పన్నీటి కెరటాలు 1

By | August 6, 2022
telugu kathalu navalalu sahithi పన్నీటి కెరటాలు 1 టక్ టక్ టక్........టక్ టక్ "అర్దరాత్రి అంకమ్మ సివాలన్నట్లు ఈ చప్పుళ్ళు ఏమిటి?" తువ్వాలు పరచుకుని మెట్లమీద అడ్డంగా పడుకొన్న సింహాచలానికి రాత్రి రెండుకావస్తున్నా నిద్రపట్టలేదు. పడుకునే కాలుమీద కాలువేసుకొని బీడీతాగుతూ గతించిన రోజులు గురించి ఆలోచిస్తున్న సింహాచలానికి గుడిలోపలనుంచి టక్ టక్ మన్న శబ్దం వినపడింది. "తను శబ్దం నిజంగా విన్నాడా! లేక మాగన్నుగా నిద్రపట్టిందా?" అనుకుంటూ బీడీ అవతల పారేసి చెవి వొగ్గాడు సింహాచలం. ఆగి ఆగి టక్ టక్ మన్న శబ్దం మళ్ళీ వినవచ్చింది. "అమ్మనాయనోయ్! గుడిలో భూతప్రేతగణాలు ఇనపచెప్పులు వేసుకొని నడవటంలేదుకదా?" భయంతో అనుకొన్నాడు సింహాచలం. "థూ.....నీబుద్ధి తగలడ. పవిత్రమైన గుడిలోకి దెయ్యాలు భూతాలు ఎలా వస్తాయి?" "ఎందుకు రావులే, ఇది పరమేశ్వరీ ఆలయం అయినా ఆయమ్మ భర్త ఈశ్వరుడేకదా! శంకరుడికి చుట్టాలా పక్కాలా భూత ప్రేతగణాలు తప్ప! ఆమ్మవారు వున్నచోట అయ్యవారు ఉంటారు, అయ్యవారికోసం భూతాలు ప్రేతాలు శాకిని ఢాకిని___ గుడిలోంచివచ్చే చప్పుళ్ళ గురించి సింహాచలం అలా ఆలోచిస్తుండగానే రెండుమూడుసార్లు టార్చీలైటు వెలిగి ఆరటం ఆ ఫోకస్ కంట పడ్డాయి. సింహాచలం చటుక్కుని లేచికూర్చున్నాడు. సింహాచలం మరీ పల్లెటూరివాడు కాదు. అలాఅని బస్తీలో ఏ రిక్షాయో లాక్కుంటూవుండే పట్నవాసం మనిషి కాదు. అటు బస్తీ ఇటు మరీ పల్లెటూరుకాని ఊళ్ళో ఉంటున్నాడు. తెలుగు సినిమాలు బాగా చూడటంవల్ల ఊసరవిల్లిలా రంగులు మార్చే రాజకీయాలగురించి ప్రతి నిమిషం ప్రజలు మాట్లాడుకోవడం వినివుండటంవల్ల ఎంతో కొంత ప్రపంచజ్ఞానం అలవడింది. సింహాచలంకి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చిన తరువాతనే లేచి కూర్చోటం జరిగింది. పరమేశ్వరీ ఆలయం కొండమీద వుంది. విజయవాడలోని కనకదుర్గమ్మవారి కొండకన్నా పెద్దకొండ ఇది. పరమేశ్వరి అంటే పార్వతీదేవి. ఆమె భర్త పక్కన ఉండాల్సిందే కదా! పరమేశ్వరీ ఆలయంలో పరమేశ్వరుడు కూడా ఉన్నాడు. పరమేశ్వరీ పక్కగదిలో చిన్న పానుపట్టము లింగము నాగరాజు నాట్యమయూరుడు నటరాజు. పరమేశ్వరీ విగ్రహమే ఆ గుడిలో పెద్దది. అందుకని గుడిలో పెద్దగదిలో అమ్మవారి విగ్రహం ఉంటుంది. పట్టుచీర, పట్టురవిక. వళ్ళంతా ఆభరణాలు. ఇవిగాక పూలమాలలు పాదాలచెంత పూజ చేసిన కుంకుమరాసి. విగ్రహంలో సజీవమైన జీవకళ ఉట్టిపడుతూ చూడగానే కొట్టొచ్చేలా అందంగా గంభీరంగా ఆకర్షణీయంగా కానవస్తుంది. భక్తులు అమ్మవారి దర్శనం తర్వాతనే అయ్యవారి దర్శనం చేస్తారు. పూజలు మొక్కుబడులు అర్చనలు కోరికలు కోరటం అవి తీర్చుకోవటం అన్నీ ఆ గుడిలో అమ్మవారికే. కొండ ఎక్కాలంటే మెట్లు ఎక్కి వెళ్ళాల్సిందే. మెట్లవేపు తప్ప మిగతా అన్నివేపులా అన్నికొండల్లాగానే చెట్లు చేమలు ఎగుడు దిగుడు రాళ్ళతో ఉంటుంది. కొండపైన ఒకటి రెండు కొట్లు ఉన్నాయి. కుంకుమ పూజ ద్రవ్యాలు టెంకాయలు అమ్మే కొట్లు కొండదిగువన నడిచేమార్గానికి అటూ ఇటూ ఉన్నాయి. కొండకి మూడువేపులా చేలు ఓ పక్కన అదైనా కొద్దిదూరాన ఊరు అసిరిపల్లె ఉంది. కొండమీద భక్తులకి చెప్పుకోతగ్గ సౌకర్యాలు (హోటలు షాపులు రాత్రిళ్ళువుండే వసతి) లేకపోయినా అమ్మవారి శక్తివల్ల ఎక్కడెక్కడి వాళ్ళూ వచ్చివెళుతుంటారు. పరమేశ్వరీ అమ్మవారికి కూడా తప్పలేదు. గిల్టునగలు ఉత్సవాలప్పుడు తప్ప ఎప్పుడూ అసలైన నగలు పెట్టరు. ఆ దేవాలయ అధికారులు పూజారులు కొండదిగువున ఇళ్ళలో ఉంటారు. రాత్రిళ్ళు పైన ఎవరూ ఉండరు. గుడితలుపులు రాత్రి పదితర్వాత మూస్తారు. తిరిగి తెల్లారి ఐదు గంటలకల్లా తెరుస్తారు. కరెంటు ఉండటంవల్ల మెట్లమీద గుడిలోను రాత్రిళ్ళు మొత్తం నాలుగులైట్లు ఉంటాయి. గుడి కాపలాకి రాత్రిళ్ళు ఒక వాచ్ మెన్ మాత్రం ఉంటాడు. అదైనా గుడిలోకాదు. గుడిబైట తలుపుల దగ్గర చాలామంది బిచ్చగాళ్ళ నివాసం గుడిమెట్ల మీదనే రాత్రింబవళ్ళు వాళ్ళక్కడనుంచి కదలరు. గుడిచుట్టూ విశాలమైన ఆవరణ ఉంది. రెండుమూడు చెట్లు ఉపగుడులు చిన్న అరుగులు ఏవేవో ఉంటాయి. గుడిమాత్రం చాలాపెద్దది. అంతా రాతితో కట్టిందే. లోపలి ద్వారాలుకూడా అన్నీ ఒకేరకంగా ఉండి వెళ్ళినదోవనే మళ్ళీ వెడుతున్నామా అనిపిస్తూ ఉంటుంది. అమ్మవారి గుడి ఎంతపెద్దదో చుట్టూవున్న ప్రహరీకూడా రాతిగోడలతో ఎత్తుగాకట్టి గట్టిగా వుంది. గుడి గురించి అమ్మవారి మహత్యాల గురించి చరిత్ర గురించి రక రకాల కథలూ వినవస్తుంటాయి. నిజానిజాలు ఆ పరమేశ్వరీదేవికే తెలియాలి. యాభై ఏళ్ల క్రితం అంత పెద్దగుడికీ పూజారులు ఇద్దరేఉండేవారు. ఇప్పుడు భక్తులూ పెరిగారు పూజారులు పెరిగారు. పూజారులు రెండు పక్క రెండు ఇరవై రెండు మంది అయారు. దేవాలయ ఆదాయం ట్రష్టీ అధికారులు అందరూ పెరిగారు. భక్తులసంఖ్య పెరగటంతో. గతంలో గుడి విషయం ఎవరూ గట్టిగా పట్టించుకోకపోవటంవల్ల ఓ దొంగతనంకూడా జరిగింది. గుడిలో అమ్మవారి ముందున్న వెండియిత్తడి దీపం సెమ్మెలు పళ్ళాలు బిందెలు దొంగలు ఎత్తుకెళ్ళారు. ఆతర్వాత జాగ్రత్త వహించటంతో మళ్ళీ దొంగతనం అనేది జరగలేదు. కొంతవరకు అ గుడి గురించి తెలిసింది ప్రజలకు అంతే. భక్తులు మొక్కు కోంగానే పనులు కావటంతో భక్తగణం ఎక్కువయ్యారు, పరమేశ్వరీ అమ్మవారి ఖ్యాతి. నలువైపులా పాకింది. ఆతర్వాత గుడిఅన్న పదం మానేసి దేవాలయంగా పేరుపొందటం జరిగింది. సింహాచలం ఒకభక్తుడు. అతనికీ కొన్నికష్టాలు ఉన్నాయి. ఆనోట ఆనోట పరమేశ్వరీ అమ్మవారి పేరుప్రఖ్యాతులు మహత్యాలు విని అమ్మవారి దర్శనంచేసుకొని మొక్కుకుందామని బైలుదేరివచ్చాడు సింహాచలం, సింహాచలం బస్సు దిగేసరికి రాత్రి పదయింది. చిన్న హోటల్లో కిందనే భోంచేసి, ఆ రాత్రే మెట్లెక్కివచ్చి అన్నింటికన్నా పైమెట్లమీద గుడి ప్రహరీగోడకి పక్కనే తువ్వాలు పరచుకుని తలకింద పంచీపెట్టుకుని పడుకున్నాడు. ఎంతకీ నిద్రరాలేదు. అలా అలా రాత్రి రెండు కావస్తుండగా గుడిలోపలనుంచి టక్ టక్ మన్న చప్పుళ్ళు ఆగి ఆగి వినిపించాయి. దాంతో లేచి కూర్చోటం జరిగింది. సింహాచలం వాచ్ మాన్ కోసం చూశాడు. ఆ స్థానం ఖాళీగా దర్శనం ఇచ్చింది. వాచ్ మాన్ శివుడికి ఇద్దరు పెళ్ళాలున్నారు. కట్టుకున్నది ఒకతి ఉంచుకున్నది వకతి. కాస్త తిరకాసు ఏమిటంటే వీడు దాన్ని ఉంచుకో లేదు. అదే వీడిని ఉంచుకుంది మగతోడుకోసం. కొండకింద పూల మాలక్షమ్మ కొట్టు ఏదని అడిగితే ఎవరైనా ఇట్టేచెబుతారు. ఎత్తుగా లావుగా పోతపోసిన నల్లరాతి విగ్రహంలా ఉంటుంది. అది అలంకరించుకుంటే జాతరలో పోలేరమ్మలా ఉంటుంది. ఎంతైనా నేను ఆడదాన్ని, వంటరి ఆడది వీధికుక్క బతుకు అనుకుని శివుడిని ఉంచేసుకుంది. శివుడి సొంత పెళ్ళానికి పిల్లలున్నారు. అందుకని వాడు పెళ్ళాన్ని, పిల్లలని చచ్చినట్టు పోషించాలి. మాలక్ష్మమ్మ అలాకాదు. వాడికే మొగుడు అది. వాడి అవసరాలకి పదీ పరకా డబ్బులిస్తుంటుంది. చేపల పులుసు, రొయ్యల వేపుడు చేసి అన్నంలోకలిపి ముద్దలుచేసి స్వయంగా తనే దగ్గర కూర్చుని తినిపిస్తుంది. అదే పెళ్ళాం అయితే ఏ ఇగురుకూరో రెండు ఉల్లి రెబ్బలువేసి తగలెట్టి సంకటిగాచేసిన అన్నంలోవేసి కూడు పడేస్తుంది. శివుడు పగలంతా పెద్దమనిషి భక్త్ఘులను అదిలిస్తూ, క్యూలోజనాన్ని సర్దుతూ డ్యూటీ చక్కగా చేస్తాడు. డ్యూటీ లేనప్పుడు ఇంటిపట్టున బుద్దిగావుంటాడు. శివుడు డ్యూటీలో రాత్రుళ్ళు ఉన్నప్పుడే బుద్ధి సరీగా ఉండదు. దొంగలు కొండయెక్కి రావటానికి చుట్టూ కొండ సరీగా వుండదు, కొండనిండా చెట్టూచేమలు, పుట్టలు గుట్టలు, ఎగుడు దిగుడు రాళ్ళు. కనుక ఏ దొంగలువచ్చినా మెట్లమీదనుంచి రావాలి. మెట్ల మీద లైట్లు ఉంటాయి. బిచ్చగాళ్ళు పడుకునివుంటారు. గుడి తలుపులదగ్గర కాపలాగా వాచ్ మాన్ ఉంటాడు. పైగా పెద్దపెద్ద తలుపులకి తాటికాయంత తాళంకప్ప ఉంటుంది. దానితాలూకా తాళంచెవులు పెద్ద పూజారిదగ్గర ఉంటాయి. "అక్కడ తనువున్నా వకటే, లేకపోయినా వకటే. వంట్లో శక్తి' చేతిలో మూరెడుపొడుగు కర్రతప్పించి దగ్గర కత్తివుందా, తుపాకివుందా!" అలా అనుకుంటూ శివుడికి నైట్ డ్యూటీ పడినప్పుడల్లా పరమేశ్వరి పరమ శివుడిని కాపలాకాయటం (గుడికాపలా) ఆపై వాడు ఇంకెవరైనా ఉంటే ఆ పరమాత్ముడిపై భారంపెట్టి వదిలేసి శివుడు దర్జాగ మాలక్షమ్మ కొట్టు వెనుకనే ఉన్న దానింటికి వెళ్ళి నైట్ డ్యూటీ చేస్తుంటాడు. ఇప్పుడు వాచ్ మన్ శివుడు గుడి గుమ్మందగ్గర లేడు. మాలక్షమ్మ గుడిశలో ఉన్నాడు. శివుడి కథ తెలియని సింహాచలం వాచ్ మన్ కోసం చూసి అలాంటి శాల్తీ దరిదాపుల్లో కానరాకపోవటంతో మరోసారి గుడి తలుపులకి చెవి యొగ్గి అలకించి ఆ తర్వాత రెండేసిమెట్లకో అంగచొప్పున వేస్తూ కిందకి పరుగుతీశాడు. సింహాచలం అలా పరుగెత్తటంవల్ల ఇద్దరు ముగ్గురు బిచ్చగాళ్ళు నిద్రలేచి కూర్చున్నారు. పరుగున కొండదిగిన సింహాచలం అక్కడేఉన్న కొట్ల (షాపులు) మధ్యలో కెళ్ళి "దొంగలు దొంగలు" అనరిచాడు. వక్కసారిగా - అందరూలేచి పరుగున ఇవతలికి వచ్చారు. సింహాచలాన్ని చుట్టుముట్టారు. "ఎక్కడ ఎక్కడ! ఏమి టేమి టంటూ" అందరూ కలగాపులగంగా అడిగారు. సింహాచలం చేయిచాచి గుడివేపు చూపించాడు. "ఏం జరిగింది అన్నా?" గుంపులో ఎవరో అడిగారు. "గుడిలో దొంగలు దూరారు" సింహాచలం ఆయాసపడుతూ చెప్పాడు. "ఓర్నాయినో దొంగలే!" "ఓరమ్మో దొంగలే, ఎంతమంది?" "అసలేం జరిగింది" "దొంగల్ని నీవు చూశావా?" జరిగిందేమిటో తెలియదు. అందరికీ కంగారుగా ఉంది. ఎవరికీ తోచిన ప్రశ్న వాళ్ళు వేస్తున్నారు. "నేను చూడలా, గుడిలోపలనుంచి టక్ టక్ మని ఎవరో తవ్వుతున్నట్టు చప్పుడు అయితేను ఇలా పరుగెత్తుకువచ్చాను. ముందు కలేమో అనుకున్నాను, ఆ తర్వాత నాది అనుమానంలే అనుకున్నాను. ఆ తర్వాత దొంగలు గుడిని తవ్వుతున్నారని అనుమానం వచ్చింది...." సింహాచలం చెపుతుంటే మధ్యలో ఎవరో అడ్డుతగిలి "శివుడు గుమ్మందగ్గర కాపలా ఉంటాడుకదా?" అన్నారు. "అక్కడ ఎవరూ లేరు!" సింహాచలం చెప్పాడు, "నువ్వు సరీగా చూశావా?" "శివుడెవరో నాకు తెలియదుగాని అక్కడమాత్రం ఎవరూలేరు. నేను అటూయిటూ చూసి మరీవచ్చాను." సింహాచలం చుట్టూ మూగి వాళ్ళు ఏదేదో అడగటం, వాళ్ళకి సింహాచలం సమాధానం చెప్పటం జరుగుతుండగానే వాళ్ళ గోలకి లేచి వచ్చిన పువ్వుల మాలక్షమ్మ విషయం తెలుసుకుని నెమ్మదిగా అక్కడినుంచి తప్పుకుని తన ఇంట్లోకి వెళ్ళిపోయింది. శివుడిని తట్టిలేపుతూ "లేలే. అవతల కొంప మునిగింది" అంది మాలక్ష్మమ్మ! "ఎవరి కొంప?" సగం నిద్రమత్తులో అడిగాడు శివుడు. "ఎవరి కొంపో మునిగితే నాకెందుకు! నీ కొంపే లేలే" అంటూ శివుడ్ని ఓ గుంజుగుంజి లేపి కూర్చోపెట్టింది. "ఓర్నాయనో నా కొంపే, మళ్ళీ మా ఆవిడ కేమొచ్చింది" శివుడు కంగారుగాలేస్తూ అడిగాడు. "గుడిలో దొంగలు దూరారుట అంతాకలసి వాడెవడోవచ్చి చెపితే అడుగుతున్నారు. నువ్వక్కడ లేవన్న సంగతికూడా తెలిసిపోయింది." "నిజంగా నా కొంప ఇప్పుడు మునిగింది నాయనోయ్" అన్నాడు శివుడు లేచి చొక్కా తగిలించుకుంటూ. "నే ఉండంగా నీ కొంపేమీ మునగదు. ఇటుపక్కనుంచి వెళ్ళి కొండ ఎక్కు. జనం కొండమీదకి వస్తుండగా నీవు వాళ్ళకు కనపడేలా సగంమెట్ల మీదనుంచి కిందకి పరుగెత్తుకొస్తు 'దొంగలు దొంగలు' అని అరువు సరిపోతుంది. ఇంకా అనలస్యం చేశావంటే జనం మెట్లెక్కుతారు ముందు నీ పనిపడతారు. పద పద, తెలివిగా మెలుగు" అంటూ వెనక తోవన బైటికినెట్టింది శివుడిని. ఆ తర్వాత ఏమీ యెరగనట్టు బయటికెళ్ళి వాళ్ళమధ్య చేరింది. పువ్వుల మాలక్షమ్మ. "ఏం జరిగిందంటే ఎవరూ సరీగా చెప్పరేంటి, గుడిలో దొంగలు పడి ఏమేమి ఎత్తుకెళ్ళారుట?" కొద్దిసేపు ఆగి వాళ్ళ మాటలు అర్ధంకానట్లు మలక్షమ్మ అడిగింది. "గుడిలోపల ఎవరో ఏదో తవ్వుతున్న శబ్దం అయిందిట యింకా ఎవరూ వెళ్ళి చూడలేదు." ఎవరో చెప్పారు. "గుడిలో దొంగలు దూరి తవ్వుకుంటే అర్ధమేమిటి అమ్మవారి విగ్రహాన్ని ఎత్తుకెళ్ళాలనేకదా! ఇంతమందిమి వున్నాము అందరం కలసి వెళితే ఏం చేయగలరు. పదండి పదండి తలో కర్రా తీసుకుని పదండి." పువ్వుల మాలక్ష్మమ్మ పెద్ద గొంతుకతో అరిచేసరికి అక్కడున్న వాళ్ళలో చైతన్యం కలిగింది. చేతి కందింది తలొకటీ తీసుకుని పరుగున గుడిమెట్ల వేపు అరుస్తూ కదిలారు. అంతాకలిసి ఇరవై ముఫ్ఫైమంది కూడా లేరు, వాళ్ళు చాలు దొంగలని బెదరకొట్టటానికి. వీళ్ళ గోలకి మెట్లమీద పడుకున్న బిచ్చగాళ్ళు లేచారు. వాళ్ళలో సగంమంది కుంటి, గుడ్డి రకరకాల అవిటివాళ్ళు హటాత్తుగా నిద్రలేచేసరికి వారికంతా అయోమయం అయింది. ఏదో ఘోరం జరిగిపోయిందనుకున్నారు. వేగంగా మెట్లు ఎక్కలేరు, వేగంగా మెట్లు దిగలేరు. వక్కసారిగా గొల్లుమన్నారు. అందరూ సగంమెట్లు ఎక్కేసరికి మెట్లుదిగి కిందకి పరుగెత్తుకు వస్తూ శివుడు కనిపించాడు. "దొంగలు దొంగలు గుళ్ళో దూరారు." అంటూ పెద్ద గొంతుకలో అరిచాడు శివుడు. "నువ్వు చూశావా?" "ఇంకా లోపల వున్నారా?" "ఎంతమంది వున్నారు." తలోమాట అడుగుతున్నారు. శివుడు ఎంతమందికి సమాధానం ఇస్తాడు? ఎవరిదోవన వాళ్ళు మాట్లాడుకుపోవటం అంతే. ముందు శివుడు ఆ వెనుక జనం అందరూ కలిసి మెట్లుఎక్కి పైకి వెళ్ళారు. అంతా గుడి ముఖద్వారం ముందు ఆగారు, ద్వారం తలుపులు నిక్షేపంగా వేసి ఉన్నాయి. అంతకన్నా క్షేమంగా తాళంవేసి ఉంది. వీళ్ళ గోలతప్ప ఎటువంటి శబ్దాలూ లేవు. గుడిలోపల గాని వెలుపలగాని. "దొంగలు ఏరిరా శివుడూ?" ఎవరో అడిగారు. శివుడు తెల్ల ముఖం వేశాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పువ్వుల మాలక్ష్మమ్మ అందుకుంది "మన గోలకి దొంగలు ఇంకా ఉంటారురా ఎప్పుడో పారిపోయి ఉంటారు." శివుడికి మాలక్ష్మమ్మ మధ్యవున్న లింకు చాలామందికి తెలిసిందే సగంమంది నవ్వేశారు. మాలక్ష్మమ్మ అన్నదానికి శివుడు వేసిన తెల్లముఖానికును. "నీ చేతిలో కర్రేదిరా!" శివుడిని అడిగాడు ఇంకోడు. ఈ తఫా శివుడి బుర్ర వెంటనే పనిచేసింది, "దొంగ అటు పరుగెత్తుతుంటే నేను తెలివిగా వాడికి తగిలేలా కర్ర విసిరేశాను వాడికి దెబ్బ ఎటు తగిలిందోగాని "అమ్మో అన్న కేకకూడా వేశాడు ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు కనిపించేసరికి కిందకి పరిగెత్తుకు వచ్చాను" శివుడు అందమైన అబద్దం ఆడాడు మాలచ్చి లేపితే హడావిడిగా పరుగెత్తుకు వచ్చాను, మాలచ్చి గుడిసెలో మంచం పక్కనే కర్రవుంది అన్న నిజం ఎలాగూ చెప్పలేదు చిన్న బొంకు బొంకాడు. "అసలేం జరిగింది?" శివుడికి మరోప్రశ్న ఎదురయింది. ఏం జరిగిందో శివుడు ఎలా చెపుతాడు! జరిగిందేమిటో వాడికి తెలిస్తే కదా! శివుడిని రక్షించటానికా అన్నట్లు సింహాచలం ముందుకు వచ్చాడు తను గుడిలోపల నుంచి విన్న చప్పుళ్ళు గుడిముందు ఎవరూ లేకపోవటం అప్పుడు తను తెలివిగా కిందకి పరుగెత్తుకురావటం.....కథలా చెప్పేశాడు. జరిగింది ఏమిటో శివుడికి అర్ధమైంది. కథలు రాయటం కొందరికే వస్తుంది కథలు పుట్టించి (సృష్టించి) చెప్పటం అందరికీ వస్తుంది, అప్పటికప్పుడే శివుడు కొత్తకథ పుట్టించి చెప్పాడు. "కూర్చుని కూర్చుని కాళ్ళు నొప్పి పుట్టాయి లేచి అటూ ఇటూ నడుస్తున్నాను, గుడిలోపల నుంచి చప్పుళ్ళు వినపడ్డాయి గోడకి చెవిమొగ్గి విన్నాను, అవే చప్పుళ్ళు అలా టక్ టక్ అని వినపడుతూనే ఉన్నాయి. వేసిన తలుపులు వేసినట్లు ఉన్నాయి, వేసిన తాళం వేసినట్లు ఉంది ఎలా లోపలికి దొంగలు వెళ్ళారు? అని చాలా ఆలోచించి గోడకేమైనా కన్నం తొవ్వారేమోనని చెట్ల మధ్య నుంచి అటు నెమ్మదిగా వెళ్ళాను, ఈ లోపల గుడిమెట్ల మీద ఎవరో పరుగెత్తుతున్న చప్పుడు వినిపించింది "ఏయ్, ఎవరది?" అని అరిచాను ఇటునుంచి ఎవరో పరుగెత్తారు కర్ర విసిరేశాను వెంటనే ఇద్దరు ముగ్గరు పడుతూలేస్తూ అటుకేసి పారిపోయారు చీకట్లో కొండ కిందకి అటునుంచి పరుగెత్తుతూ అంటే వాళ్ళెలాంటి దొంగలో ఆలోచించండి" అంటూ కధ ముగించాడు శివుడు. ఇప్పుడు కాస్త నమ్మకం కలిగింది వింటున్న వాళ్ళకి. "ఇప్పుడు మనం ఏం చేయాలి?" ఎవరో అడిగారు. "ఏం చేసేదేమిటి? గుళ్ళో కెళ్ళి చూడటమే" అవునంటే అవుననుకున్నారు అంతా. "అయ్యవారి దగ్గర తాళంచెవులు ఉంటాయి వెళ్ళి పిలుచుకువస్తాను మీరంతా ఇక్కడే ఉండండి" అంటూ శివుడు కిందకి బయలుదేరాడు. శివుడికోసం పూజారికోసం ఎదురుచూస్తూ ఉండిపోయారు అందరూ. గుడి ఆవరణలో. వెనుకవేపు ఓ మూలగా పెద్ద పూలచెట్టు ఉంది కొన్నాళ్ళ క్రితం వచ్చిన గాలివానకి ఆ చెట్టు గోడమీదకి వరిగింది. గుడిప్రహరీగోడ రాళ్ళ తోకట్టింది కాబట్టి చెట్టువరగడంవల్ల గోడకేమీకాలేదు. చెట్టుకి కొంతఆధారం వుండటంవల్ల కూకటివ్రేళ్ళతో చెట్టుకూలిపోలేదు. గోడమీదకి వరిగిన చెట్టు సజీవంగానే వుంది. పూలుపూస్తూనే వుంది. అందువల్ల దానిని ఎవరూ అక్కడనుంచి తొలగించలేదు. పోలీస్ ఇన్ స్పెక్టర్ వర్ధనరావు ఆచెట్టు వేపే చూస్తూ దీర్ఘాలోచన చేయటం చూసి "సార్!" అన్నాడు టూనాట్ టు అహోబిలం. "ఏమిటి?" ఇన్ స్పెక్టర్ వర్ధనరావు యింకా చెట్టువేపే చూస్తూ అడిగాడు. "ఆ చెట్టు పేరు"...... టునాట్ టు అహోబిలం చెట్టుపేరు చెప్పబోయాడు. ఇన్ స్పెక్టర్ వర్ధనరావు టకీమని యిటు తిరిగి కళ్ళురిమి చూశాడు. సగంలోనే. అహోబిలం నోరు మూతపడిపోయింది. "రోగం కుదిరింది." అనుకున్నారు మరో కానిస్టేబుల్ కనకారావు. ఆ ఏరియాకి ఇన్ స్పెక్టర్ వర్ధనరావు. ఆ చుట్టుప్రక్కల గ్రామాల లో ఏం జరిగినా ఇన్ స్పెక్టర్ వర్ధనరావు చూసుకోవాల్సిందే. గుడిలో దొంగలు దూరారు అన్న విషయం మరీ పెద్దది కాకపోవటంవల్ల ఇన్ స్పెక్టర్ తన మంది మార్భలంతో రావటం జరిగిందిగాని పై అధికారులు కదిలిరాలేదు. క్రితంరాత్రి సింహాచలం విన్న చప్పుళ్ళకి శివుడు కల్పించి చెప్పిన కధకి సాక్ష్యాధారాలు గుడి ప్రాంగణంలో కనిపించాయి. గర్భ గుడిలోకి దొంగలు దూరలేదు, అసలు గుడి లోపలికి పోలేదు గుడికి ఎడమవేపు ఖాళీ స్థలంలో నాలుగడుగులు వెడల్పున త్రవ్వారు. అదసలే కొండప్రదేశం రాళ్ళురప్పలు చదునుచేసి దానిమీద రాళ్ళుపరిచి అతుకుపెట్టారు. అవన్నీ చిన్న చిన్న నాపరాళ్ళు నాపరాళ్ళని తొలగించినా కింద తొవ్వటం కష్టం. అందువల్ల. దొంగలు నాలుగడుగులు వెడల్పున రాళ్ళని తొలగించగలిగారుగాని లోతు ఎక్కువ తొవ్వలేకపోయారు. వాళ్ళు తవ్వింది అంతా కలిపి లోతు అయిదంగుళాలు కూడా ఉండదు. దొంగలు అక్కడ. తొవ్వటానికి ప్రయత్నించటమే కాదు, రెండు గడ్డపలుగులు చిన్నపార పక్కనే పారేసిపోయారు. జనం ఇది చూసి ముక్కుమీద వేళ్ళు (వేలు) వేసుకున్నారు. వాళ్ళలా ఆశ్చర్యపోతూ వేళ్ళు వేసుకోటానికి తగిన కారణం ఉంది. ఎక్కడైనా దొంగలు. విగ్రహాలని దొంగతనం చేస్తారు. గుడిలో దూరి దేముడి నగలు అక్కడవున్న వస్తువులు దొంగలిస్తారు. కాని యిలా! ఖాళీగా కనిపించినచోట అర్దరాత్రి అనవసరంగా తొవ్వేపని పెట్టుకోరు. దొంగలు పనిగట్టుకుని తొవ్వారూ అంటే తెలియని ఏదో పెద్ద కారణం వున్నట్లే. ప్రస్తుతం ఆ కారణమేదో ఇన్ స్పెక్టర్ వర్ధనరావుకి తెలియదు కాబట్టి లోపలికి దొంగలు ఎలా ప్రవేశించారా! అన్న పరిశోధనలోపడి తల మునకలవుతున్నాడు. పరిశోధించి తెలుసుకోండి రిపోర్టు ఎలా తయారుచేస్తాడు! కనుక అనుమానాస్పధంగా తోచిన ప్రతి చిన్నవిషయాన్ని చిన్న వస్తువుని వదలకుండా చూస్తున్నాడు. ఇన్ స్పెక్టర్ వర్ధనరావు ప్రస్తుతం శోధిస్తున్నది పరిశోధిస్తున్నది గోడమీదకి వాలిన ఓ పెద్ద పూలచెట్టుని. రాత్రి రెండు ముఫై ఎనిమిది నిమిషాలకి. శివుడు చెప్పింది విని, పూజారిగారు వక్కరే రాలేదు. ఆయన దూరదృష్టితో ఆలోచించి ఆలయ అధికారి ధర్మకర్త అనబడే ధర్మారావుని కర్ణం రామచంద్రయ్యని మరి ముగ్గురు పెద్దలని వెంటతోడ్కొని గుడికి వచ్చాడు. పెద్దలు పిన్నలు అందరి సమక్షంలో తలుపులు తెరవపడ్డాయి. పోలోమంటూ అందరూ లోపల జొరపడ్డారు. గర్భగుడి తలుపులు వేసే ఉన్నాయి. గుడి ఆవరణలో అక్కడక్కడా వున్న చిల్లరదేముళ్ళు చిట్టిపొట్టి విగ్రహాలు, మండపాలు అన్నీ నిక్షేపంగా ఎక్కడివి అక్కడే బెల్లంకొట్టిన రాళ్ళులా (పడి) ఉన్నాయి. పరమేశ్వరుడు తనకేమి పట్టనట్లు ఆయన ఉన్నాడు. పరమేశ్వరీ అమ్మవారు చిరునవ్వు చిందిస్తూ "పిచ్చివాళ్ళులారా! నా జోలికి ఎవరు వస్తారు?" అన్నట్లు నవ్వుతూ ఉంది. గుడికి ఎడంవేపు స్థలంలో రెండు పలుగులు పార తవ్విన గుర్తులు తప్పించి ఇంకేది కనపడలేదు. అనుమానానికి అది చాలదా? ముందే జాగ్రత్తపడితే ఉత్తరోత్రా మంచిదని పెద్దలు ఆలోచించి పోలీసు స్టేషనుకి వార్త చేరేయటం జరిగింది. అంతే. మందీ మార్భలంతో ఇన్ స్పెక్టర్ వర్ధనరావు వచ్చాడు. పరమేశ్వరీ ఆలయానికి పోలీసులు దర్శనార్ధంగాక నేరపరిశోధనార్ధనం రావటంవల్ల ఊరి పెద్దలు ఎప్పటిలా భక్తులు ఇదేమిటో చూద్దామని మరికొందరు రావటంవల్ల గుడిలో జనం పెరిగిపోయి తిరణాలలాగా తయారయింది అక్కడ. ఇన్ స్పెక్టర్ వర్ధనరావు చాలాకేసులే చూశాడు. తను సర్వీసులో చేరింతరువాత ఇలాంటి కేసుమాత్రం చూడలేదు. ప్రమోషన్లు లేక పల్లె టూరిలాంటి ఊళ్ళే తనకి గతి అయ్యేసరికి తన బ్రతుకు ఇంతేనా అని ఎప్పుడూ చింతించేవాడు. ఇప్పుడు వర్ధనరావుకి ఇది కొత్త కేసు. ఏదైనా పట్టుకోగలిగితే ప్రమోషను ఖాయం. గుడిలో దొంగ(లు) నా కొడుకులు దూరారు. తొవ్వి పారిపోయారు అన్న విషయం తేట తెల్లంగా తెలుస్తూనే ఉంది. కనుక.......! వాళ్ళని పట్టుకుంటే......! ప్రమోషను ఖాయం. ఇన్ స్పెక్టర్ వర్ధనరావుకి కొన్ని అలవాట్లు ఉన్నాయి. ముక్కుతో వాసన పీల్చటం (అందరూ పీల్చేది దాంతోనే) అంటే హూ హూ అంటూ చప్పుడుచేస్తూ గాలి పీల్చటం చేస్తుంటాడు. దేనిమీదైనా అనుమానం కలిగితే కనురెప్పలు అర్పకుండా కళ్ళునెప్పులు పుట్టేదాకా చూడటం దొంగలని దొంగనాకొడుకులనటం వగైరా అలవాట్లు లక్షణాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు వర్ధనరావు చేస్తున్నది అదే. పరిశోధన. కళ్ళార్పకుండా చెట్టునిచూసి ఆలోచించటం కూడా పరిశోధనలో భాగమే. ఇన్ స్పెక్టర్ వర్ధనరావు ఇటు తిరిగి మాట్లాడిందాకా కానిస్టేబుల్స్ తదితర సిబ్బంది మౌనంగా వేచి ఉండాల్సిందే. పెద్దలు చూస్తూ నుంచున్నారు. వాళ్ళకి దూరదూరంగా జనం ఏం జరుగుతుందా అని చూస్తూ నుంచున్నారు. అయిదు నిమిషాల తర్వాత. ఇన్ స్పెక్టర్ వర్ధనరావు టకీమని ఇటు తిరిగాడు. దీర్ఘాలోచన లోంచి బైటపడ్డ వాడిలా ముఖం పెట్టాడు. ఏదో అర్ధమైనట్టు తల పంకించాడు "తెలుసుకున్నాను" వకేవక మాట ముక్తసరిగా అన్నాడు. ఇన్ స్పెక్టర్ గారికి తెలిసిపోయింది. ఏమిటో అర్ధంగాకపోయినా ఆయన తెలుసుకున్నాను అనంగానే అక్కడున్న అందరిలో కలకలం ఏర్పడింది. జనం ముఖం చూసేసరికి ఇన్ స్పెక్టర్ వర్ధనరావుకి ఉషారు వచ్చింది. "దొంగలు గుడిలోకి వచ్చినమాట వాస్తవమే సింహాచలం శివయ్య చప్పుళ్ళు విన్నమాట వాస్తవమే, తలుపులు వేసి ఉన్నాయి తాళం వేసే ఉంది, గోడ పగలగొట్టిగాని గోడకింద కన్నంపెట్టిగాని దొంగలు లోపలికి రాలేదు, మరెలా వచ్చినట్లు? గాలిలోంచి ఊడిపడ్డారా! ఆకాశం నుంచి ఎగిరి వచ్చారా! అదేమీకాదు, వాళ్ళెలా వచ్చారు, ఎలా వెళ్ళారు అన్నది అర్ధమైంది" అంతవరకూ చెప్పి వినేవాళ్ళలో కుతూహలం రేకెత్తించటానికి వక్క క్షణం ఆగాడు ఇన్ స్పెక్టర్ వర్ధనరావు. నిజమే అందరిలో కుతూహలం ఏర్పడింది. వర్ధనరావు విజయగర్వంగా అందరివేపూ చూసి మళ్ళీ చెప్పటం మొదలుపెట్టాడు. "ఈ గుడికున్న ప్రహరీగోడ కవతలివేపు గోడకి నిచ్చన వేసుకుని దొంగనా కొడుకులు గోడ ఎక్కారు. ఈ చెట్టు గోడ మీదకి పడి ఉండటంవల్ల చాలా తేలికగా గోడమీద నుంచి కిందకు దిగారు కనుక ముందు ఈ చెట్టు అర్జెంట్ గా ఇక్కడనుంచి తొలగించాలి. ఎందుకు తొవ్వారు అన్నది తర్వాత చూస్తాము." వర్ధనరావు చెప్పింది విని అందరూ ముఖముఖాలు చూసుకున్నారు. పదినిమిషాలసేపు చెట్టువేపు చూసి ఈయనగారు కనిపెట్టింది యిదా, అన్నట్టు ముఖంపెట్టారు జనం అయితే వాళ్ళలో మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు. ఖాకీదుస్తుల బలం అలాంటిది. చెట్టు పరిశోధన అయింది. అంతకుక్రితమే అంతా చూడటం పూర్తయింది. ఇహ చూసేది ఏమీ కనపడలేదు వర్ధనరావుకి, అటునుంచి యిటు తిరగంగానే ఏదో వాసన రావడంతో 'హోహో' అని శబ్దం చేస్తూ పైకి ముక్కు ఎగబీల్చాడు. ఏమిటీ వాసన! ఎవరిదగ్గరనుంచి! మాట్లాడరేమిటి? అంటూ గద్దించి అడిగాడు. మళ్ళీ అందరూ ముఖ,ముఖాలు చూసుకొన్నారు. 'ఏదైనా కొత్త కంపువస్తే అందరికీ రావాలికదా, అలాంటివేమీ లేదుకదా!' ఎవరికివారే అనుకున్నారు, "ఏమిటీ వాసన ఎవరిదగ్గరనుంచి?" మరోసారి వర్ధనరావు గద్దించి అడగటంతో ఈదఫా ధైర్యం చేసి కరణంగారు అడిగారు. "వాసన అంటున్నారు అదేమిటో మాకర్ధంకాలేదు వివరిస్తే!" "ఇంతకంపు కొడుతుంటే అర్ధంకాలేదా?" "ఉహు?" "ఇక్కడున్న అందరివీ ముక్కులా తాటిపట్టిలా, సెంటుకంపు ముక్కు బద్దలయేలా కొడుతున్నదా లేదా?" మాట పూర్తిచేస్తూనే హూచ్చ్ హూచ్చ్ అంటూ అరడజను తుమ్ములు తుమ్మి 'ఇక్కడికొస్తు సెంటు పూసుకురావటం ఏమిటి?" అని మళ్ళీ తుమ్మాడు వర్ధనరావు.

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published.