అర్దరాత్రి ఆడపడుచులు 14
telugu stories sahithi అర్దరాత్రి ఆడపడుచులు 14 "ఎక్కడికే బయల్దేరావ్ ముసల్దానా?" అంది కామాక్షి కఠినంగా. నోటివెంబడినిప్పులు కక్కుతున్నట్లు వస్తున్నాయి ఆమె మాటలు.
నిజంగానే ఆ సమయంలో ఆ వైర్లలో నుంచి ఛక్ ఛక్ ఛక్ మని ఎలక్ట్రిక్ స్పార్క్ లు వెలువడ్డాయి.
భయకంపితురాలయిపోయింది అహల్య. "నన్ను....నన్ను క్షమించండి!" అంది తడపడుతూ.
"క్షమించడమానిన్నా!" అని మళ్ళీ విరగబడి నవ్వారు సృజనా, కామాక్షీ. నవ్వుతూ తీగెల్లాగా ఊగిపోయారు మళ్ళీ.
కళ్ళు మరింతగా మసకలుకమ్మాయి అహల్యకి. కళ్ళు మరింతగా చిట్లించి చూసింది.
ఇప్పుడు ఆమెకి సృజనా, కామాక్షీ కనబడటంలేదు. కేవలం రెండు ఎలక్ట్రిక్ వైర్లు కనబడ్డాయి. అంతే!
ఏదీ! సృజన ఏదీ! ఇప్పటి దాకా ఇక్కడే కనబడింది కదా! ఇప్పుడు కనబడదేం! తన కళ్ళే తననిమోసం చేస్తున్నాయా?
అప్పుడు మళ్ళీ వినబడింది సీత గొంతు. "ఎక్కండి నాన్నగారూ!" అంటోంది.
ఆగొంతు నిజంగా సీత గొంతేనా?లేకపోతే అదీ తన భ్రమేనా? సీతా వాళ్ళ నాన్న నిజంగా వచ్చారా?
ఆరాటంతో అల్లాడిపోతోంది అహల్య అంతరంగం.
కారు ఇంజన్ స్టార్టు అయిన శబ్దం వినబడింది.
అంటే..సీతవాళ్ళ నాన్నతో కలిసి వెళ్ళిపోతోందా? ఇంతదూరం వచ్చితనని చూడకుండానే వెళ్ళిపోతోందా? ఇంతకంటే గుండెకోత వేరే ఏదన్నా ఉంటుందా?
మనసు ముక్కలు ముక్కలు చెక్కలైపోతున్నట్లు అనిపించింది అహల్యకి.
"సృజనా!" అని కేకపెట్టింది హృదయవిదారకంగా. సీత తనపిలుపు వినాలి విని తిరిగిరావాలి?
కానీ ఆమె పెట్టిన పెనుకేక ఆమె పెదవులు దాటిబయటకు రానేలేదు. అప్పటికే మాటపడిపోయింది ఆమెకి.
బయటకారు కదిలిన శబ్దం.
తనకు కనబడకుండానే సృజన వెళ్ళిపోతోందేమోననే ఆలోచనే అహల్యకి అంతులేని తెగువనీ, ఎక్కడలేని శక్తినీ ఇచ్చింది. లేచి నిలబడింది తను.
ఎదురుగా వేళ్ళాడుతున్న లైన్ కరెంట్ వైర్స్ ని లెక్కచెయ్యలేదు ఆమె