అర్ధరాత్రి ఆర్తనాదం 1

By | August 6, 2022
telugu kathalu navalalu sahithi అర్ధరాత్రి ఆర్తనాదం 1 "అవును సరిగ్గా ఐదుసార్లు" ఈ మాట అనిత ఏ అరవైసార్లో అనుకుంది. కిరణ్ కి ఆ మధ్యాహ్నం నుంచి సాయంత్రం ఐదు లోపల ఐదుసార్లు ఫోన్ చేసింది. "నో రెస్పాన్స్" "కిరణ్ ఏమయ్యాడు? ఎక్కడికి వెళ్ళాడు?" ఎంత ఆలోచించినా అనితకు అర్ధం కాలేదు. అర్జంట్ గా కిరణ్ ను కలుసుకోవాలి ఈ వార్త అందించాలి. అపుడు కిరణ్ ఏమంటాడు! ఏమైనా అనచ్చు. "ఎంత గుడ్ న్యూస్ వినిపించావు అనితా!" అనొచ్చు. "అబ్బ, అప్పుడే ఏం తొందర అనితా!" అనొచ్చు. "ఏమో ఏమైనా అనొచ్చు!" ఏదైనా అది కిరణ్ ని కలుసుకున్న తరువాత సంగతి. కిరణ్ ఏమయ్యాడు? ఎక్కడికి వెళ్ళాడు?" అరగంటకి ఒకసారి ఆగి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తే నాధుడు కనపడలేదు. మహానుభావుడు ఎక్కడ తిరుగుతున్నాడో! అనిత ఆలోచిస్తూ అటు ఇటు పచార్లు చేస్తూ ఉండిపోయింది. చాలాసార్లు కిరణ్, అనిత అదేపార్కులో కలుసుకున్నారు. కిరణ్ కోసం వెతికి వేసారి అనిత చివరకు పార్కుకు వచ్చి పచార్లు చేస్తూవుండిపోయింది. "ఇపుడు కిరణ్ ను ఎక్కడ పట్టుకోవాలి?" అతని కోసం ఎక్కడంటూ వెతకాలి? అనిత ఆందోళనగా ఆలోచిస్తుంటే, అదే సమయంలో కిరణ్ పార్కులో కాలు పెట్టాడు. అనితను చూసి కిరణ్ "హాయ్ అనితా?" అన్నాడు. కిరణ్ ని చూసి అనిత రెట్టింపు సంతోషంతో "హాయ్ హాయ్ నాయకా" అంది అనిత. "ఏంటి చాలా హుషారుగా వున్నావ్! దగ్గరికి వచ్చి అడిగాడు కిరణ్. "ఆ విషయం తరువాత చెప్తాను. ముందు ఇది చెప్పు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం లేదు" అని అడిగింది అనిత. "వెయ్యి ఇళ్ళ పూజారిని అంతా నీకు తెలుసు కదా అనితా!" అన్నాడు నవ్వుతూ కిరణ్. "వెయ్యి ఇళ్ళ పూజారివో, వెయ్యి గుళ్ళ పూజారివో నాకు తెలియదు బాబు. నీకోసం ఇవాళ ఎదురు చూసినట్టు ఇంతవరకు ఎప్పుడు ఎదురు చూడలేదు!" అంది అనిత. అనిత ప్రక్కనే క్రింద కూచుంటూ "ఏమిటబ్బా అంత విశేషం?" అన్నాడు కిరణ్. "ఈరోజు చాలా కష్టపడ్డాడు తెలుసా?" "ఎందుకనో పాపం!" అనితకి చిలిపి ఆలోచన వచ్చింది. "కనుక్కో చూద్దాం!" అంది చిలిపిగా. "ఊ నామీద మనసై వుంటుంది". "నీకెప్పుడూ అదే రంధి". "కాదామరి? నీలనతి అప్సరసను ఎదురుగా పెట్టుకుని!" కొద్దిసేపు వారిద్దరిమధ్య ఎప్పటిలాగానే చిలిపిగా మాటలు దొర్లాయి. తరువాత అనిత సూటిగా అసలు విషయంలోకి వచ్చింది. "నీకో శుభవార్త వినిపిద్దామని అనుకుంటే నువ్వు ఫోన్ లో దొరకలేదు, ఇంటిదగ్గర లేవు. చివరికి ఈ పార్కుకు వచ్చి కూర్చుంటే ఇక్కడ అనుకోకుండా ప్రత్యక్ష మయ్యావు" అంది అనిత. ఆ మాట వింటూనే కిరణ్ గుండె గుభేల్ మంది. ఆడపిల్లలు వినిపించే శుభవార్త ముఖ్యంగా ఇలాంటి సమయాల్లో వినిపించే శుభవార్త ఏమిటో కిరణ్ కి బాగా తెలుసు. అయినా తనంతట తానుగా బయటపడకుండా "నాకు తెలుసులే!" అన్నాడు కిరణ్. "తెలుసా?" తెల్లబోయింది అనిత. "తెలుసు" అన్నాడు కిరణ్. "ఏమిటో చెప్పు చూద్దాం?" "ఏముంది ఇవాళ నువ్వు నన్ను సినిమాకి తీసుకువేడుతున్నావ్" అన్నాడు తేలికగా కిరణ్. పొంగే పాలమీద చన్నీళ్ళు గ్రుమ్మరించినట్టు అనిత ఉత్సాహం చల్లారిపోయింది. నా ముఖంలా వుంది! అంది చిరాగ్గా అనిత. "నీ ముఖానికే పసిపాప ముఖంలా అమాయకంగా అందంగా వుంటుంది!" అన్నాడు కిరణ్. "అమ్మయ్య ఎలాగైతేనేం అసలు విషయానికి వచ్చావ్ అదే, అదే." అంది ఆనందంగా అనిత. కిరణ్ తన పెదవి గంటుపడేలా కొరుక్కుని ఇక లాభం లేదు అని తెలుసుకుని అసలు విషయంలో సూటిగా దిగాడు, "అయితే ఏంటో చెప్పు?" అన్నాడు. "మొద్దు బుర్ర, ఏమీ అర్ధంకాదు" ముద్దుగా అంది అనిత. "అర్ధం కానపుడు చెప్పొచ్చుగా!" "నేనే చెప్పాలా!" "చెప్పాలి" తప్పదా" "తప్పదు" అనిత కళ్ళు మూసుకుని చెప్పింది, "మనకి ఓ బాబు పుట్టబోతున్నాడు" అని. అనిత శుభవార్త అనగానే ఇలాంటిదేదో అని ముందే వూహించాడు కిరణ్. అతని బుర్ర వేగంగా పనిచేయటం మొదలుపెట్టింది. అతని బ్రెయిన్ అందరి బ్రెయిన్ లాంటిది కాదు. చాలా క్విక్ గా పనిచేస్తాడు క్విక్ గా నిర్ణయం తీసుకుంటాడు. అప్పటికప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నాడు. కళ్ళు మూసుకుని ఈ విషయం చెప్పిన అనిత, తను ఈ శుభవార్త వినిపించినందుకు కిరణ్ నుంచి ఎటువంటి రెస్ పాన్స్ లేదేమిటా? అని అనుకుంటూ కళ్ళుతెరిచింది. తీవ్రంగా ఆలోచిస్తూ నొసలు ముడేసిన కిరణ్. నేవినిపించిన వార్త నీకు షాక్ లాగా తగిలిందా కిరణ్" డగ్గుత్తికతో అడిగింది. "అవును, షాక్ లాగానే తగిలింది. అయితే అది తియ్యని షాక్," అన్నాడు కిరణ్. కిలకిలా నవ్వింది అనిత ఆ మాటలకి. "ఇప్పుడు మనం తొందర పడాలి" అంది అనిత. "అవును చాలా తొందరగా నిర్ణయం తీసుకోవాలి" అన్నాడు కిరణ్. "దేనికి?" "మన పెళ్ళికి" అనిత ఆల్చిప్పల్లాగా కళ్ళు విప్పార్చుకుని అడిగింది "నిజం" నిజంగా నిజం!" "నేనీ విషయం చెప్పగానే ఒప్పుకుంటావనుకోలేదు కిరణ్" "అంటే నన్నాపర్ధం చేసుకున్నావన్నమాట." "అలా అని కాదు కిరణ్, నువ్వు ముందే చెప్పావు కదా పెళ్ళికి కొన్నాళ్ళు ఆగాలని, అందుకని అలా అన్నాను" "కానీ ఇప్పుడు తప్పదు" "అవును తప్పదు." "అనితా నేను రేపు ఊరు వెడుతున్నాను. శనివారం ఉదయం వస్తాను. ఆదివారం డాడీతో మాట్లాడతాను డాడీ మన పెళ్ళికి వప్పుకున్నారా సరే, లేకపోతే నిన్ను ఏ గుళ్ళోనో పదీమంది ఫ్రెండ్స్ ఎదుట పెళ్ళి చేసుకుంటాను. మనం క్రొత్త జీవితం ప్రారంభిద్దాం. మనం తొందర పడ్డాం. ఈ పరిస్థితులలో పెళ్ళికికూడా తొందరపడటం మంచిది....కిరణ్ చెప్పుకుపోతున్నాడు. అనితకి చాలా సంతోషం వేసింది. కిరణ్ వుత్త మొండి మనిషి. తొందర, కోపం, అన్నీ జాస్తీయే. మొదట ప్రేమించినపుడు అంతే. ప్రేమించావా, లేదా నన్ను చెప్పమని మొండిగా కూర్చున్నాడు. ఆ తరువాత తన పనులు కావాలని మొండితనం. ఇప్పుడుకూడా ఈ వార్త చెపితే మొండిగా తిరస్కరిస్తాడేమో అనుకుంది. కానీ వెంటనే ముందుగా తండ్రితో ఈ విషయం చెప్పి తనను పెళ్ళి చేసుకుంటానని అన్నాడు. కిరణ్ లోకి ఈ మొండితనం, ఆవేశం, పట్టుదలే తనకు ఎంతో వచ్చినది. "ఏంటి అనితా ఆలోచిస్తున్నావ్?" కిరణ్ అడిగాడు. "నీ గురించే" చిలిపిగా అంది అనిత. మరో పది నిముషాల తరువాత ఇరువురు వెళ్ళటానికి లేచారు. "మళ్ళీ మనం కలుసుకోవటం వారం తరువాతే కదూ?" అంది అనిత. "ఎక్కడ కలుసుకోవాల్సింది నేను చెబుతాను" అన్నాడు కిరణ్. ఇరువురు వారి వారి దోవలు పట్టారు. "హోటల్ మయూరి." సమయం. గం. 6-10ని. వచ్చే పోయే జనంతో మయూరి చాలా హడావుడిగా వుంది. ఆ సమయంలో కిరణ్ గోధుమరంగు సఫారి సూట్ ధరించి కళ్ళకి గాగుల్స్ పెట్టుకొని, చేతిలో చిన్న బ్రీఫ్ కేస్ తో హోటల్ మయూరిలోకి అడుగుపెట్టాడు. కిషోరి లాల్ అనే మారుపేరుతో రెండురోజులవరకు డబుల్ రూమ్ బుక్ చేసుకున్నాడు. హోటల్ రిజిష్టర్ లో తను బిజినెస్ వ్యవహారంమీద వచ్చినట్టు రాశాడు. "3వ ఫ్లోర్, రూమ్ నం. 44" చెప్పాడు రిసెప్షనిస్ట్, బాయ్ తో. కిరణ్ లిస్ట్ లొ తన రూమ్ కి బాయ్ దారి చూపగా వెళ్ళాడు. కాఫీకి ఆర్డర్ ఇచ్చాడు. బాయ్ వెళ్ళిపోయాడు "ఎస్ సర్" అంటూ. రూమ్ తలుపు వేసి అనితకు ఫోన్ చేశాడు. "అరగంటనుంచి నీ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నాను" అంది అనిత చిరుకోపంతో. "సారీ డియర్, కొంచెం లేట్" మృదువుగా పలికాడు కిరణ్. సారీ చెప్పటంలో చాలా గొప్పవాడివిలే, ఇంతకీ కాయా - పండా?" "ఇంకెక్కడ ఇంకా మొగ్గలోనే వుంటే!" "ఇలా మాటలు దాటేస్తే నాకు ఒళ్ళుమండిపోతుంది. కాయా - పండా?" "చెప్పేకన్నా, చూస్తేపోతుంది కదా!" "అలా సిల్లీగా మాట్లాడేవంటే, ఫోన్ పెట్టేస్తాను," అని అనిత చిలిపిగా బెదిరించింది. "అయితే పెట్టేయ్ తల్లీ" నవ్వుతూ అన్నాడు కిరణ్. "నాకు వళ్ళు మండిపోతున్నది." "బాగా మండిపోతున్నదా?" "ఆ!" "వంటిమీద చెయ్యిచేసి చూద్దామంటే దగ్గరలేనే, సరే ఒకపని చెయ్ ఆ వేడిమీదనే రయిన పరిగెత్తుకుంటూ హోటల్ మయూరి 3వ ఫ్లోర్, రూమ్ నెం. 44కి వచ్చెయ్యి." "అదేంటి వున్న వూళ్ళో హోటల్ రూమ్ తీసుకున్నావా?" ఆశ్చర్యంగా అంది అనిత. "నీకో ముఖ్యవిషయం ముద్దుగా చెప్పటానికి." "రియల్లీ." "ఎస్, మేడమ్" తమాషాగా అన్నాడు కిరణ్. "వెంటనే వచ్చేస్తున్నాను" "వెంటనే రా, కాని....?" "ఊ, కాని ఏమిటి తొందరగా చెప్పు అదేమిటో!" "నువ్వు రూమ్ కి వచ్చేటపుడు ఎవరైనా నిన్ను ఏ రూమ్ కి అని అడిగితే రూమ్ నం. 44 కిషోర్ లాల్ అని చెప్పు. నువ్వు ఇక్కడకు వచ్చాక అంతా వివరంగా చెప్తాను." "నీవరస చూస్తుంటే ఏదో క్రైమ్ పిక్చర్ చూపెట్టే టట్టున్నావ్!" "కాదు, మరొకటి." "మరేమిటి." "బ్లూ ఫిలిం." "యూ నాటీ" ముద్దుగా అంది అనిత. "వుత్త నాటీనే కాదు, స్వీట్ బాయ్ ని కూడా. "వచ్చేస్తున్నా, ఫోన్ పెట్టేస్తున్నా." "ఫోన్ పెట్టకుండానే రా" నవ్వుతూ అంటూ కిరణ్ రిసీవర్ క్రెడిల్ మీద వుంచి వెనక్కి తిరిగాడు. వెనక్కి తిరిగిన కిరణ్ వులిక్కిపడ్డాడు. బాయ్ చేతులు కట్టుకుని నిలబడ్డాడు. "ఏమిటి?" తడబాటును కప్పిపుచ్చుకుంటూ అడిగాడు కిరణ్. "కాఫీ తెచ్చాను సర్" వినయంగా చెప్పాడు బాయ్. "ఇంకా ఏమన్నా కావాలా సర్?" అడిగాడు బాయ్ వినయంగా. తట్టెడు మల్లెపూలు, పుట్టెడు లడ్లు అని మనస్సులో కోపంగా అనుకోని పైకి మామూలుగా "ఇంకేం అక్కరలేదు నువ్వు వెళ్ళొచ్చు" అన్నాడు కిరణ్. "ఎస్ సర్" అంటూ బాయ్ వెళ్ళిపోయాడు. కాఫీ సిప్ చేస్తూ తీవ్రంగా ఆలోచిస్తూ కూర్చున్నాడు కిరణ్. "మే ఐ కమిన్." "కిరణ్ తలెత్తి చూశాడు. కళ్ళ ఎదుట దేవత ప్రత్యక్షమయినట్లయింది. కళ్ళు విప్పార్చుకుని అలా చూస్తూ వుండిపోయాడు. అనిత తెల్లచీర, తెల్ల జాకెట్టు, మల్లెపూలుతో వెలుగులో మెరిసిపోతూ వయ్యారంగా నిలబడివుంది. వైట్ డైయిల్ వున్న వాచ్, మెడలో ముత్యాలహారం అన్నీ ముత్యాలతో చేసిన గాజులు మొదలైనవి ధరించింది అనిత. వెన్నెల్లో విహరించటానికి గంధర్వకన్య అందంగా తయారయి దివికి దిగివచ్చినట్లుగా, అనిత ప్రత్యేకంగా అలంకరించుకుని వచ్చింది. కిరణ్ ఆశ్చర్యంలో నుండి తేరుకునేవరకూ అనిత అలా నవ్వుతూ వయ్యారంగా నిలబడి వుంది. రెండు నిముషాల తరువాత "నువ్వు నువ్వేనా" కిరణ్ అడిగాడు. "నేను, నేనే" కదలి ముందుకు అడుగు వేస్తూ అంది అనిత. అప్పటికప్పుడే తన నిర్ణయం మార్చుకున్నాడు కిరణ్ క్షణాలలో నిర్ణయాలు మార్చుకోవటం కిరణ్ కి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు అదే జరిగింది. కిరణ్ అనితను చేతుల్లోకి తీసుకుని పైకెత్తి గిర గిర తిప్పి కిందకు దించాడు. అతను చేసిన పని అనితకి వచ్చింది. కిరణ్ తన ప్రశ్నకి "పండు" అని జవాబు ఇవ్వబోతున్నాడు అని గ్రహించుకుంది. అయినా ఆ సంతోషాన్ని అంతరంగపు అట్టడుగు పొరల్లో దాచుకుని, నీ తీరుని చూస్తుంటే చంపేసేటట్టున్నావు బాబూ విసుగుని ప్రదర్శిస్తూ కావాలని అంది. "నేను అదే అనుకుంటున్నాను, ముద్దులతో మరి పిడిగుద్దులతోనా" అన్నాడు కిరణ్. "ఆ విషయం తరువాత చెప్తాను. ముందీ విషయం చెప్పు కాయా, పండా?" "పండుకాయ" అన్నాడు కిరణ్. "లాభంలేదు, నువ్వేదో నాటకం ఆడుతున్నావు" అని మూతి ముడుచుకుని కూర్చుంది అనిత. కిరణ్ కాసేపు అనితను బ్రతిమలాడాడు. అయినా అనిత కరగలేదు. నిజం అపుడే చెప్పదలచుకొని కిరణ్ వచ్చిన అవకాశాన్ని విడుచుకోలేక అనిత చెవిలో గుస, గుస లాడుతూ పండు, పండు, పండు అని రామనామ జపంలా అనసాగాడు. "నిజం!" "నిజం పండూ" అన్నాడు కిరణ్. "వెంటనే కిరణ్ బుగ్గమీద గట్టిగా ముద్దు పెట్టుకుంది అనిత. "మరొకటి" తన్మయంగా అన్నాడు కిరణ్. "అంత ఆశ పనికిరాదు అబ్బాయీ" అంది అనిత. "పనికి రాదా" "పనికి రాదు." "అయితే ఇప్పుడేం చేద్దాం?" "ఏమీ చెయ్యక్కర లేదు మహానుభావా, మీ యింట్లో పొమ్మన్నారు, ఏమిటి, అన్నీ వివరంగా చెప్పు. ఆ తరువాత నీ ఇష్టం. నలిపిపారేస్తావో, నంచుకుతింటావో!" గోముగా అంది అనిత. "జరిగింది జరిగినట్టు చెప్పనా?" "లేదు మసాలాలు చేర్చి చెప్పు." "అయితే డ్యూయట్లు కూడా వుంటే బాగుంటుందేమో!" "నువ్వు టైమ్ వేస్ట్ చేస్తున్నావు కిరణ్" "అవును సుమా! నీ మాత్రం ఇంగిత జ్ఞానం నాకు లేకపోయింది. రంభను ప్రక్కనపెట్టుకుని కొంబు చెంబు వేషాలు వేస్తున్నాను." "అదిగో మళ్ళీ ఇలా అయితే నే వెళ్ళిపోతాను." "వద్దు, వద్దు చెప్పేస్తాను." "ఊ" అంది అనిత. కిరణ్ ఒకసారి గొంతు సవరించుకుని చెప్పటం మొదలు పెట్టాడు. ఇంటికి వెళ్ళాను సమయానికి డాడీ, మమ్మీ ఏదో సీరియస్ విషయం చర్చించుకుంటున్నారు. నీ తల రాత టైము బావుండలేదు రా తండ్రీ అనుకుంటూ అప్పుడు మన విషయం చెప్పలేదు. మీల్స్ తరువాత ఇంటిముందు లాన్ లో కూర్చుని మమ్మీ డాడీ ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు. వీలైతే చెబుదామని నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. కొద్దిపాటి వెన్నెల, చల్లని గాలి వాతావరణం ప్రశాంతంగా ఆహ్లాదకరంగా వుంది. దానికి తోడు మమ్మీ డాడీ ఏదో విషయం చెప్పుకుని నవ్వుకుంటున్నారు. ఇదే సరయిన సమయం వాతావరణం బావుంది. నెమ్మదిగా మమ్మీ డాడీలను మాటలలోకి దింపాను. ఎవరి విషయమో అన్నట్టుగా మన ప్రేమ కథనే కాస్త అటూ ఇటూ మార్చి చెప్పి అభిప్రాయం అడిగాను. ఆ పరిస్థితులలో అమ్మాయిని అన్యాయం చెయ్యకూడదు అన్నారు ఇరువురు. నాకు ఎంత సంతోషం వేసిందో చెప్పలేదు. ఇదే మంచి సమయం అనుకున్నాను. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను! డాడీ, మమ్మీ మీరిరువురు ముక్కు సూటిగా సమాధానం చెప్పాలి. అలా చెప్తాను అంటేనే చెబుతాను అన్నాను. ముందుగా డాడీ "చెప్పవోయ్" అన్నాడు మేము వింటానికి రెడీగా వున్నాము, నీదే ఇక ఆలస్యం అంది మమ్మీ. "ఇంతకు ముందు నే చెప్పిన పరిస్థితి నాకేవస్తే మీరేం నిర్ణయం తీసుకుంటారు?" అని అడిగాను. మమ్మీ నా మాటలను తేలికగా తీసుకుంటూ "వచ్చి నప్పుడు చూద్దాంలే" అని అంది. "ఆల్ రెడీ వచ్చేసిందేమో" డాడీ చిరునవ్వుతో అన్నారు. మమ్మీ డాడీ అలా అనంగానే నాకు ఎక్కడలేని తెగింపు వచ్చింది. "ఎస్, డాడీ! నేను ఆ పరిస్థితులలోనే వున్నాను" అంటూ సీరియస్ గా చెప్పాను. "అయితే ఆలస్యం ఎందుకు ఆ అమ్మాయిని తీసుకురా వెంటనే పెళ్ళి చేసేస్తాం!" అన్నారు డాడీ. "ఆలస్యం అమృతం విషం. ఇప్పుడే వెళ్ళి తీసుకురా" అంది మమ్మీకూడా. "నిజంగా ఇప్పుడే వెళ్ళి తీసుకురానా?" లేస్తూ అన్నాను. "అయితే నువ్వు చెప్పింది నిజమేనన్నమాట" మమ్మీ ఆశ్చర్యంగా అడిగింది. "ప్రామిస్, మమ్మీ నే చెప్పినదాంట్లో రవ్వంత కూడా అబద్దం లేదు" అన్నాను నేను. "అయితే ఇది తమాషా కాదన్నమాట" మమ్మీ అంది. "అయితే ఇది నిజంగా నిజమేనన్నమాట!" డాడీ అన్నారు. "నిజంగా నిజం ముమ్మాటికీ నిజం" అన్నాను. "చాలా ఘనకార్యమే చేశావన్నమాట!" వెంటనే డాడీ అందుకుని "గొప్ప గ్రంథసాగుడివి అయ్యావన్న మాట" అన్నారు. "ఇంతలోనే ఇంతమార్పా? ఆశ్చర్యపోతూ మీ రిరువురు నాటకం ఆడటం లేదుకదా!" అన్నాను. "లేదు! ఆ అవసరం మాకులేదు. నువ్వు తమాషాగా చెబుతున్నావనుకుని మేమూ తమాషాగా అన్నాము. వాస్తవం ఇది అని తెలిస్తే...? అన్నాడు డాడీ. "జరిగింది నాకు అర్ధమయిపోయింది. ఇంతవరకు మమ్మీ డాడీ నా మాటల్ని తమాషాగా తీసుకున్నారన్న మాట! వెళ్ళేలా తీసుకున్నా నా కనవసరం. నా వల్ల నీకు అన్యాయం జరుగకూడదు అనుకున్న నేను, స్థిరంగా, గట్టిగా నా అభిప్రాయం చెప్పేశాను. ఒకవేళ మీరు కాదంటే నాకు ఈ ఇంట్లో స్థానంలేదంటే నిర్భయంగా బయటకు వెళ్ళిపోతాను. అంతేకాని నన్ను నమ్ముకున్న ఆ అమ్మాయిని మటుకు మోసం చేయను అని చెప్పాను. అంతవరకు ప్రశాంతంగా వున్న వాతావరణం మబ్బులు, కారుచీకట్లు, పెనుగాలులతో కూడుకున్నట్లు భయంకరంగా మారిపోయింది. మమ్మీ చాలా పౌరుషంగా మాట్లాడింది. డాడీ మెత్త మెత్తగా చీవాట్లు వేశారు. నేను మటుకు నా నిర్ణయం మార్చుకోనని మరోసారి చెప్పేశాను. అరగంట తరువాత డాడీ మెత్తపడ్డారు. "నీ ప్రేమ ఎంతగట్టిదో చూద్డామని అలా మాట్లాడాను. ఆ పిల్ల ఎలాంటిదైనా సరే నువ్వు మెచ్చినపిల్ల. మీ పెళ్ళికి నేనేమీ అభ్యంతరం పెట్టను. ఇంక మీ మమ్మీ ఇష్టం. మీ మమ్మీని ఎలా ప్రసన్నురాలిని చేసుకుంటావో నీ యిష్టం. డాడీ గ్రీన్ సిగ్నల్ చూపారు. మమ్మీ మాత్రం మొండిగా ససేమిరా నా కంఠంలో ప్రాణం వుండగా ఒప్పుకోనన్నది. వన్ మినిట్ అని ఇంట్లోకి పరిగెత్తాను. లైసెన్స్ వున్న డాడీ రివాల్వర్ వుంటే అది తీసుకువచ్చాను. మమ్మీ ఎదురుగుండా నుంచుని నా కణతకి రివాల్వర్ గురిపెట్టుకున్నాను. "మమ్మీ నీ మాట కాదనలేదు. నన్ను నమ్ముకున్న అమ్మాయిని వదులుకోలేను. అందుకే నేనీ నిర్ణయం తీసుకున్నాను. నీకు నీ కొడుకు కావాలా? నీ మాట నెగ్గడం కావాలా? ఏదో ఒకటి త్వరగా చెప్పు." మమ్మీ క్షణాలలో నిర్ణయం తీసుకుంటుంది. ఎప్పుడూ అంతే "నాకు న అకోదుకే కావాలి అంది" అంటే మమ్మీ మన పెళ్ళికి ఆమోదించింది అని అర్ధం. వెంటనే ఆనందంతో రివాల్వర్ ని అవతల పడేసి మమ్మీని ఎత్తి గిర, గిర త్రిప్పారు. ఎలాగో తెలుసా? అచ్చం సినిమాలో హీరో లాగా అన్నమాట. రేపటిరోజు నిన్ను తీసుకువచ్చి చూపెట్టమన్నారు. వీలైతే ఈ నెలలోనే పెళ్ళి ఏర్పాట్లు చేద్దామన్నారు. ఈ విషయం నీతో ఎక్కడైనా చెప్పొచ్చు. కాని, నాకలా ఇష్టంలేక పోయింది. అందుకనే ఈ హోటల్ రూమ్ తీసుకుని నిన్నిక్కడికి పిలిచి పెళ్ళి బాజా వినిపించాను. టట్టడోయ్." విషయమంతా సరదాగా చెప్పాడు కిరణ్. చీర చెంగుతో కళ్ళు వత్తుకుంది అనిత. "అరె ఈ సమయంలో కన్నీరా?" "ఇది కన్నీరు కాదు కిరణ్; ఆనంద బాష్పాలు, నా ఆనందాన్ని మాటలలో ఎలా వర్ణించాలో తెలియటంలేదు. రెక్కలు కట్టుకుని గాలిలొ ఎగరాలనిపిస్తున్నది. వినీల ఆకాశంలో విహంగంలా ఎగరాలని పిస్తోంది. ఇంకా ఇంకా ఏదేదో చెయ్యాలని పిస్తున్నది. నిజం కిరణ్! అనిత మధురంగా మత్తుగా పలికింది." "ఆల్ రెడీ నేనుకూడా రెక్కలు కట్టుకుని వున్నాను." ఇద్దరం కలిసి ఎగురుదాం పద." అంటూ అనితను చేతుల్లోకి తీసుకున్నాడు కిరణ్. "ఇది అన్యాయం" అంది అనిత. "నాకు మట్టుకు న్యాయంగానే అనిపిస్తున్నది" అన్నాడు కిరణ్. "మగవాళ్ళకి అన్నీ న్యాయంగానే కనిపిస్తాయి. ఒక ఆడపిల్ల వంటరిగా రాత్రి ఒంటిగంటదాకా హోటల్ గదిలో ఒక అబ్బాయితో వుండటం లోకానికి తెలిస్తే లోకం హర్షించదు. నోట్లో వుమ్మేస్తుంది." "నోట్లో!" అన్నాడు ఆశ్చర్యంగా కిరణ్. "అవును నోట్లోనే నోరు తెరవమని మరీ వుమ్మేస్తారు" అంది అనిత. "అంతకుమించి ఏమీ చెయ్యదు కదా లోకం!" "సిగ్గు లేకపోతే వరి మాటలతో కాలయాపనచేసి పబ్బం గడుపుకుంటున్నావు. వచ్చినప్పటినుంచి వెళతాను. అంటుంటే ఒంటిగంటదాకా చేశావు. కిరణ్ నీ మాటలు చూపులు మత్తుగా, గమ్మత్తుగా వుంటాయి. నీతో పరిచయం వున్న ఏ ఆడపిల్లా నీ మాట కాదనదు." "ఈజిట్?" "ఒకరి విషయం ఎందుకు నా విషయం మటుకు అంతే" అంది అనిత. "నువ్వు నిజమే పలుకుతున్నావు కదూ!" అన్నాడు కిరణ్. "నిజంగా నిజం" అంటూ కిరణ్ క్రాఫ్ అల్లరిగా చెరిపేశింది అనిత. "అయితే నేనెలా చెబితే అలా వింటావా!" "ఓ" అంది అనిత. "అయితే ఇపుడు ఒక కోరిక కోరుతాను." "కోరుకో నరుడా" తమాషాగా అంది అనిత. "అయితే రేపు మనం లేడీ డాక్టర్ దగ్గరకు వెళ్దాం." "నాకేమీ అభ్యంతరం లేదు. ఎందుకో చెప్పు!" "ఎబార్షన్ కోసం." "ఎవరికి? నీకా!" నవ్వుతూ అడిగింది అనిత. "కాదు, నీకు" స్థిరంగా పలికింది కిరణ్ స్వరం. "కిరణ్ వడిలోంచి చటుక్కున పైకి లేచింది అనిత. అతనిని సూటిగా చూస్తూ జోక్ చేస్తున్నావా కిరణ్" అంది. "నువ్వు నా మాట వింటానన్నావ్" అన్నాడు కిరణ్. "నా ప్రశ్నకు జవాబు ఇది కాదు" అంది అనిత. "అయితే నాదే జోక్ కాదు" అన్నాడు కిరణ్. "విషయమేమిటో ముక్కు సూటిగా చెప్పు" అంది సీరియస్ గా అనిత. "మనకి ఇపుడే పిల్లలు అవసరంలేదు. నేను తండ్రిని కావటానికి ఇంకా చాలా టైము వుంది. ఇప్పుడే నీవు తల్లి వయితే నీలో అందాలు చెదిరిపోతాయి. పైగా నే నీ విషయం మమ్మీ డాడీకి చెప్పలేదు. ఎబార్షన్ అయిన తరువాతనే నిన్ను మా వాళ్ళ దగ్గరకు తీసుకు వెళతాను. నే చెప్పిన దాంట్లో జోక్ ఏమీలేదు. నిన్ను కన్నెపిల్లగా కాకుండా, ఒక పిల్లనూ కనబోయే తల్లిగా మా వాళ్ళకు పరిచయం చెయ్యటం నాకే ఇష్టంలేదు. ఈ విషయం తెలిస్తే మా వాళ్ళేమంటారో తెలుసా? ఎవడివల్ల ఆ పిల్ల తల్లి కాబోతుందొ అంటారు. అంతమాట నిన్ను మా వాళ్ళు అంటం ఇష్టంలేక నేనే ఈ నిర్ణయం తీసుకున్నాను. ముందు లేడీడాక్టర్ దగ్గరకు వెళ్ళటం అత్యవసరం" కిరణ్ చెప్పాడు. "నీవు మన గురించి మొత్తం మీ అమ్మా నాన్నకు చెప్పానన్నావ్?" అనుమానంగా చూస్తూ అంది అనిత. "మన ప్రేమ గురించి చెప్పాను. నువ్వుంటే నాకు, నేనంటే నీకు ఎంత ఇష్టమో చెప్పాను, అంతే కాని పెళ్ళికి ముందే తల్లిని కావటానికి తఃయారుగా వున్నావని చెప్పలేదు. చెబితే నేను ఒప్పుకున్నట్లుగా వెంటనే మా వాళ్ళు అసలు మన పెళ్ళికి ఒప్పుకోరు."

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published.