మైదానం 1
telugu kathalu navalalu sahithi మైదానం 1 'లేచిపోయినా' నంటే ఎవరన్నా నన్ను, నాకెంతో కష్టంతో వుంటుంది. ఇదివరకంతా యీ మనుషుల్లోంచి, నీతి వర్తనుల లోంచి వెళ్ళిపోయి, ఎడారిలో జీవించడం వల్ల నేను చేసినపని ఘోరత్వం, నీచత్వం బోధపడలేదు. ఆ జీవితమంతా సుందరమైన స్వప్నంవలె, ఆ యెడారి పుణ్యభూమివలె, నా జీవితంలో ఈశ్వరుడికి నేనెత్తే మంగళ హారతివలె తోచింది. ఇంటినే, బంధువుల్నే, భర్తనే మరిపించగల అనుభవం ఎంత ఉన్నతమో అద్భుతమో నువ్వే ఆలోచించు. అమీర్ నీ, మీరానీ అనుభవించిన తరువాత మన చుట్టూ బతికే ఈ ప్రజలందరూ పురుషులేనా మనుష్యులేనా అనిపిస్తుంది నాకు. నేను బండి దిగేటప్పుడు వీళ్ళు చుట్టూ పోగై,
"లేచిపోయిందట్రా!"
"చాలా బావుందిరా మనిషి!"
"కావాలసిందే శాస్తి ముండకి!"
అంటూ వుంటే అర్థమయింది నాకు లోకమార్గం. చివరికి నువ్వు అన్నావు- 'లేచిపోవడానికి నీ భర్త లోపమేమన్నా వుందా?" అని. ఆయన్నెరుగుదువా? ఆమీరే నాకు కనపడకపోతే ఇంకా నా పెనిమిటితో కాపరం సుఖంగా, మత్తుగా చేస్తూవుండేదాన్నే. అమీర్ తో నీకో ఇంకో పతివ్రతతో స్నేహమే వుంటే, మీరూ లేచిపోయే ఉందురు. అతని ఆకర్షణని నిగ్రహించలేక మీరూ, నేనూ కాదు జవాబుదారీ దానికి. ఒప్పుకోవూ? మీరెవరూ లేచిపోయి వుండరూ? నీ మాటే నిజమేమో? ఆ ఆకర్షణ అర్థమయ్యే హృదయం వుండాలికదా! కాని మధ్యాహ్నపు సోమరి గాలి నన్ను తాకితే ఒళ్ళు ఝల్లుమనే నాకు, అమీరు విశాల వక్షపు వొత్తిడి స్వర్గంగా అర్థం కాకుండా వుండగలదా? పోనిండి. మీరే అదృష్టవంతులేమో తగాదా యెందుకు?
ఒకనాటి పొద్దున్న, ఆయనతో ఏదో వాజ్యం విషయమై మాట్లాడ్డానికి వొచ్చాడు అమీర్. ఆఫీసుగదిలో ఏమీ మాటలు వినబడకపోతే, ఎవరూ లేరనుకొని కాఫీ లోపలికి తీసుకెళ్ళాను. ఆయన ముఖం చూడగానే గదిలో ఇంకా ఎవరో ఉన్నారని గ్రహించి వెనక్కి వెళ్ళటానికి చప్పున తిరగబోతూ వుండగానే, ఈ లోపునే ఎవరో గాఢంగా నా వీపుని చూపులతో స్పృశిస్తున్నట్లు తోచింది. అతనివంక పూర్తిగా కళ్ళన్నా ఎత్తకుండా లోపలికి వెళ్ళిపోయినాను. కాని ఆ చూపు నా వీపున వేసిన గాయం మాత్రం నన్ను రోజల్లా బాధపెట్టింది. మర్నాడు సాయంత్రం మామూలుగా నేను వీధి గుమ్మంలో నుంచుని వుండగా మళ్ళా ఆ చూపే నా చంపకి తగిలి, తిరిగి అతన్ని చూశాను. వెంటనే సిగ్గుపడి లోపలకి వెళ్ళి, ఆ చూపులో ఎంత బలం, వాంఛ నిండి ఉందా అని ఆలోచించాను, ఆశ్చర్యంతో ఆ సాయంత్రమంతా. ప్రతిరోజు ప్రొద్దున్నా ఆ వ్యవహారంమీదనే అతను ఆయన దగ్గిరికి వచ్చేవాడు. నువ్వేమన్నా అనుకో, నేను కూరలు కొంటున్నా, మజ్జిగ చేస్తున్నా, కాఫీ తాగుతున్నాసరే అతను వొచ్చాడని తెలిసేది యెట్లాగో-ఇంకా బిగ్గరగా మాట్లాడే అతని కంఠం నాకు వినబడక ముందే నాకు గుర్తు తెలీకముందే, ప్రతిరోజూ నాలుగైదుసార్లు రోడ్డుమీద కనబడ్డాడు. రెండు మూడురోజులు గుమ్మంలో తను వొచ్చినప్పుడు లేకపోతే, నా కోసం తన చూపుని అక్కడ వొదిలి వెళ్ళాడా అనిపించేది నాకు. నేను తనవంక చాలా యిష్టంగా చూసే దాన్నని అమీర్ తరవాత అన్నాడు. నా మనసులో మాత్రం అతన్ని యెదురు చూడడం అతని తీవ్ర కాంక్షకి నేను కావలసిందాన్ననే భావంతో గొప్ప సంతోషంతో నిండిపోవడం అలవాటైనాయి.
ఆ వేళ మధ్యాహ్నం రెండింటికి వాకిట్లో నుంచుని ఉన్నాను. ఎండతో ఆకాశం నుండి నేలవరకు లోకం నిండి వుంది. ఆ దాహం కొన్న యెండే వెన్నెలైనట్లు ఆ రోడ్లలో ఉద్యానవన విహారానికై వొచ్చినవాడివలె నడుస్తున్నాడు. ఎక్కడకెక్కడ నా వస్త్రాల్లోంచి నా శరీరం కనబడుతుందో అన్నట్లు వెతికి, వొళ్ళంతా సిగ్గుపరిచాయి అతని చూపులు. నిర్మానుష్యమైన ఆ రోడ్డుమీద నాకెదురుగా ఒక్క నిమిషం ఆగి ఇంట్లోకి పనిమీద వెళ్ళే యజమానివలె నడిచి వొచ్చాడు గుమ్మంవేపు. నేను ఇంట్లోకి వెళ్ళి ఆఫీసు గది గుమ్మంలో నుంచుని 'లే'రన్నాను. కాని అతను నేనేమంటున్నానో వినదలచుకోలేనట్టు తోచింది. నాతో గానీ, నా మాటలతో కానీ తనకి పనిలేనట్టే ఆ ఇంటికీ, తన హృదయానికీ తను అధిపతినని తెలిసినట్లే వొచ్చేశాడు. నేను లోపలికి వెళ్ళి తలుపు పక్కకి తప్పుకుంటూ ఉండగానే వొచ్చి నా చుట్టూ చేతులు పోనిచ్చి అదుముకున్నాడు. అటు చూడలేదు, ఇటు చూడలేదు. అతని దృష్టి అంతా నా మీదనే. నా కోసమే. ఏం మోహమని! ఒక్క రెండు నిమిషాల్లో నేను బతికి ఉన్నానో, లేదో అది ఆఫీసు గదో, మహారణ్యమో నేను నేనో, ఇంకెవరో తెలీనంత గాఢంగా, ఊపిరాడకుండా, బలం మిగలకుండా రక్తాన్ని ఆపేసి, గుండెల్ని పిండేసి మాయమైనాడు. వెళ్ళి శరీరమంతా సర్దుకొని మంచంమీద కూచున్నాను.
ఏం జరిగింది? ఇది పాత గదేనా! ఎప్పటి మధ్యాహ్నపు యెండేనా ఇది? లేచి ఏదో గొప్ప కార్యం, అందర్నీ ఆశ్చర్యమగ్నుల్ని చేసే పని చెయ్యాలనిపించింది. సంతోషంతో కేకవేశాను. చప్పునలేచి నుంచున్నాను నవ్వాను. అద్దం దగ్గరికి ఒక్క గంతేసి చూసుకున్నాను. నా మొహాన్ని నేనే ముద్దు పెట్టుకున్నాను. ఎవరితో చెప్పను ఈ సంతోషాన్ని? ఈ పునర్జన్మ ఉత్సవాన్ని ఏ విధంగా ప్రచురించను? ఎన్నడూ పాటరాని నా గొంతులోనించి సంగీతం బయలుదేరింది మొదటిసారి. నా బతుక్కి అంతా మొదటిసారి. మోహమాధుర్యంజల బైలు వెడలింది. ఇల్లంతా ప్రతిమూలా వెలిగింది. నా హృదయంలోని ఆనందజ్యోతితో. ఇంకోరు నన్ను, నన్నే నా ఆనందాన్నే కోరి, బాధపడి సాహసించి, ఆనందజ్యోతితో. ఇంకోరు నన్ను, నన్నే నా ఆనందాన్నే కోరి, బాధపడి సాహసించి, ఆనందపడుతున్నారన్న అనుభవం పొందిన జన్మ మృత్యువును చూసి కూడా భయపడదు. అమీర్, నా అమీర్. నన్నేం చేశాడు? మనిషిని, నాకు దేవత్వాన్ని అమృతత్వాన్ని ప్రసాదించాడు.
'అసతో మా సద్గమయ,
తమసో మా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతంగమయ'
అన్న నా భర్త పఠించే ఉపనిసన్మంత్రం జ్ఞాపకం వొచ్చింది. నేనే మారిపోయినాను. నేను నేను కాదు. ఆ రోజే పాత రాజేశ్వరి చచ్చింది. అతనే నేనంతా-నేనంతా-అతనే. అతని బలమైన మోహంలో లీనమై పోయినాను.
ఆనాటి నుంచి ఇంక మధ్యాహ్న మౌతోందంటే నా మనసు గంతులు వేసేది. 'ఎక్సేక్టేషన్ తో నాకు ఊపిరి పీలవడం కష్టమయ్యేది. అన్నం వార్చేప్పుడు అమీర్ జ్ఞాపకం తట్టిందంటే నాకు తటస్థించిన మహా అదృష్టానికి చేతులు వొణికి తప్పేలాని బిలబెట్టడమే కష్టమయ్యేది. అన్నం తింటో వుండగా అమీర్ జ్ఞాపకం వొచ్చాడంటే ఇంక అన్నం కొంచెమన్నా సయించదు. నా పెనిమిటితో పడుకున్నప్పుడు అమీర్ మీద మోహం కలిగి, నిద్రలో ఆయన్ని గట్టిగా కావలించుకున్నాను. నన్ను లేపి ఆయన 'చెడ్డకల వొచ్చిందా' అని అడిగారు. భయానికీ, మోహానికీ భేదం తెలీని ఆయనతో వొక మంచంమీద పడుకోవటం కన్న మన్మధుడికి అపకారం వేరే వుందా. ఏదన్నా 'లా పాయింటు' అడుగు; దేనికది చీల్చి వివరంగా అరగంటసేపు చెపుతాడు. ఎదుటిసాక్షి హృదయపరీక్ష చేసి చీల్చి తికమకలు పెడతాడు. భార్య కావిలించుకోవడం మోహం వల్లనో, భయంవల్లనో భేదం తెలీదు. ఇలాంటివారు మన భర్తలు! వాళ్ళకి పెళ్ళాలు కావాలా! లాయరు హంగులో మనమూ వొక భేషజం-ఆ పుస్తకాల బీరువాలూ, గుర్రపుబండీ లాగే, ఎవరన్నా వొస్తే వొంటినిండా నగలు వేసి మనని చూపించవచ్చు. దేహంలో అక్రమంగా కలిగే ఆ కామరోగాన్ని మన ద్వారా కళ్ళు మూసుకుని నయం చేసుకోవచ్చు.
అమీర్ తలపు మాత్రంచేతనే నాకు కలిగే బాధని యెట్టా భరించడమని భయం పుట్టేది. ఇది పశుకామమంటారు కాబోలు! అమీర్ కనబడక ముందు నా భర్తతో మామూలు ప్రకారం సంతోషమూ, బాధా ఏమీలేకుండా గడిపిన రాత్రులన్నీ ప్రేమ! ఆయనకి వండడం, మడిబట్ట లందీయడం, తలంటిపోస్తే వీపు రుద్దడం - యివి ఆధ్యాత్మికమైన నిర్మల ప్రేమ చిహ్నాలు. పార్వతమ్మ కట్టుకున్న చీరెని పొగిడి, అట్లాంటిది కొనిపెట్టమని నేను ప్రాణాలు తియ్యటమూ, పులుసులో యింగువ వాసన లేదని నన్ను ఆయన తిట్టడం- యివి మానసిక ప్రేమతత్వాలు.
అట్లానే అమీర్ తో అయిదారు మధ్యాహ్నాలు జరిగాయి. తలచుకుంటే నాలుగుగంటల కాలంలాగు తోచినా, ఒక పావుగంట కంటే ఎక్కువ అతను వుండలేదు. ఆ కాసేపట్లోనే నన్ను ఒక సంవత్సరానికి తగినంత మాధుర్యంలో ముంచేసేవాడు. అన్నిట్లోకి నాకు గొప్పగా తోచిందేమంటే-రోడ్డుమీద ఎవరున్నారో, యింట్లో ఎవరున్నారో చూడకుండానే సరాసరి వొచ్చేసి, సరాసరి లోపలికి, తిరిగి చూడకుండా వెళ్ళేవాడు అమీర్.
ఒకరోజు మధ్యాహ్నం 'నాతో వచ్చేయి' అన్నాడు. అదే మొదటిసారి, నాతో గొంతుకలోంచి మాట్లాడ్డం అతను. అప్పుడతని తురకల తెలుగు వింటే నాకెంత ముద్దొచ్చిందని! చిన్నపిల్ల మాట్లాడ్డానికి చేసిన ప్రయత్నంలాగే వుంది. అదివరకు తురక తెలుగు పరమ అసహ్యంగా వినపడేది. కాని ఆనాటినుంచి గొప్ప సంగీతమై నా ముసల్మాన్ తెలుగంత మధురం యింకేదీలేదు అన్పించింది. ప్రేమ-కాదు-పశుకామం-యెన్ని మార్పులు కలుగజేస్తుందో మనసులో!
అతనడిగిన ప్రశ్న నన్ను విభ్రమంలో ముంచగా తేరిపార చూస్తున్నాను. పళ్ళు బిగపట్టి తనకి కూడా వూపిరాడని అవస్థ కలిగించుకుని 'రావూ? రావూ? రాకపోతే చంపేస్తా నిన్ను' అన్నాడు. అతని కళ్ళల్లో మొదటిసారి చూశాను, భయంకరమైన ఎరుపురంగు. నన్ను తినెయ్యాలి. నన్ను చంపెయ్యాలనే ఉగ్రం-మళ్ళీ వారం క్రిందట చూశాను.
"చెపుతాను తరవాత. మళ్ళీ నువ్వు రావూ. అప్పుడు సావకాశంగా మాట్లాడాలి" అన్నాను.
మళ్ళీ వారంరోజులుదాకా వీలుకాదు ఆయన వూరికి వెళ్ళిన రాత్రి అమీర్ని రమ్మన్నాను. పదిగంటలైంది. పడక గదిలో అద్దం ముందు నుంచుని నన్ను నేను చూసుకున్నాను. చీకట్లో సిల్కు జాకెట్టు చూస్తాడా? ఈ ముత్యాలహారం కనబడుతుందా? అతనికేమన్నా ఫలహారం పెడితే ఏమనుకుంటాడు? కాని వ్యవధాన మిస్తాడా? వొంటికి అత్తరు రాసుకో బోయినాను. ఆయన పన్నెండు రూపాయలు పెట్టి కొని తెచ్చిందది. ఆయన తెచ్చిన అత్తరు అమీరుకోసం పూసుకోవడమంటే చప్పున సిగ్గేసింది. బుడ్డి అక్కడపెట్టి ఆలోచించాను. కాని జాకెట్ మాత్రం ఆయన్ది కాదూ, విప్పేశాను. తక్కిన బట్టలో? నవ్వొచ్చింది నాకు. మళ్ళీ జాకెట్ వేసుకుంటున్నాను.
మళ్ళీ యింతలో ఆలస్యమౌతోందని జ్ఞాపకం వొచ్చి, అన్నీ అట్లానే వదిలి, ఆఫీసు గదిలోకి వచ్చి బైట గుమ్మం తెరిచి, పక్కగా రోడ్డుమీదికి కనపడుతూ నుంచున్నాను. బైట యింకెవరికన్న కనబడుతున్నానేమోనని భయం వేసింది. లోపలిగా జరిగాను. కాళ్ళు వొణికి నుంచోడం కష్టమై యిటూ అటూ నడిచాను. రోడ్డుమీద దీపం నామీదపడుతోంది. అక్కడక్కడ కాళ్ళు చప్పుడైనప్పుడల్లా గుండెలు కొట్టుకొని నీరస పెట్టేశాయి. గదిలోకి వెళ్ళి కూచున్నాను. అమీర్ వొచ్చి, నేనులేనని వెళ్ళిపోతాడేమోనని భయమేసి లేచాను. కాని 'గదిలోనే వుంటాను రమ్మని చెప్పా'నని జ్ఞాపకం వొచ్చి కూచున్నాను. కాని చెప్పానా? చెపుదామనుకున్నాను కాని చెప్పానా? అవును. చెప్పాను. చెప్పినప్పుడు అమీర్ కనుబొమ్మలు పైకి లాగాడు. యెందుకా అనుకున్నాను కూడాను. కాని బైటికి వెళ్ళడం యెలా అయినా మంచిది అని బైటికివెళ్ళి పదినిముషాలు నుంచున్నాను. ఈ రాత్రి రాడేమో? నాతో ఒట్టి తమాషా చేశాడేమో యిన్ని రోజులు? ఆ రాత్రి యేదన్నా పని వుండిపోయిందేమో? కాని ఆ పని మానుకుని రాడా? రాత్రులు దారి తెలీదేమో? నువ్వువరని పోలీసులు పట్టుకున్నారేమో? గుండె దడదడలాడింది. మళ్ళీ గదిలోకి వెళ్ళి కూచున్నాను. ఇంత బాధ పెడుతున్నందుకు అమీర్ మీద కోపమొచ్చింది. తొరగా వొస్తేనేం?
నా మనసు ఆందోళన అణచడానికి కిటికీలోంచి కనపడే నక్షత్రాలన్నీ లెక్కపెట్టాలనుకున్నాను. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే నీకు-కొంచెం ఆలస్యమైతే యింత బాధపడ్డానే, యిదంతా కామమేనా? ఇదే ఆలోచిస్తున్నాను నిన్న మామయ్య ఇక్కడికి వచ్చి అన్నాడు. "చెప్పితే విన్నావు కావు. చూశావా? నీ గుడ్డి కామం నిన్నెంతకి తెచ్చిందో?" మామయ్య ఈ మాటలంది! నేను కాపరానికి వెళ్ళకముందు ఆరునెలలు నా వెంటపడి లోబరుచుకోవాలని చూశాడు. ఒక్కరికీ తెలీకుండా, ఎవరితోనన్నా చెప్పుకోడం నాకు సిగ్గని తెలుసు. చివరికి నేను అమ్మతో చెప్పితే అంతా అబద్ధమని బూకరించాడు. ఆ మామయ్య యీ మాటలంది! నిజమని వొప్పుకునే ధైర్యమే కలవాడైతే, నా స్వభావం మామయ్యని స్వీకరించి వుండునేమో; అమీర్ నే అడగమను ఎవర్నన్నా, అబద్ధం చెపుతాడేమో! అది పోనీలే. కాని నాది కామమేనా? నా కామమా; నా త్యాగమా, నన్నీ ఖైదులోకి తెచ్చింది? ప్రేమ శిరోభూషణం, స్త్రీలందరూ గుడ్డిగా అనుసరించిన పతివ్రతా ధర్మం ఆ త్యాగమేనా? అంత గాఢంగా అతన్నే కోరాను. అతన్ని పూజించాను. అమీర్ని, అతని కోసం బంధువుల్ని, కాలాన్ని, సంసారాన్ని, సుఖాన్ని వొదిలాను. అది యింకా కమమేనా? నా అమీర్ కోసం నేను చేసిన త్యాగాల్లో నూరోవంతు చేస్తారా భార్యలు? నువ్వు యోచించు. నా హృదయ మతనికోసం యెట్లా ఎంత తపించిందో? కామం వల్లనే?
నిష్కారణంగా పక్కున నవ్వాను. నా మెళ్ళో ముత్యాలు నాలుగు వందల యాభైమూడు ఉన్నాయేమోనని లెక్క పెడుతో వుండగా వచ్చాడు అమీరు. చెప్పులు పెద్దగా చప్పుడు చేసుకుంటో కొంచెం నెమ్మదిగా వస్తే అతని సొమ్మేం పోయింది అనుకుంటూ ఒయ్యారంగా తలుపు దగ్గిరికి వెళ్లాను. వెంటనే కావలించుకొని గట్టిగా పట్టుకొని ఒక్కసారిగా నాతోగూడ వెనక్కి నడవడానికి ప్రయత్నించి వొదలక తూగి, తూలి పుస్తకాల బీరువా మీద పడ్డాము. పెళపెళమని అడ్డం పగిలి గల్లుమని పెంకులు కిందపడి మళ్ళీ బద్దలైనాయి. ఏం జ్ఞాపకమొచ్చిందో ఆ నిమిషాన ఆయన బీరువాని మేమిద్దరం పగలకొట్టడం అతి హాస్యాస్పదంగా కనబడి, పకపక నవ్వి బద్ధలయ్యే అద్దం పెంకుల చప్పుడుతో నా కంఠం కలిపాను. తరవాత నిమిషం వూపిరాగింది. ఇల్లంతా, నడవాలో పడుకున్న వాళ్ళంతా, విని లేచినట్లే అనిపించింది. అమీర్ కౌగిలిలో పెనిగాను. కాని ఒదలడు కద! మనుష్యులు రావడం, వెతకడం, దీపాలతో గది నిండడం జరిగినట్టే తోచింది నాకు. కాని వాళ్ళందరూ వచ్చినా, అమీర్ మాత్రం తలన్నా ఎత్తి చూడకుండా తనపని తాను చేసుకునేటట్టు కనపడ్డాడు. అపాయమంటే ఏమిటో అర్థంకాని మనిషి అతనొకడు కనపడ్డాడు నాకు. అదేమి అదృష్టమో ఆ అపాయం అతన్ని చూసి తొలగిపోయేది. అతని నిర్లక్ష్యం చూస్తే ఒకప్పుడు అతని పాదాల్ని నా ప్రాణాలతో కడగాలనిపిస్తుంది. ఒకప్పుడు మీదపడి చీల్చి చంపెయ్యాలనిపించేది.
కొంత సేపయిం తర్వాత స్వస్థపడి నెమ్మదిగా మాట్లాడుకున్నాము. ఇద్దరికీ దగ్గిరిగా బల్లమీద కూచుని, మామిడిచెట్టు పూతలోంచి మిణుగురు పురుగులూ ఆర్ద్రా కలిసి మెరుస్తున్నాయి. చలిగాలి మమ్మల్నప్పుడప్పుడు పలకరిస్తోంది. కాలవలో కప్ప మూలుగుతోంది. రోడ్డుమీద లాంతరు వెలుతురు కొంచెంగా బీరువా మీదపడి, ఆ లావాటి పుస్తకాల మీది బంగారపు అక్షరాలు తమాషాగా మెరుస్తున్నాయి.
'ఎక్కడికి తీసికెడతావు నన్ను.'
'నిజాం?'
'వెళ్ళి?'
'హాయిగా వుందాం?
'అందరూ వూరుకుంటారా?'
'తెలిస్తే కద! వెళ్ళిపోయాక తెలిస్తే మాత్రం యేం చేస్తారు?'
'అక్కడి వాళ్ళూ!'
'మనకి తెలిసినవాళ్ళెవరుంటారు? ఆ దేశం చాలా బావుంటుంది. మనుషులు చాలా మంచివాళ్ళు, స్నేహానికి ప్రాణమిస్తారు. నీకేం భయం లేదు' అన్నాడు.
అదివరకే నిశ్చయించుకున్నాను వెళ్ళాలని. యెందుకు? అమీర్తో వుండాలని. అతనితో కావలసిన కామం యిక్కడ అభ్యంతరం లేకుండా సాగుతూనే వుంది. (నాకే కాదు. చాలామంది పతివ్రతలకే సాగుతోంది.) అట్లాంటప్పుడు ఇంట్లోంచి పోయి కులభ్రష్టని కావలసిన ఆగత్యమేముంది? అమీర్ తో కామం తీర్చుకోడానికి కాదు. అతని ముఖం చూస్తూ అతన్ని పూజించడానికి! వంటకోసమూ, ఆ రాత్రి నిమిషాల కోసమూ, నా భర్తతో బతికాను. అమీర్ తో అందుకు కాదు. అమీర్ కళ్ళలోని ఆరాధన చూసేందుకు, అతనితో మాట్లాడి, అతనివంక చూస్తూవుంటే అదృష్టానికి వెళ్ళాను. అది కామమే? ఈయనతో జీవనం పవిత్ర ప్రేమా? అమీర్ ఒక్కసారి కూడా నన్ను తాకనన్నాసరే వెళ్ళిపోయేదాన్నే, అతని పాదసేవకి, అతనితో సుఖదుఃఖాలు పంచుకునేందుకు. అతని ఆజ్ఞలే అతని దయే, అతని పూజే నా మతంగా, నా ధర్మంగా, నా ఆనందంగా, నా జీవనాన్ని అర్పించేందుకు, అతను నన్ను ప్రేమించనీ, చంపనీ, పాలించనీ, వొదిలెయ్యని. ఆ కొత్తవాడు, తురకవాడు, అతని చేతుల్లో నా ప్రాణాల్ని అర్పించాను. ఇంత విశ్వాసమూ ఇంత త్యాగమూ అంతా కామమేనా? నా హృదయంలోని ఆ అప్రమేయానందమూ, ఆ అనిర్వచనీయ మాధుర్యమూ, నా అల్పత్వమూ, క్షుద్రత్వమూ, వొదిలి, నగలూ, చీరలూ, మర్యాద అన్ని అసహ్యాలనిపింపజేసిన అద్భుతానుభవం కామమా? ఎన్నడూ అంతవరకు అసలు జీవితంలో సాధ్యమని అనుకోని, అమహాద్భుతరసనా, రసికత్వమూ ఔన్నత్యమూ ఇవన్నీ క్షుద్రకామమేనా? భోజనమూ, నిద్ర లోభత్వమూ తిట్లూ, చీవాట్లూ, అసహ్యమూ, ఇదంతా పవిత్ర ప్రేమా! అట్లా అయితే ఈశ్వరుడే, సృష్టి రహస్యమే కామం. ప్రేమ అంటే ద్వేషమని అర్థం.
అక్కడికి వెళ్ళిన మొదటి నిమిషానే అర్థమయింది నాకు, ఆ స్థలంలో అద్వితీయానందాన్ని అనుభవించబోతున్నానని, చుట్టూ వున్న ఆకాశాన్నీ, కొండల్నీ, పక్కన చింత చెట్లనీ, మా చిన్న యిల్లునీ, ఆ గాలినీ, అమీర్నీ చూడగానే నా మనసెట్లా అయిందనుకున్నావు! చెప్పనా? చిన్నప్పుడు మన ముందు పది పిండి వంటలు పెడితే, యేది తినాలో తోచక, తినబోతున్నామని తెలిసికూడా అన్నీ ఒక్కమాటుగా యెట్లా తినాలా, ఇది తినేలోపల రెండోది రుచి చూడడం ఆలస్యమౌతుందే, అని ఎంత కష్టపడుతుంది మనసు? అట్లానే ముందే, తెలుసు, దినం తర్వాత దినం నాకు తీసుకురాగల వివిధ వర్ణ రాగసుందరానుభవాలు! కాని ఆగలేను. అన్నీ ఒక్కసారిగా, తొరగా యెప్పుడు నన్ను కావలించుకుంటాయా అని తహతహలాడిపోయినాను. ఏం కారణం లేకుండా చిన్నప్పుడు నవ్వూ, అర్థంలేని ఆనందం కలిగి ఇంకా ఏంచేద్దాం, తిరుగుదాం, గంతులేద్దాం, నవ్వుదాం అనిపించేదే! అట్లా వుండేది గంట గంటా నాకు. వూరికీ, మాకూ మధ్య పెద్దచింతతోట వుంది; ఆ గుడిశ తప్ప యింక చుట్టూ ఏమీలేవు. ఎటుచూసినా నీలపు కొండల్లోనూ, ఆకాశంలోనూ అంతమయ్యే పెద్ద మైదానం. ఒక్క పెద్ద కొండ మాత్రం మా యింటికి అరమైలు దూరంలో వుంది. దానిమీద శిథిలమైన కోట ఒకటుంది. మా గుడిశ పక్కన చిన్న యేరు ఎప్పుడూ తొరగా పరిగెత్తుతూ వుంటుంది. దాన్నిచూస్తే, ఎవ్వరితో మాట్లాడక ఇంట్లో పనిమీద యెప్పుడూ తిరిగే మా అమ్మ జ్ఞాపకం వొచ్చేది.
ఆ దేశంలో ఆకాశం ఎప్పుడూ నీలం కారుతున్నట్టే వుంటుంది. వాన కురిసినా శుభ్రమైన కొండల్నీ, నేలనీ ఇంకా శుభ్రంగా కడుగుతుంది. టపటపమని చినుకులుపడితే, కడుపులో ఉన్న స్త్రీవలె నా యేరు నిండి పోయేది. కొండలన్నీ మేఘాల్ని కప్పుకుని తెల్లనయేవి.
మొదట కుండల్లో వండడం నెయ్యీ కూరలూ లేకుండా తినడం, పరదాపేసుకుని ఆరుబైట పడుకోవడం కొత్తగా కష్టంగా వుండేది. అప్పుడప్పుడు పిచ్చి పట్టుదలలు కూడా పట్టేదాన్ని, కాని కష్టపడ్డానికీ, కొత్త పడడానికీ వ్యవధి వుంటేనా? అమీర్ వుండనిస్తేనా? అయినప్పటికి నాకు చిన్నప్పటి అలవాట్లు వదలడం ఎంతో కష్టమయింది. వంట చేసేప్పుడు అమీరావేపు వొస్తే అన్నీ పారేసి దూరంగా పోయినాను. అన్నం తినక తిరిగాను. కాని ప్రేమ వున్నప్పుడు త్యాగం చెయ్యడం ఎంత సులభమనుకున్నావు? ఊరికే ఏ త్యాగానికైనా పతివ్రతల్ని పొగుడుతారుగాని ప్రతి నిమిషం సౌఖ్యాల్నీ, ఆనందాన్నీ అవసరంగానైనా సరే వొదిలేసుకుని ప్రేమబలం స్థిరపరచాలని వుంటుంది.
ఆయన్ని ప్రేమిస్తూ నేను ఆయన యింట్లో వున్నప్పుడు ఒకసారి ఇంగ్లండు వెళ్ళివచ్చిన ఆయన స్నేహితుణ్ణి తీసుకొచ్చి తనతో భోజనం వడ్డించమన్నారు. ససేమిరా వీల్లేదన్నాను. కారణం - మా పెత్తల్లి సూరమ్మగారికి నా మీద కోపం వస్తుంది. ఏమంటుంది? 'మొగవాడు అతడు అన్నీ నిర్లక్ష్యంగానే చెయ్యాలంటాడు. ఆడదానివి నీకు బుద్ధిలేక పోయిందా? అంటుంది. తోడికోడలు నన్ను వెలేస్తానని బెదిరిస్తుంది, నవ్వులాటకులాగు. పాపం ఆయన నన్ను బతిమాలారు. తన పరువు పోతుందని కన్నీళ్ళపర్యంతమైనారు. తనమీద ప్రేమలేదా. తన మాట వినకూడదా అని అడిగారు. రాయివలె స్థిరంగా నా పట్టుదల విడవలేదు నేను. ఇదీ మనం భర్తలకోసం చేసే త్యాగం. ఆధ్యాత్మిక ప్రేమ. పవిత్ర దాంపత్యానికి మన జీవితంమీద వుండే "ఇన్ల్ఫుయస్సు" కాని మామయ్య వొచ్చి, "చివరికి తురకకూడు తింటున్నావుటే!" అంటే నాకేమనిపించింది? ఏమన్నాను? ఇది తురక కూడా? ప్రేమ దేనికి నైవేద్యం పెట్టి భక్తితో కళ్ళుకద్దుకుని మధ్య మధ్య అమీర్ ముద్దులతో ఆరగించిన ఆ అమృతం తురక కూడా? ఏం తింటున్నామో, తింటున్నామో లేదో అనే ధ్యాస వుంటేనా? ఇంక బతకడానికి వీలులేదనీ ఆకలేసి మధ్య మధ్య ఆనందానికి అవాంతరంగా మనసు మళ్ళించుకుంటానే గాని, ఇంక యింటిదగ్గరవలె ఈ కూరలో ఉప్పు సరిపోయిందా, ఈ చారులో పోపు చాలిందా అనే ఆలోచనలు వుంటాయా? పచ్చడిలో యిసక పడ్డదనీ, అన్నం చిమిడిందనీ, పులుసు ఉడకలేదనీ తిట్లూ - లేచిపోవడాలూ - విస్తరి మొహాన కొట్టడాలూ పవిత్రమైన మానసిక ప్రేమగల ఆదర్శ సంసారాల్లో జరుగుతాయిగాని, పశువులవలె కామంతో పొర్లాడే గుడిసెల్లో జరగనే జరగవు! మానసిక ప్రేమగనక- దాంట్లో వుప్పెక్కువైందనీ, కారమెక్కువయిందనీ, తగాదా! ఈ మానసిక ప్రేమమీద నాకెందుకంటే అంతకోపం - మామయ్య తీసుకొచ్చాడు దాన్ని వాళ్ళ వూరినించి, దాని సంగతి చెపుతా తరవాత. కామంతో పడి కళ్ళు మూసుకుని నరకంలోకి జారేవాళ్ళకి ఈ విచక్షణలన్నీ యెందుకుంటాయి! గంజే పరమాన్నంగా వుంటుంది. అది మళ్ళీ ప్రేమలక్షణమే నంటారు కొందరు పూర్వులు. కాని మామయ్యవంటి విమర్శకులు మాత్రం దాన్ని పశుకామమే నంటారు! ఎందుకు? వారి నీతి హృదయాలకి నెప్పి కలిగిస్తోంది! నావంటి వారి పాడుజీవిత చరిత్రలనీ చదివీ, వినీ వారి భార్యలూ, కూతుళ్ళూ లేచిపోతే యెట్లా?
ఇంక విను. ఆరుబైట చక్కని బంగారపు టెండలో చేతులు పైకి చాచి, ఆవలించి, వొళ్ళు విరుచుకుని చాపమీద నించీ ఒక్క దూకు దూకి లేచి ఒకరి మొహం వొకరు కొత్తగా, అందంగా చూసుకుని రాత్రి జ్ఞాపకం వల్ల కొంచెం సిగ్గుపడి, చుట్టూ వున్న సౌందర్యాన్ని చూసి నవ్వడం. కారణం లేకుండా, ఆనందంతో ఒకరికి ఒకరమూ, మా ఇద్దరికీ కలిసి ఆ సుందరలోకం వుందని నవ్వడం. పొద్దున్న కాఫీలా? ఏంలా. ఒక్క రోజు కాఫీ గంట ఆలస్యమయితే గిలగిలలాడేదాన్ని. మొదటిరోజు నించి కాఫీనే మరచిపోయినాను. పెందరాళె ఇన్ని బియ్యం కుండలోవేసి యేట్లో కడిగేటప్పటికి అమీర్ యిన్ని చితుకులతో పొయ్యి వెలిగించేవాడు. ఆ మంట అయిపోయేటప్పటికి అవి వుడికివుండేవి. గుడిసె వెనుక రాయి వుంది. దానిమీద యే వుల్లిపాయో, గోంగూరో, మిరపకాయా, ఉప్పూ వేసి నూరడం, అంతే వంట. వున్నప్పుడు చల్ల.
అమీర్ బైట కూచునీ పావురాలని ఆడిస్తూ వుంటే అప్పుడప్పుడు తమాషాకి నేను వెళ్ళి గుడిసె తలుపుచాటు నుంచి సన్న గొంతుతో.
'లేచి మడికట్టుకోండి' అనేదాన్ని, అతను ప్రయత్నంలో నా భర్త గొంతూ, బ్రాహ్మణ వుచ్చారణా పెట్టి -
'ఇదిగో లేస్తున్నా, ఈ కాయితము చదివేసి....' అనేవాడు. ఒకసారి మరిచిపోయి 'పావురాన్ని ఒదిలి' అన్నాడు.
ఏం నవ్వేవాళ్ళం!
ఒకసారి అమీర్ వచ్చి 'మరి కచేరీవేళ అయింది. యింకా వంటకాలా?' అన్నాడు.
'అయ్యో, ఈవేళ తద్దినమని జ్ఞాపకం లేదూ, మీకు?' అన్నాను.
ఆ మాటకి నన్ను పట్టుకుని దవడవేపు భీకరంగా ఒంగితే తప్పించుకోడానికి పెనుగులాడాను. అందుకని భుజంమీద కొరికాడు. అదుగో వెక్కిరిస్తోంది నీ నొసలు. కొరకడమేమిటి, అదేం సరసమనేనా? ఆ మైదానంలో గుడిసెల్లో బతికి, కుండల్లో తినేవాళ్ళకి మాకు నాజూకు లెక్కడివి! దేహాన్ని మనసునీ కూడా అంటకుండా కళ్ళుమూసుకుని వేదాంతోక్తంగా సంసారాలు గడపడం; పుష్టీ, జవా నిండు రక్తమూ వున్న మోటు ప్రజలకి చాతకాదు మరి. చదువులతోనూ, రోగాలతోనూ ముప్పైయేళ్ళకే ముసలి వాళ్ళయిన యీ నవీన రసికులకి మాత్రమే చేతనౌను. మాటలతోనూ, ధర్మబోధనలతోనూ, ఆధ్యాత్మిక ప్రేమతోనూ తృప్తి పొందడం. అమీర్ కి సంతోషం ఒచ్చి నన్ను ఒక్క వూపు వూపాడా, కళ్ళు తిరిగి దూరంగా తూలేదాన్ని. గట్టిగా జబ్బ పట్టుకున్నాడా రెండుగంటల దాకా నెప్పి పోదు. కావలించుకుంటే వూపిరాడదు. మొదట్లో- కళ్ళలో అల్లరీ, ప్రేమా మరచి పోయినాను. (మామయ్య ఆ మాట అన ఒద్దన్నాడు) కామమూ, వెలుగులో నా వంక పడినాడా భయంతో ఒణికేదాన్ని.
ఇంక మా స్నానం. రోజు కెన్నిగంటలు! యెన్నిసార్లు గడిపే వాళ్ళమో ఆ యేట్లో? వాన కురుస్తున్నా, చలేస్తున్నా, ఎండలో చీకటిలో యెప్పుడూ స్నానమే. యెంత బావుండేది యెండలో తళతళలాడే యేటి చల్లటి నీళ్ళలో తెల్లని యిసకమీద పడుకోడం! ఆ చిన్న అలలు నా మెడని కొడుతూ, నీళ్ళు స్నేహతులులాగ యిద్దరినీ దగ్గిరికి లాగుతూ పరిగెత్తడం యెంత బాగుండేది?
ఒకసారి చీకటిలో అమీర్ తో 'అమీర్! నా కార్యంనాడు ముత్తైదులు నన్నాయన దగ్గిరికి ఈ నీళ్ళలాగే తోశారు' అన్నాను. వీపు వెనక నించి అతని నవ్వు వినబడుతుందనుకున్నాను. దానిబదులు కర్కశమైన కంఠంతో "ఎవరు వాళ్లు" అన్నమాట వినబడ్డది.
ఆశ్చర్యపడి! తమాషా చేస్తున్నాడని వెనక్కి తిరిగి చీకటిలో అతని మొహాన్ని వెతికాను నీళ్ళమీదనుంచి.
'ఎవరేమిటి?'
'వాళ్ళపేరు?' అన్నాడు ఖండితంగా. 'ఆ ముత్తైదు ముండలంటే!' అన్నాడు విసుగుతో.
చప్పున నీళ్ళలో అతని దగ్గిరికి తేలి భుజాల్ని ఆనుకుని చేతులు మెడచుట్టూ వేసి.
"ఎందుకు అమీర్! ఏమిటా కోపం?'
'చెప్పు.'
'వాళ్ళ పేర్లా?'
'అవును.'
నవ్వాను. ఊగే నా వక్షం నీళ్ళలో నించి అతని హృదయాన్ని కరిగించింది.
'నిన్ను - నిన్ను - నాదాన్ని - వాడి దగ్గిరికి. ఆ బొండు వాడి దగ్గిరికీ బలవంతంగా లాగారా? ఆ రాత్రి, పాపం, చిన్నదాన్ని - సహాయం లేనిదాన్ని - నిన్ను వాడి చేతల్లోకీ-వాడి-గదిలోకి- నరుకుతా, ఒక్కొక్క ముండనే కొప్పుపట్టుకు లాగి-ఒక్కొక్క'.... ఇంకేమేమో అన్నాడు. ఆ మాటలే దుర్గమ్మత్తా, ఆ తాసీల్దారుగారి భార్య వింటే? నాకు చాలా నవ్వొచ్చింది.
'కాని నాకు వెళ్ళాలనీ వుందిగా! ఊరికే సిగ్గుపడుతున్నాను-అంతే!'
నా నోరు గట్టిగా మూశాడు. 'అనకు, ఆ మాట అనకు, వాడి మీద ఆ పంది మీద, ఆ కుళ్లు సిబ్బిమీద నీకు నీకు....
పక్కున నవ్వాను. ఆయన్నంటే కోపమే రాలేదు. అదేదో పూర్వజన్మ లాగుంది ఆయనతో కాపరం.
"కుళ్లు సిబ్బేమిటి, అమీర్...." నవ్వుతున్నాను. ఆ నీటి మీద నించి నా నవ్వు బ్రిడ్జికింద ఆ చీకటిలో మారుపలికింది. అమీర్ కి అంత యీర్ష్య. సహించలేడు. ఆయన్ని గురించి ఒక్క మంచి మాట మాట్లాడితే!
విను, యెంత సంతోషంగా వుండేది అట్లా స్నానాలు చేస్తే. స్వర్గంలో సౌఖ్యాలంటే ఇదేగావును అనిపించేది. స్వర్గ నరకం సంగతెత్తితే అమీర్ కి కోపం. మన స్వర్గం అదీ అంతా అబద్దమంటాడు.తనతో కూడా నన్ను వాళ్ళ తురక స్వర్గానికి తీసుకుపోతా ననేవాడు.
'నేను ముందర చస్తే?'
'నేను చస్తా!'
'రెండో మాట నేననలేక వూరుకుంటే, అతనే -
'నేను చస్తూవుంటే, నిన్నూ చంపుకుంటా' అన్నాడు.
'పోనీలే పాపం నీకోసం నేనూ చస్తాలే' అన్నాను నవ్వుతో.
'చావకపోతే చంపుతా'
'కాని అమీర్ మనం చేసిన ఈ ఘనకార్యానికి మనకి స్వర్గమిచ్చే దాత యెవడు?'
'మా స్వర్గంలో ఫరవాలేదు. నేను మాట్లాడతాగా?'
'ఎవరితో?'
'మా స్వర్గం వాళ్ళతో'
'తమాషాగా వుందే, మీ స్వర్గం సన్గథి౧ మీ నరకంలో ఎవరుంటారు?'
"హిందూ ప్లీడర్లు, కాఫర్లు" అని రాయిపెట్టి కుండ పగలగొట్టాడు. నవ్వెట్లా ఆపుకోను?
"ఆయన మూలకంగా ప్లీడర్లందరికి యిప్పించావా నరకం?"
"కాకపోతే నా దగ్గర వ్యాజ్యానికని ముగ్గురు ప్లీడర్లు గాడ్దె కొడుకులు మూడు ఆర్లు పద్దెనిమిది రూపాయలు లాగారు. వాళ్ళందరికీ బాధ.... నరకమే"
"నీ పెత్తనమే!"
"చూస్కో, అబద్దమేమో!"
"ఇంకేం మాట్లాడను?"
అట్లా గడిచేవి మా స్నానం సంభాషణలు. ఒకరినొకరు నీళ్ళ కింద తాకుతో, ఒకరిని ఒకరు రుద్దుతో, తోసుకుంటూ యెన్నో గంట లాడుకునే వాళ్ళం. అమీర్ నాకు యీత నేర్పాడు. ఎవరన్నా కొత్తవాళ్ళు వొంతెన మీద నించి వెడుతోవుంటే, ఇద్దరం కదలకుండా దానికింద యిమిడి, వాళ్లు వెళ్ళగానే పెద్ద నవ్వు నవ్వుతాము. నా జుట్టు నీళ్ళలో నల్లగా తేలుతూ చేతులు నీళ్ళకింద వొంకరగా కనపడేట్టు నీళ్ళు తోసుకుంటూ యీత్తే అమీర్-అలా నిలిచి నన్ను చూస్తూ,
"ఆగకు. అలానే తేలుతూ వుండు. అలానే యెప్పుడూ.... ఆ జుట్టెక్కడిది? ఎలా తెచ్చుకున్నావు? అరేబియాలో రాత్రి వీచే యీదురు గాలి నీ జుట్టు రూపం దాల్చింది!"అని వూరికే బాధతో మురిసిపోతాడు. ముణిగివొచ్చి నా కాళ్ళని పట్టుకుని నీళ్ళల్లోకి లాగి ముంచి కావిలించుకుంటాడు. ఇద్దరం అల్లానే ముణిగిపోయినాము అడుక్కి. నల్లని యిసిక మీద పడుకుని పైకి నీలంలోకి చూశాను ఒక నిమిషం. అతని చేతుల్లో అతని కింద అక్కడే వుండాలనుకుంటున్నా. ఇంతలో నీళ్ళు తాగేశాను ఒక్కొక్క రాత్రి వెన్నెట్లో స్నానం చేస్తాము. అమీర్ ఆ వొడ్డుకి యీది, దూరమై నీళ్ళకింద దాక్కుని భయపెడతాడు. యెవరూ లేక యిద్దరమే ఆ నీళ్ళ నిశ్శబ్దంలో కూచుని ఒకరి మొహాలొకరకం చూసుకోవడం నాకు భయం. కాని అమీర్ దగ్గిరిగా వుండి చెయ్యేసినంతసేపూ యేదో నీళ్ళ లోకంలో వున్నట్లుండేది. ఒక రోజు నన్ను 'ఉలూపి' అని పిలవమన్నాను, నా అర్జునుణ్ణి. అర్జునుడూ, అదంతా అబద్ధమంటాడు అమీర్.
పూర్వం మా మరిదిన్నీ, అతని పెళ్ళామున్నూ బట్టలిప్పేసుకుని ఒకరికెదురుగా ఒకరు కూచుని స్నానాలు చేస్తారని విని నాకు పరమ అసహ్యం వేసేది. కాని యేటిలో రాత్రులు యిద్దరం బట్టలన్నీ యివతల పారేసి స్నానం చేసేవాళ్ళం. నీకర్థమౌతుందా ఆ ఆనమ్దమ౧ కామం పశు కామమంటున్నాయి నీ కళ్ళు! కామం కాదు, ఈ ఆకాశంకింద ఆ నీళ్లలో బట్టలెందుకు! బట్టలు వేసుకున్నా గాలీ, నీళ్లూ వొంటినంతా తాకుతాయి.... అమీర్ కూడా అంతే. ఇద్దరం నీళ్లలో దొర్లుతూ వుంటే అమీర్ వేళ్ళు నా జుట్టునీ, భుజాల్నీ, రొమ్ముల్నీ, తొడల్నీ తాకితే నాకు చెరువులో తామర కాడలు వొంటికి తగిలినట్టుండేది. అతడు మగవాడనే భావంగాని,అతని స్పర్శవల్ల కామ వికారం గలగడంగాని ఏమీ వుండేది కాదు. రాత్రులు అతను నన్ను కోరేప్పటి స్పర్శకీ, తక్కిన రోజుల్లా నాతో ఆడుకునేప్పటి స్పర్శకీ స్పష్టమైన భేదం వుంది. సమయాలను బట్టి అమర్ నా స్నేహితుడుగా, అన్నగా, తండ్రిగా, బిడ్డగా, గురువుగా, భర్తగా, ప్రియుడిగా, అధికారిగా మారేవాడు. నేనూ అంతే. ఒకప్పుడు అతి చనువు! ఇంకోసారి కారణం లేనిదే బింకం. కొత్త లేనిదే అమితమైన సిగ్గు. పిచ్చి దయ. కపటమైన కోపం. తల్లి చూపే లాలన. బోగందానిబెట్టూ, సత్యభామ ధూర్తత్వమూ, కలహమూ అన్నీ రకరకాల మారి చూపేదాన్ని. కానీ, సాధారణంగా యిద్దరమూ మా స్త్రీ పురుష భేదం మరిచి మిత్రులవలె ఆడుకునేవాళ్ళం. అలాకాక ప్రతినిమిషమూ ఒకరికొకరికి కామ వికారం కలుగజేస్తూవుంటే, ఇరవై నాలుగు గంటలూ కలసి జీవించగలమా? ప్రతి సంజ్ఞా, చూపు, కామ వికారంతో స్ఫురించటం, గాలిలేని ఇళ్లల్లోనూ, ఈగలు ముసిరే భోజనాల సావిళ్ళలోనూ, పవిత్ర ప్రేమమయ సంసారాల్లోనూ, అంతేగాని స్వచ్చమైన నీళ్ళల్లోనూ, ఎడార్లలోనూనా? అమీర్ అవతల వొడ్డుకి యీది నుంచుంటే ఆ రాత్రి నిశ్శబ్దంలో యెవరో గంధర్వ కుమారుడు వొచ్చి నుంచున్నట్టు కనపడేవాడు. స్నానం అయిం తరవాత తుడుచుకోము. కొంచెం అటూ ఇటూ పరుగెత్తి బట్టలు వేసుకొంటాము. బావుండలేదూ? అదుగో "ఏం బావుండడంలే!" అంటోంది నీ పెదిమల వొంపు. "నీకేం తెలుసు." అని ధైర్యంగా అనగలను నేను.