అమ్మాయీ ఓ అమ్మాయీ 14
telugu stories sahithi అమ్మాయీ ఓ అమ్మాయీ 14 అతను లేవలేదు. 'ఆవేశ పడకండి! మనం పరస్పర క్షేమసమాచారాల గురించి మాట్లాడుకుంటున్నాం!" అన్నాడు చిరంజీవితో.
భవానీశంకర్ చిరంజీవి చేయి పట్టుకుని కూర్చోబెట్టాడు.
"చూడు మిత్రమా! డొంక తిరుగుడు వదిలేసి విషయంలోకి వచ్చేసేయ్! నువ్వెవరు? నిన్నెవరు పంపారు? ఆ వార్త ఆపడం వల్ల నీకేమిటి లాభం?' అడిగాడు భవానీశంకర్.
"ఆ వివరాలన్నీ ఇప్పుడు అప్రస్తుతం అనుకుంటాను. మీరు ఆ వార్త ప్రచురిస్తుండటం వల్ల ఓ పెద్దమనిషికి అనుకోని చిక్కులు ఎదురవుతున్నాయ్! అతను ఇలాంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకోవలసిన అవసరం లేదు ! అయినా గాని ...."
"ఎవరా పెద్ద మనిషి?" అడిగాడు చిరంజీవి.
"పేరులో ఏమున్నది పెన్నిధి అన్నారెవరో! అంచేత వదిలేసేయండి! చూడండి - మీరు ఎంతో కష్టపడి ఈ పేపర్ని అభివృద్ధిలోకి తీసుకొస్తున్నారని మాకు తెలుసు! ఇదంతా ఎందుకు చేస్తున్నారు? బ్రతుకుతెరువు కోసం! అలాంటి సెన్సేషన్ న్యూస్ ప్రచురిస్తే గానీ మీ పేపరు నిలబడదు! మాకు తెలుసు! కానీ ఈ ఒక్క వార్త గురించి ప్రచురించడం అపెసినంత మాత్రాన మీకు వచ్చే నష్టమేమీ ఉండదు! ఒకవేళ ఏ కొద్దీ పాటో నష్టం వచ్చినా మీరు పట్టించుకొనక్కరలేదు. ఆ నష్ట పరిహారం మేమిస్తాం!"
భవానీశంకర్ తో పాటు చిరంజీవి, స్వప్నా, కూడా నిర్ఘాంతపోయారు. ముందుగా భావానీశంకరే ఆ షాక్ నుండి కోలుకున్నాడు.
"సహోదరా! ఇంక నువ్వు బయటకు నడిచేసేసమయమాసన్నమైంది. 'తెలుగు కిరణం' చిన్న పేపరే కావచ్చు! కానీ 'తెలుగు కిరణం' మీద విపరీతమైన అభిమానానురాగాలు కురిపిస్తున్న తెలుగు ప్రజల నమ్మకాన్ని మాత్రం ఇలా డబ్బుకి అమ్ముకోదు! అంచేత......."
అతను కూడా లేచి నిలబడ్డాడు.
"మీకు ఆ పెద్దమనిషి విషయం తెలీక ఇలా మాట్లాడుతున్నాడు. తనకు చిరాకు కలిగించే వాళ్ళకు రూపు రేఖల్లెకుండా చేయగలడు! నిజం చెప్పాలంటే -- చాలామంది ఆయనకు చికాకు కలిగించి అనవాల్లెకుండా 'మసి' అయిపోయారు. అంచేత మీరు కేవలం మీ క్షేమం కోసం....."
చిరంజీవి రక్తం ఉడికిపోయింది.
తనకు ప్రస్తుతం డబ్బు లేకపోవచ్చు! అనేకమంది సహాయం ప్రస్తుతం తనకవసరం కావచ్చు! అంతమాత్రాన 'బెదిరింపులకు' లొంగటం మాత్రం తన వల్ల కాదు. అసలలాంటి బెదిరింపులు వింటేనే ఆవేశం