "అదేమిటి! అలా అడుగుతున్నావ్?" ఆమె చేతిని తను చేతుల్లోకి తీసుకుని మృదువుగా నిమురుతూ అడిగాడు చిరునవ్వుతో. "మరి నా కోరికను ఎందుకంత నిర్లక్ష్యం చేస్తున్నావ్?" అశాంతిగా అడిగిందామె. "ఏదీ ఉద్యోగం సంగతేనా? కానీ నేను న్యూస్ పేపర్ జర్నలిస్ట్ గా ఉంటే మీ డాడీ ఎందుకొప్పుకోరు? ఆయనకు జర్నలిస్ట్ లంటే పడదా?" "అదేం కాదు! మా డాడీ ప్రెండోకతను జర్నలిస్ట్ గా ఉండి, దరిద్రం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు....." "ఓకే విజ్జీ! అయ్ విల్ థింక్ వోవర్! కానీ డాక్టర్లు, ఇంజనీర్లు, గుమాస్తాలు, సేల్స్ మాన్ లాంటి వాళ్ళు కూడా ఆత్మహత్యలు చెసుకున్నారన్న విషయం మీ డాడీకి చెప్పు!" ఆమె టైమ్ చూచుకుంది. "ఇంకా అయిదునిమిషాలుంది- పద!" తనూ సామానుతో ఆమెను వెంబడించాడు భవానీశంకర్. ఆమె బెర్త్ దగ్గర సామానుంచాక తను దిగి కిటికీ దగ్గర నిలబడ్డాడు. "శంకర్! నాకు ప్రామిస్ చేస్తావా?" "ఏమిటది?" ఉలిక్కిపడి అడిగాడతను. "అదే - మీ పాత స్నేహితులతో తిరగటం మానేస్తానని . మరో మంచి ఉద్యోగం చూచుకుంటాననీ....." అయిష్టంగానే ప్రామిస్ చేయక తప్పలేదతనికి. "ప్రామిస్!" అన్నాడు ఆమె చేతిలో చేయి వేస్తూ. ఆమె కళ్ళల్లో అనందం వెల్లి విరిసింది. రైలు కదిలింది. "లెటర్స్ రాస్తుంటావ్ కదూ?" "ఓ!" "వైజాగ్ కాలింగ్ లో ఉద్యోగం...." "ఓకె- ఓకె- " అన్నాడతను ఆమె మాట వినిపించు'కోకుండా! రైలు ప్లాట్ ఫారం చివరి కెళ్ళేవరకూ చేయి ఊపుతూనే ఉంది విజ్జీ! ***** "వైజాగ్ కాలింగ్" ఆఫీస్ లోకి అడుగు పెడుతున్న వాడల్లా హటాత్తుగా ఆగిపోయాడు భవానీశంకర్. "వైజాగ్ కాలింగ్" వైజాగ్ ప్రేస్టేజియస్ ఈవెనింగ్ న్యూస్ పేపర్" అన్న బోర్డు ఉండాల్సిన చోట "బుచ్చమ్మ ఊరగాయల దుకాణం" అన్న బోర్డు వేలాడుతోంది. మొదటి మేట్టుమీదనే నిలబడిపోయాడతను'. తను ప్రపంచంలో చాలా అద్భుతాలు - తమాషాలు చూశాడు. ఇంకా చాలా వాటి గురించి విన్నాడు గానీ, ఇలా ఒక్క రోజులో న్యూస్ పేపర్ ఆఫీస్ ఊరగాయల దుకాణంగా మారటం గురించి వినలేదు. ఎటూ తోచని స్థితిలో అతని భుజం మీద చేయి పడింది ఆప్యాయంగా. "పద! అంతా చెప్తాను-" అన్నాడు వైజాగ్ కాలింగ్ ఎడిటర్ సీతారామయ్య, ఇద్దరూ ఆ పక్కనే ఉన్న గణేష్ విలాస్ లో కెళ్ళి సీట్ల మీదా, టేబుల్ మీదా నిండిపోయిన ఈగల్ని పక్కకు జరిపి కూర్చున్నారు. "నిన్న రాత్రి సడెన్ గా నిర్ణయం తీసుకున్నాను భవానీ! ఇంత ఈ లాస్ భరించటం నా వల్ల కాదు. అందుకే "వైజాగ్ కాలింగ్" ని క్లోజ్ చేశాను -" భవానీశంకర్ నిశ్చేష్టుడైపోయాడు. ***** హోటల్ హుయసల ఖాళీగా ఉందారోజు. బయట సన్నని వర్షపు తుంపర పడుతోంది. ఆ హోటల్ హాల్ పక్కనే అనుకుని ఉన్న ఏసీ రూమ్ లో ఓ వ్యక్తీ కూర్చుని ప్రతి నిమిషానికి ఓసారి టైమ్ చూసుకుంటూన్నాడు. ప్రతి రెండు నిమిషాలకు ఓసారి "ప్చ్" అంటున్నాడు. ప్రతి అయిదు నిమిషాలకూ ఒకసారి "హు" అనుకుంటున్నాడు తనలో తను. మరోసారి "హు" అనుకోబోతుండగా ఏసీ రూం తలుపు ధభేల్ మన్న శబ్దంతో తెరచుకుంది. ఓ అందమయిన అమ్మాయి లోపలికి అడుగుబెట్టి గదంతా కలియజూసి మూలగా కూర్చున్న వ్యక్తిని గమనించి "హేయ్ దీప్ చంద్ " అంది ఆనందంగా. "హాయ్!" అన్నాడు దీప్ చంద్ చిరునవ్వుతో. ఆ రోజు ఆమె అలంకరణ , ఆమె ధరించిన పంజాబీ డ్రస్సూ - అన్నీ ఆమె అందాన్ని ఎన్నో రెట్లు పెంచేస్తున్నాయి. "సారీ! పదినిమిషాలు లేటయింది!" అంటూ వచ్చి అతని కేదురుగ్గా ఉన్న సీట్లో కూర్చుంది. "దట్సాల్ రైట్ !" అన్నాడతను సంబరంగా. "మరి వెళ్దామా ఇక?" అడిగిందామె వెంటనే. అతను కొంచెం తటపటయించాడు. "ఆఫ్ కోర్స్! వెళ్ళవచ్చునుకో! కానీ వెళ్ళేముందు కొన్ని వివరాలు చెప్పాలి నాకు-" "ఏమిటది!" "మీ డాడికి కోపం ఎక్కువన్నావ్ కదూ!" దిగులుగా అడిగాడతను. "అవును!" "మీ నౌకరు మొఖం మీద ఓసారి దోసకాయ పచ్చడి విసిరారని చెప్పావ్...." "దోసకాయ పచ్చడి కాదు! టమాటో-" "టమోటోనా? నేను దోసకాయనుకున్నాను-" "కాదు!" దీప్ చంద్ కి కొంచెం చెమటలు పట్టినయ్. "మరిప్పుడు -- నేను వచ్చి మన పెళ్ళి విషయం మాట్లాడితే -- నా మీద కూడా ...." అమ్మాయి కిలకిల నవ్వేసింది. 'అయ్యో! అంత- భయమెందుకు దీప్? అదీ గాక మా ఇంట్లో ఆ రెండు పచ్చళ్ళూ లేవు ప్రస్తుతానికి...." దీప్ చంద్ కి కొంత సంతృప్తి కలిగింది. "సరే, వెళ్దాం పద!" అన్నాడతను. బేరార్ కాఫీ కప్పులు తెచ్చి వారి ముందుంచాడు. "కొత్త నవల మొదలెట్టావా దీప్?" ఆసక్తితో అడిగింది అమ్మాయ్. "ఓ నిన్నరాత్రే మొదలెట్టాను! హీరోయిన్ పేరేంటో తెలుసా?" ఉత్సాహంగా అడిగాడతను. "ఏమిటి?" "అమ్మాయి...." "ఓ! నా పేరా?" "అవును! వెరైటీగా వుంటుందని పెట్టాను! నిజం చెప్పాలంటే నువ్వు నన్ను మొదటి పరిచయంతోనే ఎందుకాకర్శించావో తెలుసా?" "ఎందుకు?" "నీ పేరు వల్ల! చాలా కొత్తగా , తమాషాగా అనిపించింది. నీ పేరు. ఆడపిల్లలకు అలా 'అమ్మాయి' అన్న పేరు ఉండటం అంతకు ముందేక్కడా చూళ్ళేదు....." ఆమె చిన్నగా నవ్వింది. "ఇంక మనం బయల్దేరదామా? డాడీ వెళ్ళిపోతారేమో మళ్ళీ....." ఇద్దరూ బయటికొచ్చారు. "అసలు నీకలాంటి పేరెందుకు పెట్టారు?" అటో కోసం చూస్తూ అడిగాడతను. "మా డాడీకి జ్యోతిష్యం అంటే బోలెడు నమ్మకం! నా పేరు 'ఆ' అన్న అక్షరంతో మొదలయి 'యి' అన్న అక్షరంతో అఖరవాలని వాళ్ళు చెప్పారట! అలా "అమ్మాయి ' అన్న పెరోక్కటే సరిపోతుందని అలా పెట్టారు-" "భలే తమాషాగా ఉంది...." ఇద్దరూ అటో ఎక్కారు. అటో ఆమె ఇంటి వేపు ప్రయాణం చేస్తున్నకొద్దీ దీప్ చంద్ లో కలవరం, భయం ఆందోళనలు చాలా వేగంగా పెరిగిపోతున్నాయ్. అటో దిగి ఆమె ఇంటి వేపు నడుస్తుండగా అతని కళ్ళముందు పిడికిలి బిగించి రింగ్ లో తనను తరుముతున్న అమ్మాయి వాళ్ళ డాడీ బొమ్మ భయంకరంగా కనిపించసాగింది. దీప్ చంద్ లో సన్నగా వణుకు ప్రారంభమయింది. అమ్మాయికి అతని పరిస్థితి చూస్తే నవ్వుగానూ, జాలిగానూ కూడా ఉంది. "అయ్యో! వై ఆర్ యూ సో స్కేర్ ద్? డాడీ ఎంతో మంచివారు దీప్! ఎప్పుడో గానీ కోపం రాదు....."నచ్చచెప్తూ అందామె. "అబ్బే - నేనేం భయపడటంలేదు. జస్ట్ ....ఊరికే ....అలా...." అంటూ జేబులో నుంచి కర్చీఫ్ తీసి ముఖం తుడుచుకున్నాడు. ఇద్దరూ డ్రాయింగ్ రూమ్ లోకి చేరుకున్నారు. "దీప్! నువ్విక్కడ కూర్చో! నేను డాడీని పిల్చుకొస్తాను" అంటూ లోపలకి వెళ్ళబోయింది అమ్మాయి. "అమ్మాయ్.....!" గాబరాగా పిల్చాడు దీప్ చంద్. "ఏమిటి?" వెనక్కు తిరిగి ప్రశ్నార్ధకంగా చూసిందామె. "పోనీ ఇవాళ ....ఇవాల్టికి ....మీ డాడీతో మాట్లాడే విషయం పోస్ట్ ఫోన్ చేద్దామా?" అమ్మాయి అతని దగ్గరగా వచ్చింది. ఆమెకు అతనంత పిరికిగా ప్రవర్తించడం ఏమాత్రం నచ్చటం లేదు. అతని నవలల్లో హీరోలందరూ హీరోయిన్ తండ్రినో పురుగుని చూసినట్లు చూడటం, మాట్లాడటం, హీరోయిన్ ని లేవదీసుకుని పారిపోయి రిజిస్టర్ మారేజ్జేసు కోవటం లాంటి సంఘటనలు కోకొల్లలు.....ఆ హీరోయిజం చూసి ముచ్చట పడి', అలాంటి వన్నీ అతనిలో ఉంటాయని నమ్మి అతని వేపు ఆకర్షించబడింది తను. "అయ్యో దీప్! ఏమిటిది? నువ్వో ఫేమస్ రచయితవు! మా డాడీ అంటే అంత భయపడితే ఎలా! "అబ్బే భయం కాదు.....కానీ .....జస్ట్ ....నేనేనేదేమిటంటే - ఇంకో రోజెప్పుడయినా లీజర్ గా- మీ డాడీ మూడ్స్ బావున్నప్పుడు...." "ఇప్పుడు మా డాడీ మూడ్స్ బావోలేదని ఎవరన్నారు?" "ఆఫ్ కోర్స్ ....అనలేదనుకో...." "దీప్! ప్లీజ్! ఇంకెంతకాలమిలా ! దయచేసి కూర్చో....." అతని భుజాలు పట్టుకుని సోఫాలో కూర్చోబెడుతూ అందామె. దీప్ ఇంక కాదనలేకపోయాడు. ఆమె అందం, కళ్ళలోని ఆ ఆకర్షణ మరోమాట మాట్లాడకుండా కూర్చునేలా చేశాయతనిని! ఈ అమ్మాయి ఇంత గొప్ప అందగత్తె కాకపోయినట్లయితే తనీమెను పెళ్ళి చేసుకోవాలన్న నిర్ణయానికే వచ్చేవాడు కాదసలు! ఇంతకుముందు ఎంతమంది అమ్మాయిలతో ప్రేమ కలాపాలు జరుపలేదు! ఎందుకో అమ్మాయిని చూసిన క్షణం నుంచే ఆమెను శాశ్వతంగా తన దానిని చేసుకోవాలన్న నిశ్చయానికొచ్చేశాడు. అమ్మాయి లోపలికెళ్ళింది. దీప్ చంద్ తలెత్తి గోడ కున్న నేమ్ బోర్డ్ వంక చూశాడు. "ఆర్ భీమారావ్ , మెంబర్ ఆఫ్ పార్లమెంట్" అన్న అక్షరాలు కూడా భయంకరంగా కనపడుతున్నాయ్. ఆ అక్షరాల్లోనుంచి ఓ బట్టతల వ్యక్తీ తనమీదకు తుపాకీ గురి చూస్తున్న చిత్రం అతని కళ్ళ ముందు కొచ్చింది. సరిగ్గా అదే సమయంలో లోపల్నుంచి ఇల్లదిరేలా కేకలు వినిపించినాయ్. "ఏమిట్రా! ఇడ్లి లోకి కొబ్బరి పచ్చడి చేయమంటే శనగపచ్చడి చేస్తావా! ఎంత ధైర్యం నీకు! ఇడియట్! ఆ శనగపచ్చడి నీకెలా తినిపిస్తానో తెలుసా? ఇలా - ఇలా- ఇలా-" ఆ డైలాగ్ తో పాటు ఏదో పిండి పదార్ధం "తప్" మన్న శబ్దం తో ఎక్కడో పడుతున్నట్లు కూడా తెలుస్తోంది. "బాబోయ్! పొరపాటయింది సారూ! రచ్చించండి" అన్న కేక. దీప్ చంద్ గుండెలు వేగంగా కొట్టుకోసాగినాయ్. వణుకు ఎక్కువయిపోయింది. క్రమీపీ లోపల శభ్దాలు ఆగిపొయినాయి. మరి కాసేపటి తర్వాత అమ్మాయి పరుగుతో, ఆనందంగా బయటి కొచ్చింది. "దీప్! లోపలకురా! ఇదే మంచి టైమ్! డాడీ మంచి మూడ్ లో ఉన్నారు...." అంటూ డ్రాయింగ్ రూమ్ లో ఎక్కడా దీప్ చంద్ కనిపించకపోయేసరికి నిర్ఘాంతపోయి నిలబడిపోయింది. మొదటిసారిగా ఆమెకు తీవ్రమయిన నిరాశ కలిగింది. దాని వెనుకే కోపం, బాధా- అన్నీ మిళితమయిన భావన మొఖంలో ప్రవేశించింది. అక్కడే నీరసంగా సోఫాలో కూలబడి పోయింది 'ఇడియట్' అనుకుంది కసిగా! ***** సికింద్రాబాద్ స్టేషన్ లో దిగాడు భవానీశంకర్. టైమ్ పొద్దున్న ఆరున్నరవుతోందప్పుడు. వేడివేడి "టీ" తాగుతే బావుంటుందానిపించింది. రైల్వే రిఫ్రెష్ మెంట్స్ కెళ్ళాడు. కానీ అక్కడ అప్పుడే ఓ ప్రయాణికుడు తాగిన టీ" అంతా వాష్ బేసిన్ లో వాంతి చేసుకోవడం చూశాక ఆ ప్రయత్నం విరమించుకుని బయటికొచ్చి నిలబడ్డాడు. ఎదురుగా ఉన్న బస్ట్ స్టాప్, చెత్తా చెదారంతో పూర్తిగా కప్పబడి పోయి ఉన్న రోడ్లూ- ఆరున్నరకే కిటకిటలాడిపోతున్న అల్పా హోటలూ- అవన్నీ చూసేసరికి పాతరోజులు గుర్తుకొచ్చేసినాయ్. యస్! నిజంగా గోల్డెన్ డేస్ అవి. తనతో పాటు సెయింట్ మేరీస్ లో చదివిన జయకర్ గాడు , నిసార్ గాడు చిరంజీవి గాడూ, జోసఫ్ , రాదే శ్యామ్ -- వీళ్ళంతా ఎక్కడున్నారో - ఏం చేస్తున్నారో - రాబిన్ హుడ్, రాజు వీళ్ళిద్దరే తనతో పాటు వైజాగ్ యూనివర్శిటీ కొచ్చేశారు. సూట్ కేస్ మోసుకుంటూ అల్పా హోటల్ చేరుకున్నాడు భవానీ శంకర్. "టీ" తాగి నెంబర్ - వన్ బస్ ఎక్కాడు. నలభై నిమిషాల సేపు దేశమంతా వన్ వే ట్రాఫిక్ లో తిరిగి చివరకు నారాయణగూడా చేరుకుంది. అక్కడ దిగి తన జేబులో ఉన్న కాగితం తీసి, దాని మీదున్న ఇంటి నెంబరు వెతుకుతూ బయల్దేరాడు. నూటపర్నాలుగు బై నాలుగు నెంబరు గల ఇంటి ప్రక్కనే తోమ్మిదోందల పదహారు బై ఒకటి నెంబరు ఇల్లు కనిపించే నగరం అవటం వల్ల చాలా సేపు పట్టిందతనికి- ఆ అడ్రస్ కనుక్కోడానికి. "మాస్టారూ!" తలుపు బయటే నిలబడి పిలిచేడు. పుట్టుకతోనే స్కూలు యూనిఫారంతో పుట్టినట్లున్న ఓ చిన్న పిల్ల చెంగున లోపల్నుంచి ఎగురుతూ బయటికొచ్చింది. భవానీశంకర్ ఆ పాపను చూసి చిరునవ్వు నవ్వాడు. "హాయ్! వాటీజ్ యువర్ నేమ్ బేబీ?" "అపర్ణ అప్పర్ కేజీ! నీ పేరేంటి?" "భవానీశంకర్ లోయర్ కే.జీ?" ఆ పిల్ల ఆశ్చర్యంగా చూసింది. ఈలోగా లోపల్నుంచి ఓ లావుపాటావిడ వచ్చేసింది. "నమస్కారమండీ! మీ పేరు పార్వతమ్మగారే కదండీ! ఇదిగో - సీతారామయ్యగారు మీకీ ఉత్తరం ఇమ్మన్నారండీ.!" "ఎవరూ! "వైజాగ్ కాలింగ్" సీతారామయ్యా!" "అవునండీ!" ఆవిడ ఉత్తరమంతా గడగడ చదివేసింది. ఆమె ముఖంలో ఎక్కడ లేని విచారం అల్లుకుపోయింది. "అయ్యో పాపం ! "వైజాగ్ కాలింగ్" మూసేశారన్న మాట!" అంది దిగులుగా. చాలా తరచుగా తన ఫోటోలు ప్రచురించే పేపరు అదొక్కటే మరి! "అవునండి పాపం'!" "ఎందుకని పాపం!" "ఏమోనండి పాపం! బహుశా ఎవరూ కొనక అనుకుంటానండీ!" "అయ్యో నాకీ విషయం చెప్తే యాభయ్ కాపీలు మావారి ఫాక్టరీ తరపున కొనిపించేదానిని కదా!" 'అయినా లాభం ఉండడనుకుంటానండీ పాపం!" "ఇంతకూ నీ పేరేమిటన్నావ్!" "భవానీశంకర్ అండీ! గోల్డ్ మెడలిస్ట్ భవానీశంకర్!" "అదేమిటి? గోల్డ్ మెడలిస్ట్ అనే యింటి పేరుంటుందని నాకింత వరకూ తెలీదు...." "అబ్బే అది ఇంటి పేరు కాదండీ! గోల్డు మెడల్ యునివర్సి టి వాళ్ళు ఇచ్చారన్నమాటండీ నాకు!" "అలాగా! ఎందుకు పాపం?" "అదేనండీ! జర్నలిజంలో నేను తెగ చదివి ఫస్ట్ న పాసయ్యాను కదండీ పాపం! అందుకని గోల్డు మెడల్ యిచ్చారండీ!" "అయితే నువ్వు జర్నలిస్ట్ వన్న మాట పాపం!" "అవునండీ! "వైజాగ్ కాలింగ్" లో మీ ఫోటో కింద "భారతదేశంలో బీదలకు వెలుగు! పార్వతీదేవి వల్ల కలుగు!" అని కాప్షన్ రాసిందేవరనుకున్నారు? నేనేనండీ!" "ఏమిటి? అది రాసింది నువ్వా? మా నాయనే! ఇదిగో - సావిత్రీ - ఓ సావిత్రీ! నేస్కేఫ్ కాఫీ తీసుకురా పాపం! కూర్చో నాయనా.కూర్చో !' మరింత ఆప్యాయంగా అందావిడ. భవానీశంకర్ ఆనందంగా కూర్చున్నాడు. "నీ ఉద్యోగానికే భయం లేదులే! ఎక్కడో చోట తప్పక ఇప్పిస్తాను! ఒకవేళ ఎక్కడా దొరక్కపోతే రేడియో స్టేషన్లో చేరిపో." భవానీ శంకర్ ఉలిక్కిపడ్డాడు. "రేడియో స్టేషన్లోనా? ఎక్కడా దొరక్కపోతే రేడియో స్టేషన్లో ఇచ్చేస్తారండీ?" "అవును మరి! రేడియో స్టేషన్లు పెట్టిందెందుకు మరి? మనక్కావలసిన వాళ్ళకు ఎంప్లాయిమెంట్ ఎక్సెంజిలు, ఇంటర్యులు లాంటివి లేకుద్నా ఉద్యోగాల్లో వేసుకోడానికేగా.....నేను బోలెడు మందికి టెంపరరీ ఉద్యోగాలేయించాను అందులో పాపం! అంతగ్గాకపొతే నువ్వూ ముందు అందులోనే చేద్దువుగానిలే! ఆ తరువాత కావాలంటే మంచి ఉద్యోగం చూచుకోవచ్చు...." "అబ్బే కాకుండా పోనీనండీ! అవనీ కుండానే వచ్చేస్తాను..." "సరే ! వెళ్ళిరా పాపం!" "అలాగేనండీ-" అని అక్కడే నిలబడ్డాడతను. "ఇంకా నిలబడ్డావేం?" ఆశ్చర్యంగా అడిగింది పార్వతమ్మగారు. "నాకోసం, సావిత్రిని నేస్కేఫ్ కాఫీ తెమ్మన్నారు కదండీ -" "ఓ! సారీ, మర్చేపోయాను ! సావిత్రీ! ఒక కప్పు నేస్కేఫ్ నిజంగానే తీసుకురా' ! పాపం!" ***** భవానీశంకర్ రోడ్డు మీద నడుస్తూ "జయంబు నిశ్చయంబురా, భయమ్ములేదురా జంకుబొంగు లేక ముందుకు సాగిపొమ్మురా" అన్న పాట విజి,విజిలేస్తున్నాడు. అతనికిప్పుడు చాలా హుషారుగా ఉంది. వైజాగ్ నుంచి రాజధానికి వలస రావటం చాలా మంచిదయింది. సీతారామయ్య లెటర్ నెంబర్ వన్ రేడియో స్టేషన్లో చిన్నసైజు ఉద్యోగం ఇప్పించింది. లెటర్ నెంబర్ టూ - హిమాయత్ నగర్ లో రూమ్ ఏర్పాటు చేసింది. ఈ శుభ సమయంలో తన హైదరాబాద్ వలస గురించి విజ్జీకి ఉత్తరం రాయటమే తన ప్రస్తుత నడకకు కారణం! ఎందుకంటె తను హైద్రాబాద్ లో సెటిలయితే ఆనందించేది ఆమె ఒక్కర్తే. పోస్టాఫీస్ చేరుకొని ఇన్ లాండ్ కవర్ తీసుకుని ఉత్తరం రాయటం ప్రారంభించాడతను. "హలో డియర్!" నీకో అద్భుతమైన శుభవార్త! మా "వైజాగ్ కాలింగ్" (ది మోస్ట్ ప్రిస్టేజియస్ ఈవినింగ్ న్యూస్ పేపర్ ఆఫ్ వైజాగ్) మూతబడిపోయింది. అంచేత నేను పొట్ట చేత్తో పట్టుకుని హైద్రాబాద్కు వలస వచ్చేశాను. (నీ కోరిక నెంబర్ వన్ తీర్చేశాను! గుర్తుంచుకో) ఇక్కడ ప్రస్తుతం రేడియో స్టేషన్ లో క్యాజువల్ గా వర్క్ చేస్తున్నాను. త్వరలో నీకోరిక నెంబర్ - టూ ప్రకారం దీప్ చంద్ ని కలుసుకుని సరెండర్ అయిపోతాను - వార్తలు ఇంతటితో సమాప్తం! యువర్స్ లవింగ్ బర్డ్ -" ఉత్తరం పోస్ట్ చేశాక మళ్ళీ "రావోయి చందమామ' - మా వింత గాధ వినుమా?" పాట పాడుకుంటూ రేడియో స్టేషన్ చేరుకున్నాడు. ఆ రోజుకి సరిగ్గా పదిహేను రోజులయింది. రేడియో స్టేషన్ లో చేరి. ప్రోడ్యుసర్లు, అసిస్టెంట్లు, అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టరూ - అందరూ బయటే నిలబడి ఉన్నారెందుకో!" తనను చూడగానే "వస్తున్నాడు- వస్తున్నాడు" అని గట్టిగానే అనుకోవటం వినిపించింది భవానీశంకర్ కి! "హలో హలో హలో - గుడ్ మాణింగ్ ఎవిరిబడి ....." అన్నాడు భవానీశంకర్ ఇనుమడించిన ఉత్సాహంతో. అతని విష్హింగ్ ని ఎవరూ పట్టించుకోలేదు. అందరూ కలసి అసిస్టెంటు స్టేషన్ డైరెక్టర్ వేపు చూశారు. అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ భవానీశంకర్ వేపు చూశాడు. "సో! యూ ఆర్ భవానీశంకర్!" అన్నాడు చాలా సీరియస్ గా. "సెంట్ పర్సెంట్ సర్! గోల్డ్ మెడలిస్ట్ భవానీశంకర్ అని కూడా అనవచ్చు మీరు! నో ప్రాబ్లం!" "స్టేషన్ డైరెక్టర్ గారు మిమ్మల్ని అర్జంట్ గా రమ్మంటున్నారు." "ఓ యస్! పదండి! విప్లవాత్మకమయిన అయిడియాలున్న టాలెంటేడ్ పీపుల్స్ ని చూడాలని ఎవరికయినా అనిపిస్తుంది- నధింగ్ అనూజవల్ - పదండి!" గుంపంతా వెంటరాగా ఇద్దరూ ఎస్.డి. చాంబర్ లో కెళ్ళారు. "సో- యూ ఆర్ భవానీశంకర్!" అన్నాడు స్టేషన్ డైరెక్టర్ కోపంగా. "యస్. మైడియర్ సర్! దిగ్రేట్ గోల్డ్ మెడలిస్ట్ భవానీశంకర్ నేనే!" "వాట్ గోల్డ్ మెడలిస్ట్?" "జర్నలిజంలో గోల్డ్ మెడల్ సంపాదించాను సర్! "వైజాగ్ కాలింగ్" లో బీచ్ రోడ్ శవం మిస్టరీ సాల్వ్ చేసిందేవరనుకున్నారు? నేను! నేనే ఇన్ వేస్టిగేట్ చేసి రాసిన రిపోర్టుని బట్టి పోలీసులు ప్రొసీడ్ అవగలిగారు. మీరు "వైజాగ్ కాలింగ్" చదవ లేదూ?" "లేదు! ఇప్పుడా సంగతి అనవ....." "ఆఫ్ కోర్స్! మీరు చదవకపోవచ్చు! ఎందుకంటే ఇంటలిజెన్స్ యా చదివే డెయిలీ అది! ది మోస్ట్ ప్రిస్టేజియస్ ఈవెనింగ్ న్యూస్ పేపర్ పబ్లిష్ డ్ సైమల్టేనియస్లీ ఫ్రం వైజాగ్ - వన్ అండ్ వైజాగ్ - టూ ! దాని స్పెషల్ రిపోర్టర్ గా...... "మీరు కాసేపు నిశ్శబ్దంగా ఉంటారా?" రూమ్ ఎగిరిపోయేటట్లు అరచాడు యస్.డి . భవానీశంకర్ ఓ క్షణం రూఫ్ వంక చూసి ఆ తరువాత స్టేషన్ డైరెక్టర్ వంక చూశాడు. "అలా గట్టిగా అరవటం చాలా డేంజరస్ సార్! మనదసలె ఓల్డ్ బిల్డింగ్! మొన్న "డ్రామా" రూమ్ లో ఎవరో అరుస్తే - "టాక్స్" రూమ్ లో గోడ పగుళ్ళు చూపింది. ఒకవేళ ఇప్పుడది జరక్కపోయినా దగ్గరగా ఉన్న "జనరంజని "ప్రోగ్రాం లోకి మీ గొంతు జొరబడి తద్వారా ఆరుకోట్ల ఆంధ్రులు భయభ్రాంతులవవచ్చు!" "భవానీశంకర్!" నెమ్మదిగా పిలిచాడు స్టేషన్ డైరెక్టర్. "యస్ సర్" వినయంగా జవాబిచ్చాడతను. స్టేషన్ డైరెక్టర్ కోపం దిగమింగి నెమ్మదిగా మాట్లాడటం ప్రారంభించాడు. "ధన్యజీవులు ప్రోగ్రాం చేసింది మీరేనా?" "ఓ! అదేనా? నాకు తెలుస్సార్! దానికి పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చెలరేగుతాయని! రేడియో స్టేషన్ హిస్టరీలోనే గొప్ప ఇంటర్యుఅది...." "మిస్టర్ భవానీశంకర్! నేనడిగిందానికి మాత్రమే సమాధానం చెప్పండి!" "అంటే! మీరనేది అన్సర్ టు ది పాయింట్ అని! అంతేనా! ఓకే ఎగ్రీడ్! ఎవరి టెస్ట్ వాళ్ళది. మా జర్నలిజం వాళ్ళకు ఎంత ఎక్కువ మాట్లాడితే అంత అనందం! మా జర్నలిజం క్లాస్ మేట్ కామేశ్వర్ కరాటే బాంబేలో ఓసారి...." "మిస్టర్ భావానీశంకర్....." "ఓ! అయాం సారీ! మనది అన్సర్ టు ది పాయింట్ ప్రోగ్రాం అన్న విషయం మర్చిపోయాను. "ధన్యజీవులు" ప్రోగ్రాం కింద నేనే మల్లి గాడిని ఇంటర్యు చేశాను సార్! ప్రతాపసింగారం అనే ఊరు బయట ఉంటాడు! పధ్నాలుగు పందులున్నాయి అతనికి! వెరీ రిచ్ ఫెలో! బైది బై ! ఆ ఇంటర్యు చాలా రివల్యుషనరీగా చేశాను! మీరు గమనించారో లేదో! మన రేడియో స్టేషన్ చరిత్రలో అంత ఫ్రీ అండ్ ఫ్రాంక్ ఇంటర్యూ ఎవరూ చేసి వుండరు! అన్నట్లు మీరా ఇంటర్యూ విన్నారా సార్?" "విన్నాను! అందుకే నిన్ను పిలిపించాను...." "నాకు తెలుస్సార్! కొత్తదనం కోరేవారు - ఆ ఇంటర్యూ వింటే నడిరోడ్డు మీదయినా సరే, పెద్ద ఎత్తున హర్శాధ్వానాలు చేస్తారు అంతేకాదు....." "అయ్యా! ధన్యజీవులు కార్యక్రమంలో మల్లిగాడితో ఇంటర్యూ సరికొత్త తరహాలో బ్రహ్మాండంగా ఉంది! ఇంటర్యూ చేసిన యాంగ్ మాన్ కి మా హృదయ పూర్వక అభినందనలు! దయచేసి అయన చిరునామా వెంటనే తెలపవలసిందిగా కోరుతున్నాము. ఇల్టు శారద, నీరద, వీరద, గీరద, ఎరోద మరియు వారి కుటుంబ సభ్యులు - వంగపల్లి! లాంటి ఉత్తరాలు 'లేఖావళికి గుప్పించేస్టారు......" "మిస్టర్ భవానీశంకర్ ...." మళ్ళీ అడ్డుపడ్డాడు స్టేషన్ డైరెక్టర్. "యస్ మైడియర్ సర్......"చిరునవ్వుతో అడిగాడతను. "మీరు కాసేపు నిశ్శబ్దంగా వుంటే...." "ఓ! విత్ ప్లెజర్! విత్ ప్లెజర్!" "యస్.డి. టేబుల్ మీదున్న టేప్ రికార్డర్ కేసెట్ ఉంచి "అన్" చేశాడు. భవానీశంకర్ గొంతు ఖంగున మోగింది అందులో నుంచి. "మిస్టర్ మల్లిగాడూ! పాపం మీ బలహీన వర్గాల కోసం ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టి ఇళ్ళు కట్టించింది కదా! మరి యిప్పుడు మీరుంటున్న ఇల్లు అదేనా?" "ధూ నీయవ్వ! గిసవంటి యిల్లంటారువయ్యా! గింత వర్షమొస్తే నీళ్ళు కారబట్టే - నా పెద్ద కొడుకు దిల్లగీల తాకితే గోడ పక్కకి పడిపాయే...." "ఓహో! అయితే ఆ ఇల్లు చాలా బావుందన్నమాట! ఇకపోతే....." "అదో! మళ్ళ గట్లంటవు! నీయవ్వ సర్కారోడి ఇంటి కంటే గుడిశె మంచి గుంటది.... ఏమంటున్న!" "సరే! ఇక మనం పందుల విషయానికొద్దాం! ఇన్ని పందుల మధ్య నువ్వు ఎంతో సుఖంగా జీవితం గడుపుతున్నావ్ కదా! మరి ఈ పందుల్ని సమకూర్చుకునేందుకు ప్రభుత్వ బాంక్ నీకు చాలా పెద్ద ఎత్తున బుణసహాయం అందజేసినది కదూ?" "ధూ నీయవ్వ! తోమ్మిదోందలియ్యనికి ఆరు నెలలు తిప్పబెట్టె! శాంక్షనయింక కూడా మినిస్టరోచ్చి ఇస్తడు -- మినిస్టరోచ్చి ఇస్తడు అని ఇంకొక ఆరునెల్లు దుకాయించే- ఆ పైసలు చేతికియ్యనికి మా సర్పంచి రాజిగాడు పైసలినబట్టే! బాంక్ గుమస్తా పైసల్దినే! అందరు తినంగ ఇంక నాకేం మిగిలెడిదున్నదివయ్య- బూడిద!" స్టేషన్ డైరెక్టర్ టేప్ రికార్డర్ స్విచ్చాఫ్ చేశాడు. "ఏమిటిది?" అన్నాడు తన గొంతు వాల్యూం పెంచేస్తూ. "అంటే మీ ఉద్దేశ్యం......" అని ఏదో డౌటు క్లియర్ చేసుకోబోయాడు గానీ స్టేషను డైరెక్టరు అందుకు అవకాశం ఇవ్వలేదు. "ఆ మల్లిగాడు ఓపక్క గవర్నమెంటునీ, గవర్నమెంటు బాంకుల్నీ అంత దారుణంగా విమర్శిస్తూ మాట్లాడుతుంటే అదంతా రికార్డు చేస్తావా? మన రేడియో , టీవీ ఉన్నది ఎందుకు? గవర్నమెంటు తరపున ప్రచారం చేయడానికి! అధికారంలో ఉన్న పార్టీని ఆకాశాని కెత్తటానికి! అందుకే గవర్నమెంటు మనకి జీతమిస్తోంది! వాళ్ళ డబ్బు తిని తిన్న ఇంటి వాసాలు లెక్క పెడతావా?" భవానీశంకర్ చిరునవ్వు నవ్వాడు. "పొరపాటు సార్! చాలా పొరపాటు పడ్డారు మీరు! మనది డెమోక్రసీ! డెమోక్రసీలో ప్రతి పౌరుడికి వాక్ స్వాతంత్యం ఉంది! మన రేడియో స్టేషన్ పేరు ప్రఖ్యాతులు పొందాలంటే వాక్ స్వాతంత్యాన్ని గౌరవించాలి! బైదిబై డిగ్రీ కోర్సులో మీ సబ్జెక్టు ఏమిటి సార్?" "భవానీశంకర్...." నెమ్మదిగా పిలిచాడు స్టేషన్ డైరెక్టర్. "ఓ! అయాం సారీ! అన్సర్ టు ది పాయింట్ ప్రోగ్రాం కదా మనది! మర్చిపోయాను." "ఇంటర్యూ నుంచి అభ్యంతరకరమైన మేటర్ తొలగించి 'దబ్' చేయమని ప్రొడ్యుసర్ గారు నీకు చెప్పారా లేదా?" మళ్ళీ అరచాడు ఎస్.డి. "ఓ యస్ చెప్పారండీ! నిజానికి తొలగించేశాను కూడా! కాని ఇంటి కెళ్ళాక మళ్ళీ ఆలోచిస్తే -- అన్ సెకెండ్ థాట్స్ - ఇంటర్యూ ఉన్నదున్నట్లుగా బ్రాడ్ కాస్ట్ చేస్తేనే వెరైటీగా వుంటుంద'నిపించింది.....పర్సనల్లీ నేను ఫ్రాంక్ టాక్ వే లైక్ చేస్తాను." "టు హెల్ విత్ యూ అండ్ యువర్ ఫ్రాంక్ టాక్! దీనివల్ల ఇప్పుడు నష్టం ఎవరికో తెలుసా/ ప్రొడ్యుసర్ రావ్ కి! 'ధన్యజీవులు' ప్రోగ్రాం అతనిది కనుక అతను పనిష్మెంట్ అనుభవించాలి!" భవానీశంకర్ వెనక్కు తిరిగి గుంపులో ముందు లైన్ లో నిలబడ్డ రావ్ వంక చూశాడు. పలుకరిస్తే చాలు భోరున ఎడ్చేసేట్లు కనిపించింది రావ్ వాలకం! భవానీశంకర్ ఆప్యాయంగా అతనిని చూసి చిరునవ్వు నవ్వాడు. "డిస్కరేజ్ అవకండి సర్! మన్దేశంలో సిసలయిన డెమోక్రసీ పునరుద్దరించడానికి పాటుపడ్డ వీరుల స్మృతి చిహ్నాల్లో నా పక్కనే మీది కూడా ఉంటుంది...." "భావానీశంకర్ ! ఫర్ గాడ్ సేక్ స్టాప్ దిస్ నాన్సెన్స్!' గట్టిగా అరిచాడు. "అలా అరవకండి సార్! అలా తరచి కొలాప్స్ అయిపోయిన ఫెలోస్ ని చాలామందిని చూశాన్నేను." స్టేషన్ డైరెక్టర్ అతికష్టం మీద కోపం అణచుకొని పక్కకు తిరిగి ఏఎస్డీ వేపు చూశాడు. "ఎవరి రికమెండేషన్ తో ఈ మాద్ ఫెలోకి ఉద్యోగం ఇచ్చాం మనం!" కోపంగా అడిగాడు స్టేషన్ డైరెక్టర్. "పార్వతమ్మగారి రికమెండేషనండి!" "ఐసీ! ముందు ఇతనిని ఇక్కడ నుంచి బయటకు గెంటండి! ఇంకోసారి రేడియో స్టేషన్ ఆవరణలోకి రాకుండా కట్టుదిట్టాలు చేయండి!" 'అలాగే సార్" భవానీ శంకర్ నవ్వాడు. "కోపంలో మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలీటం లేద్సార్! తీరా నేను వెళ్ళిపోయాక 'వేరీజ్ దట్ గ్రేట్ యాంగ్ మాన్? రివల్యుషనరీ అయిడియాలతో క్రిక్కిరిసిపోయిన భవానీశంకర్ ని తీసుకురండి! అతను ఏ పరిస్థితిలోనూ రేడియో స్టేషన్ ఆవరణ వదలకుండా చూడండి - " అంటూ మీరే పశ్చాత్తాపపడి దుఃఖం భరించలేక -" "గెటౌట్....." మళ్ళీ రూఫ్ ఎగిరెట్టు అరిచాడు స్టేషన్ డైరెక్టర్

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published.