ప్రేమించండి ప్లీజ్ 1
telugu kathalu navalalu sahithi ప్రేమించండి ప్లీజ్ 1 "చెల్లీ! ఇది దుర్మార్గపు లోకం
బతుకంటే తీరని శోకం....."
ఆపాట జైలంతా ప్రతి ధ్వనిస్తోంది. ప్రతి ఖైదీ గతాన్ని తట్టి లేపుతోంది.
ఓ ముసలి ఖైదీ ఆపాట పాడుతున్నాడు. బతికున్నందుకే సిగ్గుపడే మనిషి పాట పాడితే ఎలా వుంటుందో ఆ పాట అలా వుంది ఆయన గొంతులోని విరక్తీ, వేదనా రాత్రికి మరింత గాఢత్వాన్ని పులుముతున్నాయి. ఆత్మీయులకు దూరంగా, తమకు తామే భారంగా వున్న ఖైదీలకు ఆపాట వూరట కలిగిస్తోంది. జీవన పోరాటంలో ఓడిపోయిన వాళ్ళను సేద తీరుస్తోంది. ప్రేమతో కన్నీళ్ళను తుడుస్తోంది.
ఆంజనేయులు పదకొండో నెంబర్ సింగిల్ సెల్లో పడుకుని వున్నాడు. అతని కళ్ళు మించవు. కానీ అతనికి వ్యతిరేకంగా కుట్ర జరుపుతున్నట్టు అక్కడక్కడా వెంట్రుకలు తెల్లపడ్డాయి. కండలన్నీ జారిపోయి మొత్తం శరీరంమంతా లూజుగా కొలత తక్కువున్న బస్తాలా వుంది కలలుకని బక్కచిక్కిన కళ్ళు ఆరిపోవడానికి సిద్దంగా వున్న ప్రమిదల్లా వున్నాయి నుదురంతా గీతలు పడడం వల్ల అతనిముఖం కురచగా కనిపిస్తోంది. మాసిపోయిన జైలు యూని ఫారమ్ దుమ్ముతో నేసినట్టుంది.
ముసలి ఖైదీపాట అతనిలో దూరి రక్తాన్ని జిలకొడుతుంది. తన ఒంటరి బ్రతుకునీ, తన దురదృష్టాన్ని పాట ఎత్తి చూపిస్తుంటే గుండెల్లో మంట రక్తప్రసరణకు అడ్డుతగుల్తోంది. అతని కళ్ళు నీటిపొరతో వుబ్బివికారంగా వున్నాయి.
పాటతోపాటు అతని ఆలోచనలు ఆగదిలో సుళ్ళు తిరుగుతున్నాయి.
అయిపోయింది తన బతుకు - రేపు వుదయం వురితీశాక ప్రాణం తన దగ్గర శెలవు తీసుకుంటుంది. రేపు ఆరుగంటలకల్లా ఆంజనేయులు అనే జీవి ప్రపంచం నుంచి నిష్క్రమిస్తాడు ఆ తరువాత తనే మౌతాడు? పునర్జన్మ వుంటుందా? వచ్చే జన్మలో అయినా తను సంపూర్ణం మానవుడిలా పుడతాడా లేక పోతే ఇప్పట్లాగే దరిద్రంతో ప్రేమ కోసం పరితపించి పోతాడా? ఏమౌతాడు తను?
ఉరి తీయకముందు కూడా తను బతికున్నట్టుకాదు. తను ఎప్పుడో చచ్చిపోయాడు. పుడుతూనే అమ్మను మింగేసిన ఈ రాక్షసుడు పురుటివాసనలోనే చచ్చిపోయాడు 'ఆకలేస్తోంది- అన్నం పెట్టు' అని అడిగినప్పుడు దరిద్రుడికి ఆకలెక్కువ' అంటూ పిన్ని కర్కశంగా కొట్టిన క్షణంలోనే నాన్న ముఖం చూసినప్పుడంతా తను చచ్చిపోయాడు. ప్రాణప్రదంగా ప్రేమించిన మంజుల పెద్దన్నయ్య' అన్న సర్టిఫికేట్ ఇచ్చిన రోజునే పూర్ ఫెలో ఆంజనేయులు చచ్చిపోయాడు.
మరిక రేపు జరిగే తతంగం ఏమిటి? జీవచ్చవాన్ని వురితీస్తారు.
అందుకే వురిశిక్ష జడ్జి ముఖం మీదే నవ్వితే - పాపం ఆజడ్జి కంగారుపడ్డాడు.
ఆంజనేయులు అలా ఆలోచిస్తూనే పక్కకు తిరిగి పడుకున్నాడు అప్పటివరకు విషాదం మారిన కన్నీళ్ళు డైల్యూట్ అయి కిందకు జారాయి.
ఒముసలి ఖైదీ! ఆపాట పాడకు. అది చెవులకు సోకుతుంటే ఇంకా బతికున్న భావన కలుగుతుంది. ఇంకా బాధపడే మనసు వుందన్న నిజం తెలిసిపోతుంది. ప్రేమ కోసం గుండె ద్వారాలు తెరుస్తుంది. ఒద్దు ఖైదీ-పాట పాడకు-ప్లీజ్.
పాట ఆగిపోవాలని ఆంజనేయులు ప్రార్ధిస్తున్నాడు.
కానీ పాట ఆగటం లేదు. గుండె తడిలో తడిచివస్తున్న పాట విషాదపు కెరటంలా తగుల్తోంది.
టైమ్ పదకొండు గంటలైనట్టు దూరంగా చర్చిగంటలు విన్పిస్తున్నాయి. రాత్రి మరింత చీకటిని పూనుకుని చిక్కబడింది గాలిని ఖైదీచేసినట్లు వుక్కగా వుంది తక్కువ క్యాండిల్స్ బల్బులు నీరసంగా వెలుగుతున్నాయి. అప్పుడప్పుడు దగ్గరవుతున్న బూట్లచప్పుడు నిశ్శబ్దపు గొంతును తొక్కేస్తున్నట్టుంది.
ప్రేమలాగే, మృత్యువూ అతన్ని వూరిస్తోంది తప్ప ఇంకా బడిలోకి తీసుకోలేదు. కోర్టులో వురిశిక్ష పడ్డప్పట్నుంచీ అతను చావు కోసం క్షణాల్ని లెక్కపెడుతున్నాడు. ఇప్పటికి నిరీక్షణ పూర్తయింది తెల్లవారితే అతనిని వురితీస్తారు. అయినా అతను చలించడంలేదు. బాధ ఎప్పుడూ రిలటివ్ గా వుంటుంది. ఒక సమస్యరాగానే ముందున్న సమస్యను మరిచిపోతాడు. అతని పరిస్థితీ అంతే తనుచచ్చిపోతున్నానన్న బాధకంటే ప్రేమను పొందకనే ఈ లోకం విజడిచిపోతున్నా నన్న విషాదం అతన్ని మెలిపెడుతోంది.
ఆంజనేయులు కళ్ళు మూసుకున్నా మెదడు మాత్రం మరింత యాక్టివ్ అయి ఆలోచనల్ని రంగరిస్తోంది.
తన తప్పుకు, తన నేరానికి వురిశిక్షే కరక్టయిన తీర్పు ప్రేమను ప్రసాదించని ఈ సంఘం పేచీ పెట్టుకుండా మృత్యువునైనా ఇచ్చింది. తను హంతకుడు. ఒక స్నేహితుడ్ని ధారుణంగా చంపేశాడు. ఏ విరోధం లేకపోయినా, తనకు ఏవిధంగానూ అపకారం చేయకపోయినా అతన్ని డాబామీద నుంచి తోశాడు. ఇరవై అడుగులు ఎత్తునుంచి కిందపడిన అతని తల చిట్లింది నిండా ముఫ్ఫై ఏళ్ళు కూడా లేని ఓయువకుడ్ని బ్రూటల్ గా చంపేశాడు.
ఎందుకు తను ఆసమయంలో అంత దారుణంగా ప్రవర్తించాడు ఎదుటి వ్యక్తి దగ్గర ముడుచుకుపోయి ప్రవర్తించే తను హత్య చేశాడంటే తనకే నమ్మకం కలగడంలేదు జీవితంలో పశ్చాత్తాపం పడే అంతటి విషాదం మరొకటి లేదు కానీ తను మాత్రం నెలరోజుల్నుంచీ కుంగిపోతున్నాడు చీమను చూసి పక్కకు తొలగిపోబోయే తను సాటి మనిషిని హత్య చేశాడు. ఎందువల్ల.....?
"రేయ్! ఇంకా నిద్రపోలేదా? మరో ఆరుగంటలకు వురితీస్తానని తెలిసిన మనిషి ఎలా నిద్రపోగలడు నావెర్రిగానీ కనీసం లైట్ ఆర్పెయ్." సెంట్రీ అరవడంతో ఉలిక్కిపడ్డట్లు లేచాడు ఆంజనేయులు.
గది ముందు ఖైదీ పాట ఎప్పుడు ఆగిపోయిన్ద్జో తెలియదుగానీ జైలంతా తనలో తానే ముడుచుకు పోయినట్టు నిశ్శబ్దంగా వుంది.
అతను చేతులతో తుడుచుకుంటూ సిమెంట్ దిమ్మవరకు వెళ్ళాడు కంటాన్ని తలగడలా పెట్టుకుని పడుకున్నాడు.
మళ్ళీ ఆలోచనలు అతన్ని పీక్కుతింటున్నాయి.
తను హంతకుడిగా మారతాడని ఎప్పుడైనా అనుకున్నాడా తను.
చంపేసే వరకు గుండెల్లో అంత దానవత్వం వుంటుందని వూహించలేదు. పబ్లిక్కుగా ఓ ఆడపిల్ల సాక్షిగా తను హత్య చేశాడు.
కోర్టులో ఆమె సాక్ష్యం చెబుతూ తనను చూసినచూపు చేసిన గాయం మారలేదు. ఇక ఎప్పటికీ మానదు కూడా. ఓ ఆడపిల్ల నుంచి తను కోరుకున్నది అదా?
స్త్రీ ప్రేమకోసం తపించిపోయాడు తను కానీ ఏఆడపిల్లా తను దగ్గరికి రానివ్వలేదు. సన్నగా, పొట్టిగా నల్లగా వున్న ఈ పేదవాడ్ని ఎవరు ప్రేమిస్తారు! అందుకే ఓ ఆడపిల్ల తనను అవమానించింది. మరో యువతి చీదరించుకుంది. ఇంకో స్త్రీ తను అసహ్యించుకుంది.
ఏప్రత్యేకతా లేని తను ప్రేమకు అనర్హడన్న విషయం చాలా ఆలస్యంగా బోధపడింది. అప్పటికి పరిస్థితి చేయిదాటిపోయింది. తను దోషిగా కటకటాల వెనక్కినెట్టి వేయబడ్డాడు.
ప్రేమకోసం శరీరాన్నంతా గుండెగా చేసుకుని ఎదురు చూసిన తను ద్వేషంతో హత్యచేశాడు. ఈర్ష్యలోంచి పుట్టిన ద్వేషం ఎంత భయంకరంగా వుంటుందో తను అనుభవించాడు.
తనకు అపూర్వమైంది, అందనిది మరోవ్యక్తి చేతుల్లో ఒడిగి పోతుంటే తను భరించలేక తను అనుభవించాడు.
వినయ్ చెప్పింది నిజమేనా? ఆలోచిస్తుంటే వినయ్ కరెక్టుగానే విశ్లేషించాడనే అనిపిస్తోంది.
సంఘంలో ప్రతి మనిషీ తనను గుర్తించాలని అనుకుంటాడు. ఆ గుర్తింపుకోసం ఎంతో శ్రమిస్తారు. కొందరు పొందగలుగుతారు. ఇంకొందరు దెబ్బతింటారు దీంతో ఐడెంటిటీ క్రైసిస్ మొదలవుతుంది. చాలా డిస్పరేట్ గా ఫీలవుతుంటారు. సంఘం తనను చిన్న చూపు శూస్తోందని గ్రహించారు. సంఘంలో తమకు పరపతి లేకపోగా చులకనగా చూస్తున్నారని తెలుస్తూంది. తమకు వ్యతిరేకంగా జరుగుతున్న దుష్ప్రచారాన అడ్డుకునేందుకు మనిషి అడ్డదార్లు తొక్కడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో ఎన్నో అసహజమైన గుణాల్ని అలవరచుకుంటాడు.
అందుకే దురలవాట్లన్నీ మొదట్లో ఫ్యాషన్ గా మొదలవుతాయి. కొందరు అబద్దాలు చెబుతూ తమకు లేని ప్రతిష్ఠతను పొందాలని తాపత్రయపడుతుంటారు. డాక్టర్ పామిర్ అనే శాస్త్రజ్ఞుడు మనిషిలో విపరీతమైన మనస్తత్వాలు ఎలా ఏర్పడుతాయో ఆవిధంగా వివరించాడు. వినయ్ తన కివన్నీ చెప్పాడు.
పామిర్ విశ్లేషణ నిజమే తను అంతే చిన్నప్పట్నుంచీ తనను నలుగురూ గుర్తించాలనీ- ప్రేమించాలనీ అనుకున్నాడు. కానీ పురిట్లోనే అమ్మ చచ్చిపోయింది. పిన్ని పెంపకంలో పెరిగాడు. దరిద్ర నీడలో వున్నప్పుడు ప్రేమ కూడా పాము పడగలా అనిపిస్తుంది. అందుకే తన కుటుంబంలో అందరూ ప్రేమరాహిత్యంతో బాధపడేవారు.
సంఘంలో తను ఎందుకూ కొరగాడన్న సత్యాన్ని రూపుమాపేందుకు తను ఎన్నో వ్యర్ధ ప్రయత్నాలు చేశాడు. తన నూన్యతాభావాన్ని అధిగమించేందుకు తన దగ్గర ఏమీలేదు మంచి పర్సనాలిటీ లేదు. వాక్ చాతుర్యం లేదు. డబ్బు లేదు. జనాన్ని బురిడీలు కొట్టించే తెలివి తేటలు లేవు.
అందుకే తను మందు తాగటం ప్రారంభించాడు. చివరికి హత్య చేశాడు.
ప్రేమకోసం పరితపించిన ఓ పేదవాడి బ్రతుకు జైలుపాలయ్యింది. ఆత్మీయత కోసం పరితపించిన ఓ వెర్రివాడు చీకటి గదిలో కుంగిపోతున్నాడు.
ఆంజనేయులు తల కిందనున్న కంచం పట్టుతప్పి కిందపడి శబ్దం చేసింది. అతని ఆలోచనలకు ఫుల్ స్టాప్ పడింది.
అంతంలో సెంట్రీ పరుగున అక్కడికి వచ్చాడు.
"ఏమైంది? బాయ్ నెట్ తో కుమ్ముతున్నట్టు కఠినంగా అడిగాడు.
"ఏమీ లేదు కంచం కింద పడింది." ఆంజనేయులు ద్వారం దగ్గరికి వచ్చి చెప్పాడు.
"అంతేనా!" అనుమానం తీరకపోవడంతో సెంట్రీ లోపలికి టార్చ్ లైట్ వేసి చూశాడు. ఏమీ కనిపించలేదు.
"సరే వెళ్ళి పడుకో".
సెంట్రీ వెళ్ళిపోయాడు.
తిరిగి ఆంజనేయులు దిమ్మపై పడుకున్నాడు.
"ఆవర్షం రోజున ఏమైంది తనకు? ఎలా హత్య చేశాడు? తనను తనే గట్టిగా ప్రశ్నించుకున్నాడు.
గతమంతా ఫోటోలుగా కళ్ళనీళ్ళలో తేలుతున్నాయి.
ఆంజనేయులు నడుస్తున్నాడు.
అదెప్పుడో తారురోడ్డు. ఇప్పుడు కంకర రోడ్డు. గత వైభవానికి చిహ్నంగా అక్కడక్కడా వున్న తారు ఎండకు బద్దకంగా కరుగుతోంది. దూరంగా నుంచి చూస్తే ప్రవహించడానికి మరచిపోయి- నిశ్చలంగానిలబడిపోయిన నెత్తుటి నదిలా వుంది. మధ్యమధ్యలో పైకి లేచి పోయిన నల్లటి కాశిరాళ్ళు తేలుతున్నగుండె ముక్కల్లా వున్నాయి.
అయితే ఇవేమీ గమనించటం ఓ అమ్మాయి నడుస్తోంది. ఆమె వయసుకు ఒకటి కలిపితే ఇరవయ్యో, ఇరవయొక్కటో కావచ్చు ఒకటి తీసేస్తే పద్దెనిమిదో, పదిహేడో కావచ్చు. మొత్తం మీద ఆమె మంచి పరువంలో వుంది అందంగానూ వుంది. ఇంకాసేపు అలానే నడిస్తే కరిగిపోయే మంచు బొమ్మలా వుంది. నందివర్ధనం రెమ్మలానూ వుంది.
వాళ్ళది పాపానాయుడు పేట అతను రేణిగుంటలో ఓ పెద్ద ప్రభుత్వాఫీసులో చిన్న క్లర్క్. వాళ్ళిద్దరూ తిరుపతికి వెళుతూ రేణిగుంటలో దిగారు.
ఇద్దరూ బస్టాండ్ చేరుకున్నారు.
"సంధ్యా! కూల్ డ్రింక్ తాగుతావా?" అని అడిగాడు ఆంజనేయులు వద్దన్నట్టు ఆమె తల తిప్పింది అడ్డంగా.
అంత అందమైన ఆడపిల్ల పక్కన నిలబడి వుండడం అతని జీవితంలో అదే మొదటిసారి అందుకే అతని మానసిక స్థితి చాలా డిఫరెంట్ గా వుంది ఏదో ఉద్వేగం అతన్ని ముంచెత్తుతోంది. తెలియని టెన్షన్ రక్తాన్ని జిలకొడుతోంది.
జీవితంలో తొలిసారి అతను సెక్యూర్ గా ఫీలవుతున్నాడు. ఇంత కాలం తను అందరికంటే తక్కువ వాడన్న న్యూనతాభావం కరిగిపోతోంది. తనూ అందరి లాంటి యువకుడేనన్న భావన శరీరంలో మెత్తగా ప్రవహిస్తోంది. తను ఏదైనా సాధించగలడన్న భరోసా ఛాతీని పొంగిస్తోంది ఏదో తెలియని గర్వం అతని ధ్యేయం అలవాటు.
"హలో ఆంజనేయులు."
పలికించినవాడు స్కూటర్ మెకానిక్. మేనేజరు స్కూటర్ ను బాగుచేస్తుంటాడు.
"హలో!" చాలా నెమ్మదిగా పలకరించాడు ఆంజనేయులు.
"బావున్నా?" అంటూ జవాబు కోసం చూడకుండా మెకానిక్ వెళ్ళిపోయాడు.
మెకానిక్ తమ పక్కన ఓఅమ్మాయి వుండడాన్ని గమనించాడా అతని ముఖకవళికల్ని గమనించినట్టు లేదు.
ఇంత ప్రయాసపడి సంధ్యను ఇక్కడ దించడం నిష్ప్రయోజనం అయిపోతుందా! స్వామీ! వెంకటేశ్వర్లు తాలూకా! తెలిసిన ఒక వ్యక్తి ఇలా వచ్చేట్టు చేయి స్వామీ! వచ్చి నాపక్కనా ఓ అమ్మాయి వుందని గమనించేటట్టు చేయి స్వామీ! ఇంకెప్పుడూ ఏమీ కోరను తండ్రీ...
ఆంజనేయులు ముక్కుకుంటూనే వున్నాడు.
దేవుడు ఆంజనేయులు ప్రార్ధన మన్నించలేదు. ఎవరూ తెలిసిన వాళ్ళు రాలేదు.
ఆంజనేయులు కళ్ళు అటూ ఇటూ వెదుకుతున్నాయి.
దూరంగా మిఠాయి అంగడి దగ్గరున్న గురునాధం కనిపించాడు. ఒక్కసారిగా ఉత్సాహం తన్ను కొచ్చింది. పిలుద్దామనుకున్నాడు. కానీ నోరు పెగలలేదు గురునాధాన్ని ఇప్పుడు పిలిస్తే ఇవ్వవలసిన అప్పు అడుగుతాడు. అతను ఆఫీసులో మేనేజర్ వడ్డీకి అప్పులిస్తుంటాడు. ఆ అప్పు అడుగుతాడనే భయం నోరు నొక్కేసింది.
లేకుంటే ఈ పాటికి ఏదో మిష మీద గురునాధాన్ని పిలిచి తన పక్కనా ఓ అమ్మాయి వుందని చూపించేవాడు. రేపు ఉదయానికల్లా ఈ విషయం ఆఫీసులో తెలిసిపోయేది. ఇక దానిపై ఎన్ని కామెంట్లు వచ్చేవో వూహించాడు ఆంజనేయులు.
"కంగ్రాజు లేషన్స్ ఆంజనేయులుగారూ! ఎవరో ఓ అమ్మాయిని పట్టేశారట కదా. బ్రహ్మాండంగా వుందని చెప్పాడు. గురునాధం మీకేమి టండీ బాబూ! ఓ ఆడతోడుంది బాధలూ సుఖాలూ పంచుకోవడానికి."
"ఇంతకీ ఎవరండీ కాస్త చెబుదురూ....."
ఇలా అందరూ తను చుట్టుముట్టేస్తారు. ప్రశంశలతో అభినందనలతో ముంచేస్తారు. తనతో పని చేస్తారు. తను గర్వంగా చిరుమందహాసంతో గ్రీట్ చేస్తాడు. తన కొలీగ్స్ వైపు హుందాగా నడుచుకుంటూ వెళతాడువాళ ప్రశ్నలకు జవాబు చెప్పకుండా గంభీరంగా నవ్వుతాడు.
ఇంతకాలంగా ఓ ప్రత్యేకత వస్తుంది తనకు అందరూ తనను గౌరవంగా చూస్తారు. అభిమానంతో పలుకరిస్తారు. తననూ ఓ మనిషిగా గుర్తిస్తారు.
కానీ ఇపుడా అవకాశం లేదు. గురునాధం ఇటురాడు. తను పిలవలేదు. రెండు వందల రూపాయలు అర్ధాక్షిణ్యంగా తన ఆనందాన్ని లాక్కుంది. ఛీఛీ....వెధవ డబ్బు అని ఆంజనేయులు అసహ్యించుకున్నాడు.
"పనేదోవుందని అన్నావుగా వెళ్ళిచూసుకురా తిరుపతి వెళదాం. లేటయిందంటే బస్సులు దొరకవు. సంధ్య అతని పక్కకి మరింతగా జరిగి చెప్పింది.
ఆంజనేయులు తలతిప్పి చూశాడు. తన కన్నా రెండు అంగుళాల ఎక్కువ పొడవు వుంది సంధ్య. తనకంటే లావుగా వుంది. అంత దగ్గరగా వుంటే తనను ఆమె తమ్ముడుగా అనుకునే ప్రమాదం వుందని వెంటనే స్ఫురించింది అతనికి.
అందుకే షాక్ తగిలినట్లు కొద్దిగా జరిగి "వెళ్ళిపోదాం సంధ్యా!" అన్నాడు తడబడుతూ.
ఆమె తలతిప్పి ఎటో చూస్తోంది. ఆంజనేయులు తన శరీరం వంక చూసుకున్నాడు.
ఒక్కగా- పొట్టిగా వున్న తనను చూసుకొని తనే అసహ్యించుకున్నాడు. తన కొలీగ్ వినయ్ అన్నమాటలు గుర్తొచ్చాయి అతనికి.
"అసలు మీ ఫజిక్కే అప్పీలింగ్ గా వుందండీ ఆంజనేయులుగారూ అందుకే మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరు. పై పెచ్చు ఏదో చిన ఆచూపుతో మాట్లాడతారు, ఇక ఆడ పిల్లలు మీ వైపు కన్నెత్తికూడా చూడరు దీన్ని అధిగమించి మీరు ఆడపిల్లల సాన్నిహిత్యం. సంపాదించాలంటే మరేదో ప్రత్యేకతను సాధించు కోవాలి. పెద్ద స్పోర్ట్స్ మనో, ఆర్టిస్టోకవో అయిపోవాలి. లేదూ ఆడపిల్లలతో అద్భుతంగా మాట్లాడే చాకచక్యం అయినా నేర్చుకోవాలి."
వినయ్.....వినయ్.....వినయ్.....
అతను చక్కగా వుంటాడు పొడవుగా, ఎర్రగా, బలిష్టంగా వుంటాడు. ఎప్పుడూ హాయిగా, సరదాగా కనిపిస్తాడు.
జీతంకాక మరో మూడు నాలుగువేలు ఖర్చుపెట్టుకోగల అతని స్తోమత ఆక్వలిటీస్ ని అతని కిచ్చాయా?
ఆంజనేయులకు అది నిజమనిపించింది డబ్బు తెచ్చి పెట్టిన ఛార్మ్, జీవితంపట్ల ఎనలేని మమకారం, కళ్ళల్లో తొంగిచూసే అల్లరి ఇవేమీ తనకు లేవు తనకు జీవితమంటే భయం.
వారానికోమారు పెద్ద చెల్లెలు మీద వాలే మోహినీ పిశాచంటే భయం. ఎప్పుడూ సిగ్గుతో, ఏ బట్టలమూట మాటునో, ఏ బట్టలచాటునో గువ్వలా ఒదుక్కునే చిన్న చెల్లెలంటే భయం. ఎప్పుడూ గొప్పలు చెప్పుకుంటూ లేని స్టేటస్ ను ఉన్నట్టు చెప్పుకునే పెద్ద తమ్ముడంటే భయం, చిరంజీవి మీద అభిమానంతో ఎప్పుడూ ఆ ధ్యాసలోనే గడిపే చిన్న తమ్ముడంటే భయం. చావు కోసం సంతోషంగా ఎదురుచూస్తున్న పిన్ని అంటే మరీ భయం. చావు ఆశ చచ్చి పోయినట్లు నులకమంచం మీద అతుక్కుపోయిన నాన్న అంటే చచ్చేంత భయం.
ఇన్ని భయాలమధ్య బతుకుతున్న కూడా తనకు చాలా భయం. "భయం, వినయం దారిద్ర్య లక్షణాలు- దరిద్ర దేవతకి అవి రెండూ కవలపిల్లలు. డబ్బు ల్లేకుంటే దుర్లక్షణాలు మనకు అంటుకుంటాయి డబ్బుంటే అవన్నీ అంటే అవన్నీ మనల్నీ అంటుకోవు."
వినయ్ ఎప్పుడో ఈ విషయాలన్నింటినీ విశ్లేషించి చెప్పాడు.
"మనిషికి అతి ముఖ్యమైనది ఆత్మ విశ్వాసం. అది డబ్బుఇస్తుంది. ఆత్మవిశ్వాసం లేనప్పుడు బతుకులోని రుచిని పోగొట్టుకుంటాం.
వినయ్ కి ప్రతి విషయంమీదా అంత అవగాహన వుంది. కానీ తనకంత విషయ పరిజ్ఞానం లేదు అంత విశ్లేషణాశక్తి లేదు. తనంటే ఏమిటో తెలుసుకోవడానికి భయపడే తనలాంటివాడు ప్రపంచాన్ని ఏం విశ్లేషించగలుగుతాడు!
"అసలు మీరు ఇంగ్లీషులో ఫ్లూయంట్ గా మాట్లాడటం అయినా నేర్చుకోండి. ఇంగ్లీషు గ్లామరున్న ఏ ఆడపిల్లో మిమ్మల్ని ప్రేమిస్తుంది. ఎంచక్కా ఆమెను పెళ్ళిచేసుకుని కోపం వచ్చినప్పుడు ఇంగ్లీషులో తిట్టొచ్చు. ఆమె కర్ధంగాదుకనుక మీ సంసారం బ్రేక్ అయ్యే అవకాశం ఎప్పటికీ వుండదు."
వినయ్ ఎప్పుడూ అలానే మాట్లాడతాడు.
అలాంటప్పుడు తను ఎలా ఫీలవుతాడో గుర్తించింది ఆంజనేయులుకు.
సిగ్గుతో తల కిందకు వాలిపోతుంది. తన పేదరికానికి ఏడు పోస్తుంది. తన ఆకారం మీద తనకే అసహ్యమేస్తుంది. రోషమొస్తుంది. తన దురదృష్టానికీ బాధేస్తుంది.
సంధ్య తన పక్కన వుండడాన్ని వినయ్ చూస్తే బావుండునని పించింది ఆంజనేయులుకు. వినయ్ కళ్ళల్లో తన పట్ల ఈర్ష్య లాంటిది కలిగితే చూడాలనిపించింది అతనికి.
కానీ వినయ్ ఇటురాడు. వచ్చిన తన ఈ ఆనందోత్సాహాన్ని చూడడు. తన బతుకెప్పుడూ ఇంతే.
ఇలాంటి ఛాన్స్ మళ్ళీ ఎప్పుడూ రాదు. అందుకే ఇంకొంచెం సేపు వెయిట్ చేయాలి. ఎరావైనా ఒక్కరు చూస్తేచాలు. ఈజీవితం ధన్యమైపోతుంది.
తన ముఫ్ఫై ఏళ్ల చరిత్రలో ఇలాంటి అనుభవం ఎప్పుడూ కలగలేదు. తనతోపాటు ఏ ఆడపిల్లా సినిమాకు రాలేదు. ఏలేడీ విజిటరూ తనను వెదుక్కుంటూ ఆఫీసుకు రాలేదు. ఏ జీవీ తానున్నానంటూ ఫోన్ చేయలేదు. ఏ మగువా తనకింతవరకు ప్రేమలేఖ రాయలేదు.
అయితే తన కొలీగ్ వినయ్ కి ఎన్ని ఫోన్ కాల్స్ ..... ఎంతమంది లేడీ విజిటర్స్!!..... ఎన్ని ప్రేమలేఖలు!!!
తనకెప్పుడైనా ఉత్తరం వచ్చిందా? రాలేదు. తమ సెక్షన్ లో వుంచిన లెటర్ బాక్స్ లో తన పేరుమీదున్న ఉత్తరం ఇప్పటివరకూ చూడలేదు. డ్యూటీకి రాగానే అందరూ తమ ఉత్తరాలకోసం ఆ బాక్స్ దగ్గరకు వెళతారు. తమకు వచ్చిన ఉత్తరాలను కలెక్ట్ చేసుకుంటారు. కానీతను వెళ్ళడు. అక్కడ తనకోసం ఉత్తరం ఉండదనితెలుసు. అందువల్లే ఆలెటర్ బాక్స్ కూడా ఎంతో పరాయిదిగా కనిపిస్తుంది.
ఎప్పుడైనా ఒకప్పుడు తను ముందుగా ఆఫీసుకెళితే తన కొలీగ్స్ అప్పటికి రాకపోతే లెటర్ బాక్స్ దగ్గరికి వెళతాడు. చేయిపెట్టి కెలుకుతాడు. తన పేరుమీదున్న ఉత్తరం ఒక్కటీ వుండదు. ఎంతో నీరసంగా వెనుతిరుగుతాడు.
'లెటర్స్ ఏమీ లేవా సార్? అయినా మీకెవరు రాస్తారు లెండు గుర్నాధం ఎక్కడినుంచి గమనిస్తాడో ఏమో ఎదురుపడి ఠక్కున అంటాడు.
తను అప్పుడు జీవంలేని నవ్వు నవ్వుతాడు. తన ముఖం లాగే ఆనవ్వూ తెల్లగా పాలిపోయి వుంటుంది.
"ఎప్పుడైనా ఓ రోజు లెటర్ రాకపోతే ఏదో వెలితిగా వుంటుంది. మనకు ఉత్తరాలు లేని ఈ లెటర్ బాక్స్ చూస్తేనే జీవితంమీద సగం ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది" అంటాడు వినయ్.
ఎప్పుడో ఒకరోజు లెటర్ రాకపోతే వినయ్ లాంటివాడే గిలగిల్లాడిపోతాడు. మరి తనలాంటివాడు ఎంత-? ఆప్ట్రాల్.
"టైమ్ ఎంతైంది?" సంధ్య అడిగేసరికి ఉలిక్కిపడ్డాడు ఆంజనేయులు. అటూ ఇటూ చూశాడు. వాచ్ కట్టుకున్న వ్యక్తిలేడు.
"ఒంటిగంట దాటిందనుకుంటా" నసిగాడు.
ఆమె కూడాపాదం బొటన వేలుతో కిందగీస్తూ వుండిపోయింది.
గడియారం కొనుక్కునే స్థోమత కూడాలేని తనంటే ఓరకమైన కసి కలిగింది ఆంజనేయులుకు. ఎప్పటినుంచో ఓ వాచ్ కొనుక్కోవాలనుకుంటున్నాడు. కానీ కుదరడంలేదు. ఏ నెలకానెల వాయిదా వేస్తున్నాడు. వాచ్ కొనాలన్నా ఈ ఆశకు దాదాపు పదిహేను సంవత్సరాలుంటాయి.
ఆంజనేయులు తన ఎడమచేతి మణికట్టును చూసుకున్నాడు. అక్కడ గుండ్రంగా కాల్చిన గుర్తు అచ్చుగడియారం ముద్రలా వుంది చిన్నప్పుడు తనకు పచ్చరికలు వస్తే ఓ నాటు వైద్యుడి దగ్గర నాన్న కాల్పించాడు. అది అలానే వుండిపోయింది. చిన్నప్పుడంతా తనను అందరూ "గడియారం వోడా" అని పిలిచేవాళ్ళు. చేతికి అలా కాల్చుకోవడంవల్ల ఆ నిక్ నేమ్ వచ్చింది. అదేకాదు తనకు చాలా నిక్ నేమ్ లుండేవి. "బక్కోడా.....గజ్జోడా.....గడియారం వోడా..... కళ్ళపిసోడా...." ఇలా సీజన్ చొప్పున తనకు పెట్టుడు పేర్లుండేవి. ఆ పేర్లతోనే పిలవడం వల్ల తన అసలు పేరేమిటో చాలా రోజుల వరకు తెలిసిరాలేదు.
పెద్దయ్యాక ఇలాంటి నిక్ నేమ్స్ తప్పినా అంతకుమించిన ఆదరణ ఎప్పుడూ లభించలేదు. తనకెలాంటి స్పెషల్ అట్రాక్షన్ లేకపోవడం వల్లే ఎవరూ పట్టించుకోరేమో. తన కొలిగ్స్ వినయ్, రాహుల్, జీవన్ అభినయ్ లకు చాలా క్వాలిటీస్ వున్నాయి. అభినయ్ బాగా డబ్బున్న ఫ్యామిలీనుంచి వచ్చాడు. డబ్బు తెచ్చిన కాన్ఫిడెన్స్ అతని ప్రతి కదలికలోనూ కనిపిస్తుంటుంది. తనలాగా అర్ధంపర్ధంలేని కాంప్లెక్సులు లేవు. ఆఫీస్ కొస్తూనే అందరికీ కాఫీలు ఇప్పిస్తాడు. సిగరెట్లు పంచుతాడు. అందుకే అతను రాగానే అందరూ అతనికి ఎంతో అభిమానంతో విష్ చేస్తారు.
ఇక జీవన్ క్రికెట్ ప్లేయర్. ఎప్పుడూ హుందాగా, తెల్లటి బట్టల్లో మల్లెపూవులా కనిపిస్తాడు.
వినయ్ విషయం చెప్పక్కర్లేదు. అతని చొరవ మనుషులను మరింత దగ్గరికి చేరుస్తుంది. ఎవరినైనా ఇట్టే ఆకర్షించగలడు.
తనకైతే కొత్తవాళ్ళు అనిపిస్తే చాలు నాలుక పిడచకట్టుకుపోతుంది. మాతృభాషనే మరిచిపోతుంటాడు. బాగా పరిచయమున్న వాళ్ళతో అయితే కొంత బెటర్ అయిదు నిముషాలకైనా ఓ మాట మాట్లాడగలడు.
ఆంజనేయులకు వాళ్ళతోపాటు తన ఆఫీసులోనే పనిచేసే మహాలింగం గుర్తొచ్చాడు. అతనూ తనలాగే ముతగ్గా, పేదగా వుంటాడు. అయితే తనలాగా న్యూనతా భావంతో గింజుకుపోడు. అందరిమీదా దుమ్మెత్తి పోస్తుంటాడు. తనకు నచ్చిన రీతిలో చాలా పరుషంగా వాళ్ళను అటాక్ చేస్తుంటాడు.
"వాళ్ళకేమండీ పెట్టిపుట్టినోళ్ళు. ఈ వినయ్, అభినయ్..... వీళ్ళున్నారు చూశారూ! మిగిలినవాళ్ళ బతుకులను కూడా వాళ్ళ బతుకుల్లో కలిపేసుకుని జల్సా చేస్తున్నారండీ. వాళ్ళు ఎక్కితిరిగే స్కూటర్లు వాళ్ళవికావు- వాళ్ళు చూసే వీడియోలు వాళ్ళవికావు - వాళ్ళు వుండే ఏసీ గదులు వాళ్ళవికావు కడకు వాళ్ళు మాట్లాడే ఆ నాలుగు ఇంగ్లీషు ముక్కలూ వాళ్ళవికావు. మనలాంటి సవాలక్షమంది చదువు మానేస్తే వాళ్ళు చదువుకోగలిగారు. మనం ఇలా పేదవాళ్ళుగా వున్నాం కనుకే వాళ్ళు అలా డబ్బున్నవాళ్ళుగా తయారయ్యారు మన సుఖసంతోషాలను వాళ్ళు లాక్కుని, వాళ్ళ దుఃఖాలు మనకు ఇచ్చేశారండీ- బాస్టర్స్...."
మహాలింగం ఇలా భావావేశాలను ఎప్పటికప్పుడు వ్యక్తం చేస్తుంటాడు. కనుకనే తనలా కుంగిపోడు.
తన కొలీగ్స్ పేర్లే ఎంతో రొమాంటిక్ గా వుంటాయి. రాహుల్, వినయ్, జీవన్. ఎంత అందమైన పేర్లు. తన పేరులో ఎంతో పాతదనం వుంది నడవని తల్లిదండ్రులు పెట్టిన పేరు. తనది ఫరవాలేదు మహాలింగంది మరీ ఘోరం ఏదో వికారం ఆ పేరులో.