శుభోదయం 1

By | August 6, 2022
telugu kathalu navalalu sahithi శుభోదయం 1 శ్యామ్ అద్దం ముందు నిలబడి తల దువ్వుకుంటూ తన రంగు చూసి తనే నిట్టూర్చాడు. భగవంతుడు తననింత నల్లగా అనాకారిగా ఎందుకు పుట్టించాడో! రోజుకి కనీసం ఒకసారన్నా ఆ మాట అనుకునే శ్యామ్ ఆరోజు పదిసార్లు ఆ మాట అనుకున్నాడు. ఈ రంగే ......ఈ రంగే తనకి శత్రువయింది. లేకపోతే ..... రేఖ ....నిట్టూర్చి తల దువ్వుకోసాగాడు. వెనక నించి తల్లి వచ్చిన నీడ అద్దంలో కన్పించింది. "శ్యాం ! టిఫినుకి రా రా, యింకా ముస్తాబవలేదా? ఏనాడనగా స్నానం చేశావు? దోసెలు చాల్లారిపోతున్నాయి " అంది. "వస్తున్నానమ్మా" వెనక్కి తిరిగిన కొడుకు మొహం అదోలా వుండడం చూసి, "శ్యామ్ అలా వున్నావేం, ఏం జరిగింది? వంట్లో బాగులేదా" అంది ఆదుర్దాగా. "ఏం లేదమ్మా పద వస్తున్నాను." షర్టు టక్ చేసుకుంటూ ఆమె వెనక డైనింగ్ రూములోకి నడిచాడు. "ఊహూ ....ఏదో ఉంది. ఏం జరిగిందో చెప్పాలి" కొడుకు అన్యమనస్కంగా తింటున్న తీరు చూడగానే రాధాదేవికి అర్ధం అయి అడిగింది. శ్యామ్ కాసేపు మౌనంగా ఉండి , కళ్ళెత్తి తల్లివంక చూస్తూ "అమ్మా! నేనింత నల్లగా ఎందుకు పుట్టనమ్మా? నీవంత తెల్లగా వుంటావు. నాకీ రంగు ఎలా వచ్చిందమ్మా...." కొడుకు గంబీరంగా అడిగిన తీరు చూడగానే రాధాదేవికి నవ్వు వచ్చింది. "ఒరేయ్! ఎన్నిసార్లు అడిగావురా యిప్పటికి ఆ మాట. నీకీ రంగు పిచ్చేమిట్రా..... బాహ్య సొందర్యం కాదు శ్యామ్ కావలసింది. ఆత్మ సౌందర్యం కావాలిరా నాన్నా! అది నీకుంది అని నాకు తెలుసు. లేని రంగుకోసం నీకెందుకురా ఆ బాధ...... యింతకీ నీవేమన్నా ఆడపిల్లవా అందంగా లేకపోతే దిగులు పడడానికి ఏం, మళ్ళీ ఎవరన్నా నిన్ను హాస్యం ఆడారా కాలేజీలో ...." రాదాదేవి కొడుకు మనసులో బాధ గుర్తించకుండా ఎప్పుడు అడిగే పప్రశ్నే అని తేలిగ్గా జవాబు చెప్పింది. హాస్యం! హు .....! హాస్యం అయితే తను స్పోర్టివ్ గా తీసుకోగలదు. అపహాస్యం! హేళన అవమానం. రేఖ ......ఏ రేఖనయితే తను ఆరాధిస్తాడో , ఏరేఖనయితే హృదయంలో ప్రతిష్టించుకున్నాడో ఆ రేఖ ఎంత చులకనగా యెంత హేళనగా మాట్లాడింది! తన అనాకారితనాన్ని నల్గురిలో ఎంతలా యిసడించి మాట్లాడింది. "వసేయ్ నీరూ , ఈ జీడిగింజ ఏమిటే మనవెంట యిలా జీడిపప్పు పాకంలా తగులుకున్నాడు ." అమ్మాయిలంతా కిసుక్కున నవ్వారు. "నీగ్రో నయమే బాబూ. ఆ నలుపుకి తోడు తెల్లటి బట్టలు కడ్తాడు , ఆ నలుపు మరింత కొట్టవచ్చినట్లు కనబడుతుందే." "పాపం ఎందుకే? నిన్నేం చేశాడే అలా ఏడిపిస్తావు ఆ అబ్బాయిని...." ఎవరో అమ్మాయి జాలిగా అంది "మహా జాలిపడ్తున్నావు . ఏం కధ?" రేఖ హేళనగా అంది. ఆ అమ్మాయికి కోపం వచ్చింది. "కూరోండుకుందుకు కావాలా కాకరకాయలు కధలు. నీకున్నాయేమో . రంగు చూసి ఒకర్ని ఎద్దేవా చేయడం సంస్కారం కాదంటాను" తీవ్రంగా అంది. "నీవు తెలుపు. నేను చామనచాయ, యింకోడు నలుపు రంగు. నీవు, నేను కావాలంటే వచ్చేది కాదని కూడా తెలియకుండా ఎందుకలా ఆ అబ్బాయిని అవమానపరచాలి" తీవ్రంగా అంది. రేఖ కాస్త తగ్గి ....."వాడి రంగెలా వుంటే ఎవరికి? వాడి చూపులు .....కొరుక్కుతినేటట్లు చూస్తాడే.....ఆ చూపు చూస్తే వంటిని తేళ్ళు, జెర్రులు పాకినట్లుంటుంది. అందుకే అసహ్యం నాకు. ఆ అందగాడిని చూసి వరించాలని కాబోలు వెధవ ఫోజులు, నవ్వులూను. చూస్తుంటే తిక్క రేగుతుంది నాకు...." రేఖ గొంతులో తిరస్కారం. "పోనీలే పాపం. నల్లగా వున్నాడు కనక తెల్లటి వాళ్ళంటే వీక్ నెస్ ఏమో నిన్నేం చెయ్యలేదు కదా. చూసి తృప్తి పడితే నీ సొమ్మేం పోయింది." "వీక్ నెస్ .....నిజమే .....తెల్లటి వాళ్ళంటే ఆరాధనా భావం! ఎంత పుణ్యం చేసుకు పుట్టారోననిపిస్తుంది తనకి! అందులో రేఖ .....ఆ గులాబిరంగు, గీత గీసినట్లుండే ఫిగర్.... నల్లటి వంకుల జుత్తు . భగవంతుడు అంత అందమూ ఒకరికే యీయకపొతే తనలాంటి వాళ్ళకి కాస్త పంచకూడదు అనుకున్నాడు మొదటిసారి కాలేజిలో చూసినప్పుడు . రేఖ రంగు చూసి ఆమె మీద ఆరాధన పెంచుకున్నాడు. ఆమె తనకందదని తెల్సు....అసలలాంటి అత్యాస లేదు! అయినా ఆమె అంటే అదో ఆరాధన. అభిమానం. తన భావాలు తనలోనే పుంచుకున్నాడు తప్ప పైకి వ్యక్తపరిచే ప్రయత్నం ఎన్నడూ చెయ్యలేదు. అయినా రేఖ తన చూపులలో భావం పసికట్టిందంటే తనకి తెలియకుండానే తన కళ్ళల్లో ఆమె పట్ల ఆరాధన కన్పించింది కాబోలు! తనకీ వీక్ నెస్ ఏమిటి..... ఛా...ఛా. తన పట్ల అమెకెంత చుల్కన ఏర్పడింది? ..... అయినా .....పోనీ తన బలహీనత గుర్తించి సానుభూతి చుపోచ్చు. అవహేళన చెయ్యాలా? అందరిలో చులకన చెయ్యాలా? చిన్నపుచ్చుకుని , విషణ్ణ వదనంతో ఇల్లు చేరి, రాత్రి నిద్రపోకుండా పదేపదే ఆ మాటలనే గుర్తు చేసుకుంటూ బాధపడ్డాడు. అతని మోహంలో ఆవేదన తల్లి గుర్తుపట్టకుండా ఎలా వుంటుంది? "శ్యామ్ ....ఏమిటా ఆలోచన. టిఫిను తిను ముందు. నీలో యీ యిన్ ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎలా పోగొట్టాలో నాకు తెలియడం లేదు. రంగు నీ చేతిలో , నా చేతిలో వుందా....." రాధాదేవి అనునయిస్తూ అంది. "కాని నాన్నగారు , నీవు తెల్లాగా వుంటే నేనింత నలుపు ఎలా వచ్చానసలు?" "బాగుంది ప్రశ్న......తల్లి తండ్రి తెల్లగా వున్న నల్లటి పిల్లలు ఎందుకు లేరు? శ్యాం. శ్రీకృష్ణుడు నల్లటివాడు. శ్రీరాముడు నల్లటివాడు.....అంత మాత్రాన వాళ్ళని పూజించలేదా? ఆ నల్లనయ్యని ఎందరు గోపికలు అరాధించలేదు......అవతార మూర్తులే నల్లటివారయినప్పుడు మనం ఎంత...." "అరాధించవద్దు. పూజించవద్దు అపహాస్యం చెయ్యకుండా వుంటే చాలమ్మా......నీకేం తెల్సు కాలేజిలో అంతా నన్ను చూసి ఎలా నవ్వుకుంటారో ...." శ్యామ్ నల్లటి మొహం మరింత నల్లబడింది. అది చూసిన రాధాదేవి మనసు గిలగిలలాడింది. శ్యామ్ ని చూసి చిన్నప్పుడు అందరూ హేళనగా మాట్లాడితే తను బాధపడింది. ఈరోజు శ్యామ్ బాధపడటంలో వింత ఏముంది? కాని....తనేం చెయ్యగలదు? ఏం చెప్పి కొడుకుని ఒదార్చగలదు! "శ్యామ్ .....రంగు చూసి మనుష్యుల్ని అంచనా కట్టే మనుష్యులతో నీకేం పని. అది వాళ్ళ కుసంస్కారానికి నిదర్శనం. నీ మానాన నీవు చదువుకో. అని అని వాళ్ళే వూరుకుంటారు. ఇంత చిన్న విషయానికి నీవు మనసు పాడుచేసుకుంటే యింక నామీద ఒట్టే. ఊ.....కానీయి , టిఫిను తిను. ఆలస్యం అవుతుంది కాలేజికి." కొడుకుని సముదాయించడానికి ఏదో అన్నా ఆమె మనసు అది సరిపెట్టుకోలేకపోయింది. శ్యామ్.....నలుపు - కాని అతని మనసు తెల్లని పాలవంటి తెలుపు అన్నది తనకి తెలుసు. ఆ తండ్రి బుద్దులు రారాదని భగవంతుని ఎంతో ప్రార్ధించింది. తన మొర విన్నాడు ఆ దేముడు. తన పెంపకంలో సహృదయుడు, సంస్కారిగా పెరుగుతున్న కొడుకుని చూసి .....నల్లటివాడని ఆమె మనసు ఇప్పుడు నోచ్చుకోవడం లేదు. శ్యామ్ పుట్టినప్పుడు అనదరి చూపులు తూటాల్లా పొడుస్తుంటే , అందరి గుసగుసలు, అందరి వ్యంగ్యపు విసుర్లు విని విని ఆ బిడ్డని చంపి తానూ చావలనుకున్నంత అవమానం కల్గింది .....కాని అన్నింటినీ మాతృత్వపు మమత జయించింది. ఎంత అనాకారి అయినా బిడ్డని తల్లి ప్రేమించకుండా వుండలేదు...... ఆ బిడ్డ తండ్రిని ప్రేమించినా, ద్వేషించినా ఆ బిడ్డని మాత్రం ద్వేషించలేదన్నది అర్ధం అయింది. శ్యామ్ కి ఆ తండ్రి పోలికలు వస్తే! అనుకుంటూ , భయపడుతూ చిన్నప్పటి నుంచి అతి జాగ్రత్తగా వెయ్యి కళ్ళతో బిడ్డకి మంచి అలవాట్లను , అభిరుచుల్ని పెంచుతూ పెంచింది. శ్యామ్ పెద్దవుతున్న కొద్ది తను ఎలా మలుచుకుంటే అలా మలచబడుతుంటే సంతృప్తిగా నిట్టూర్చింది. శ్యాం కోసమే తన బ్రతుకు! వాడిని సంస్కార వంతుడిగా తీర్చిదిద్దడమే తన ఆశయం!.... అదే ఆమె తపన!..... కాని ..... శ్యామ్ పెరిగి పెద్దవుతూ తన అనాకారితనాన్ని నలుగురూ హేళన చేస్తుంటే బాధపడేవాడు. ఆ బాధ మనిషితో పాటు పెరిగి పెద్దదయింది. శ్యామ్ లో ఆ భావం ఏం చేసి పోగొట్టాలా అని మదనపడేది. ఎవరు ఏం అన్నా అతి సున్నితంగా చలించి బాధపడే అతని తత్త్వం మార్చాలని , ఆత్మవిశ్వాసం కల్గించాలని తాపత్రయపడేది. ఈరోజు శ్యామ్ విషన్నవదనం చూస్తుంటే ఆమె కడుపు తరుక్కుపోయింది. భగవన్తుదా౧ నాకీ బిడ్డని ఎందుకిచ్చావు.....పుట్టగానే చంపితే నాకానాడు ఈనాడు యిన్ని సమస్యలుండేవి గాదు కదా? నా బతుకు ఈ విధంగా మారేది కాదు కదా.....ఆవేదనగా కళ్ళు మూసుకుంది. కళ్ళు మూసుకున్నా శ్యామ్ నల్లటి రంగు , బండ పెదాలు, వెడల్పు ముక్కు చిన్న కళ్ళు.....మోహంలో ఏ కోశాన్నా మృదుత్వం లేకుండా చూడగానే అబ్బ ఏం రూపు బాబూ అనుకునే శ్యామ్.....తన బిడ్డ! ..... ఎంత అనాకారి అయినా శ్యామ్ తన కడుపున పుట్టిన బిడ్డ ...! పురుడు వచ్చాక, మత్తులోంచి తెలివిరాగానే నర్స్ తీసుకొచ్చి చూపించిన బిడ్డని చూడగానే కెవ్వుమంది. పుట్టినాక అంత నల్లటి బిడ్డని చూడడం అదే మొదటిసారి ఆమెకి. ఆ బిడ్డ తన బిడ్డ......తను ఏనాడో చేసిన పాపం యీనాడు ఈ రూపంలో భగవంతుడు శిక్షించాడు . మూగగా రోదించింది. అంత అనాకారి బిడ్డని వడిలో వేసి నర్సు ఆమె స్తనాన్ని బిడ్డ నోట్లో పెట్టి పాలు యీయడం చూపగానే ఆ బిడ్డ పెదాలు స్థనానికి తాకగానే వెన్నులోంచి ఏదో మమత పొంగుకొచ్చినట్లయింది. ఆ బిడ్డ మొహం చూడకూడదనుకున్న ఆమె తెలియకుండానే బిడ్డని గుండెకి అదుముకుంది. తల్లి ప్రేమ, కడుపు తీపి, పేగుబంధం అనే మాటలకి అర్ధం తెల్సింది. ఆమెకి తెలియకుండానే బిడ్డ మీద అసహ్యం, ఏహ్యం, తిరస్కారం క్రమంగా మాయమయి ఆ స్థానంలో మమత, అనురాగం పుట్టుకొచ్చాయి.... శ్యామ్ బుద్దులనీ తండ్రిని పోలనందుకు అనేక దేముళ్ళకి మొక్కుకుంది. ఈనాడు శ్యామ్ ......తనకి జీవనాధారం. వాదికోసమే తన బతుకు! శ్యామ్ . బాబూ! నేను ఏం చేసి నీ దిగులు పోగొట్టనురా...." విచలిత అయి కళ్ళు ఒత్తుకుంది రాధాదేవి. * * * "అమ్మా ....అమ్మా...." హడావుడిగా లోపలికి వచ్చాడు శ్యామ్. శ్యామ్ వెంట వచ్చిన అమ్మాయిని చూసి రాధాదేవి ప్రశ్నార్ధకంగా చూసింది. "అమ్మా.....ఈ అమ్మాయి మా కాలేజి మెట్ రేఖ.....ఇవాళ.....యివాళ రేఖకి.....చాలా గొడవయిందమ్మా.....నల్గురు రౌడీలు వెంటపడ్డారమ్మా ....." ఎక్స్తైట్ అవుతూ గబగబ అన్నాడు. "ఆ....." రాధాదేవి కూడా గాభరా పడింది. "సరిగా ఆ సమయానికి శ్యామ్ రాబట్టి బతికిపోయాను. లేకపోతే వెధవలు ఏం చేసేవారో ...." రేఖ భయంగా అంది. "అసలు ఏం జరిగిందమ్మా.....ముందలా కూర్చో. మంచినీళ్ళివ్వనా?" రాధాదేవి వెళ్లి ప్రీజ్ లోంచి చల్లటి నీళ్ళు తీసుకొచ్చి యీయగానే రేఖ గడగడ తాగింది. "వళ్ళంతా చెమట పట్టిందమ్మా.....యింకా ఫరవాలేదు.... స్థిమితంగా కూర్చో...." అంటూ మృదువుగా ఆమె నుదురు పమిట చెంగుతో వత్తింది రాధాదేవి. ఎదురు చూడని ఆ ఆప్యాయతకి రేఖ చలించి దోషిలా శ్యామ్ వంక చూసి తల దించుకుంది. యింతటి మంచి హృదయం గల తల్లికి పుట్టిన బిడ్డనా తను యిన్నాళ్ళు చీదరించుకుంది. ఈరోజు శ్యామ్ రాకపోతే? ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. "చెప్పమ్మా. ఏం జరిగిందసలు" రాధాదేవి ఆరాటంగా అడిగింది. "ఎవరో నల్గురు రౌడీలండీ . ఈ మధ్య ఓ నెల రోజులనించి నేను బస్సు దిగి యింటి కెళ్ళేటప్పుడు , వచ్చేటప్పుడు కిళ్ళీ బడ్డి దగ్గిర కూర్చుని వెకిలి మాటలు, వెకిలి చేష్టలు , ఒకటే నవ్వులు, వెధవ పాటలు పాడటం , ఒకటేమిటి అసహ్యంగా వేషాలు వేసేవారు. మొదట కొన్నాళ్ళు చూసీ చూడనట్లు వూరుకొన్నాను. కొన్నాళ్ళు కోపంగా అసహ్యంగా చూసాను, నాకోపం చూసి మరింత వెకిలిగా మాట్లాడ్డం, నవ్వడం మోఅలుపెట్టారు. ఒకరోజు వళ్ళు మండి , కోపం పట్టలేక చరచర దగ్గిర కెళ్ళి 'ఏమిటి పెల్తున్నారు, వళ్ళు దగ్గిర పెట్టుకోండి' అని అరిచాను. నేను అంత ధైర్యంగా తిడ్తానని వూహించని వాళ్ళు ఒక్క క్షణం ఖంగు తిన్నారు. 'ఏరోయ్ , పిల్ల వళ్ళు జగ్రత్తంటుందిరోయ్' అని ఒకడు, 'ఎవరి వళ్ళురా , దాని వళ్ళు జాగ్రత్త చేసుకోమను .....లేకపోతే ....ఒకళ్ళకాదు యిద్దరం కాదు, నల్గురం నంజుకుని విందు భోజనం చేస్తాం అని చెప్పారా . పిల్ల దొరముగ్గిన జాంపండు లా వుందిరోయ్....కటక్కున కొరకాలనుంది రోయ్.....వరేయ్ .....అబ్బ ఏం బుగ్గలురా.....ఏపిల్ పళ్ళలా లేవూ. వెధవా బుగ్గలు ఏమిటిరా.....యింకా మంచివి వున్నాయి చూడరా సన్నాసి '- మరోడు యికిలించాడు. భరించరానంత అసహ్యం వేసింది. ఒక్కొక్క వెధవ అంబోతుల్లా వుండి వెగటు పుట్టించారు. చూడడానికే అసహ్యం వేసింది - 'ఛీ ..... పని పాటా లేక రోడ్డున పోయే ఆడపిల్లని అల్లరి పెట్టడానికి సిగ్గు లేదు. ఈసారి నా ఊసేత్తారంటే చెప్పుచ్చుకు కొట్టి పోలీసు స్టేషన్ కి లాక్కేడతాను '.... అని ఉమ్మేసి చరచర వెళ్ళిపోయాను. 'అబ్బో! పిట్ట గట్టిదేరోయ్ , పోలీసులని పిలుస్తుందట . బాబోయ్ భయం వేస్తుంది' వెకిలిగా నవ్వుతూ అంటున్న మాటలు విననట్టే వెళ్ళాను...." "ఎవరు వాళ్ళు.....స్టూడెంట్లా.....అయ్యో.....వాళ్ళతో ఎందుకు తగిలావమ్మా' రాధాదేవి ఆందోళనగా అంది. "స్టూడెంట్లు కాదండి. వెధవలు. వాళ్ళ వేషాలు, వాళ్ళు ఎవరో రౌడి వెధవలు. అలా పెల్తుంటే ఎన్నాళ్ళూరుకుంటానండి , ఆరోజు తిట్టానని వాళ్ళు మరింత పంతంగా అల్లరి పెట్టడం ఆరంభించారు రోజు రోజు. ఈరోజు ఏం చేసారో తెలుసాండి....యివాళ కాలేజినుంచి మా ఫ్రెండ్ సునీత పుట్టినరోజని దానింటికీ పార్టీకి వెళ్ళి చీకటి పడ్డాక యింటి కొస్తున్నాను. దాని ఇంటిరోడ్డు కాస్త నిర్మానుష్యంగా వుంటుంది. రోడ్డు ,మొగన నల్గురు నించున్నారు. వాళ్ళని చూడగానే నా ప్రాణాలు పోయాయి. నేను ఎక్కడికి వెళ్ళింది తెలుసుకుని వచ్చారన్నమాట. ఇన్నాళ్ళు జనం మధ్య భయం అన్పించలేదు. కాని ఈరోజు సందు మొగన కాపు కాసి - నల్గురు చేతులడ్డం పెట్టి 'పోలీసులని తీసుకొచ్చావంటే జామపండూ...." అని ఒకడు, 'ఏపిల్ పండు ఒక్కసారి కోరకనియవూ " అని మరొకడు - "ఎంటలా బెదురూ చూపులు చూస్తున్నావు? చెప్పుచ్చుకు కొట్టవే' అని మరొకడు - 'చిలక పిట్టా కబుర్లు చెప్పినట్టు కాదు కొట్టు చూద్దాం ' - అని నల్గురు తలోమాట అంటూ నా దారికి అడ్డం కాశారు. కాళ్ళలో వణుకు పుడ్తున్నా భయపడినట్లు కనిపిస్తే మరింత బెదిరిస్తారని ఎవరన్నా అటు రారా అని అటూ ఇటూ చూస్తూ 'మర్యాదగా దారి వదలండి. లేకపోతే ఈ క్షణంలోనే పోలీసులని పిలుస్తాను. నడిరోడ్డు మీద మీకింత ధైర్యం ...." అన్నాను బెదిరిస్తూ బింకంగా. "నడిరోడ్డుద్దంటారా. పద యింటికో , హోటలుకో పోదాం" అన్నాడొకడు వెకిలిగా నవ్వి. కోపం పట్టలేక చెప్పు తీసి వాడి చెంప మీద ఒకటి అంటించాను. "వెధవల్లారా! ఆడపిల్లలంటే అంత చులకనగా వుందా..... హోటలుకు తీసికెడతావా పద, మీ మామగారింటికీ తీసికేడ్తాను" అని ఎడాపెడా వాయించేసాను. వాడి కళ్ళు ఎర్రబడ్డాయి. ఎర్రటి కళ్ళతో తీక్షణంగా చూస్తూ నా చేయి గట్టిగా పట్టుకున్నాడు. అంతవరకున్న ధైర్యం నీరుగారిపోయి కెవ్వుమని అరిచాను. వాడింకా గట్టిగా పట్టుకుని లాగుతున్నాడు. ఇంకేం జరిగేదో శ్యామ్ సైకిల్ మీద అట్నించి వస్తున్నాడు. నా కేక విని చటుక్కున ఆగాడు. నన్ను ఆ స్థితిలో చూడగానే ఒక్క క్షణం నిర్ఘాంత పోయాడు. శ్యా,మ్ ని చూడగానే వాడు నా చేయి వదిలాడు. ఒక్క అంగలో శ్యామ్ దగ్గరికి పరిగెత్తాను. నేను చెప్పక్కరలేకుండానే శ్యామ్ పరిస్థితి గ్రహించి పరిగెట్టి పోవాలని చూస్తున్న వాళ్ళ దగ్గరికి కేకలు పెడ్తూ పరిగెట్టి ఒకడిని పట్టుకుని కింద పడేశాడు. మా యిద్దరి కేకలు విని జనం పోగయ్యారు. ఆ నల్గురు వెధవలని అంతా కల్సి చావకొట్టారు. పోలీసులు, గొడవ ఎందుకని అందరూ తిట్టి పొమ్మన్నారు ...." రేఖ అంతా చెప్పి శ్యామ్ వంక కృతజ్ఞతగా చూస్తూ -- "మీ అబ్బాయికి నేను థాంక్స్ చెప్పుకోవాలి యివాళ." "ఆ వేళకి నీవు ఎట్నించి వస్తున్నవురా....." రాధాదేవి అడిగింది. "ప్రెండ్ యింటి నుంచి వస్తున్నానమ్మా.....రేఖ కేక వినగానే పరిచితమైన గొంతులా అన్పించి ఏమిటా అని సైకిలు దిగగానే , తీరా చూస్తే రేఖ .....సమయానికి వెళ్ళకపోతే రేఖని ఏం చేసేవారో .....మన ఇల్లు యిక్కడే అని చెప్పి తీసుకువచ్చాను." "ఎంత పని జరిగింది? అమ్మా రేఖ , చీకటి పడ్డాక వంటరిగా ఎప్పుడూ వెళ్ళకు తల్లీ. అలాంటి వాళ్ళను చూసీ చూడనట్లు వూరుకోవాలి గాని రెచ్చగొడితే మరింత పెట్రేగిపోయి ఏమన్నా చేస్తారు. ఈరోజు మంచిది . నల్గురు లాక్కెళ్ళి ఏం చేసినా దిక్కెవరు? వద్దు అమ్మా. ఇంకెప్పుడూ అలాంటి వాళ్ళల్తో దేబ్బలాటకి దిగకు...." రాధాదేవి ఆందోళనగా అంది. "ఆ వెధవలు అలా కూస్తుంటే ఎలా ఊరుకోనండీ? ఊరుకుంటే మన మెతకతనం చూసి మరింత చేస్తారు...." ఆవేశంగా అంది రేఖ. "ఊరుకోక ఏం చెయ్యగలమమ్మా. శారీరకంగా పురుషుడు మనకంటే బలవంతుడు. ఏ అఘాయిత్యం అన్నా జరిగితే ఆ ఆడదాని బతుకు అధోగతే అవుతుందమ్మా. తన తప్పు కాకపోయినా సమాజం స్త్రీనే శిక్షిస్తుంది . నా మాట విని అమ్మా - మరెప్పుడూ వాళ్ళెం అన్నా విన్నట్టు వెళ్ళిపో..... హు ....ఆడది ఎంత చదివినా , ఎన్ని ఊళ్ళేలినా , సమాన హక్కులంటూ ఎంత మాట్లాడినా ఆనాటికీ , ఈనాటికి స్త్రీ పురుషాధిపత్యానికి తల ఒగ్గే వుందమ్మా. ఓ ఆడపిల్ల చీకటి పడ్డాక క్షేమంగా ఇల్లు చేరటం కూడా అనుమానస్పదమే . ఆనాడూ, ఈనాడూ మనం ఏం స్వాతంత్యం సాధించామో అర్ధం కాదు...." రాధాదేవి గొంతులో కంపన, ఆవేదన చూసి రేఖ ఆమె తన గురించి అంత బాధపడుతున్నందుకు ఆమె పట్ల , ఎంతో గౌవరం, అభిమానం కల్గింది. ఆమెని చూడగానే ఆ నలబై దాటిన వయసులో కూడా ఆమె అందం, హుందా ఆ సంస్కారం వుట్టిపడే మొహం, అభిమానంగా మాట్లాడే తీరు అన్నీ రేఖని ఆకర్షించాయి. ఈమె యింత అందంగా వుంది. మరి శ్యామ్ ..... తండ్రి పోలిక? ..... "ఈ సంగతి యిదివరకు మీ యింట్లో చెప్పావా అమ్మా...." "లేదండి , ఎవరో రౌడీ వెధవలు ఏదో కూస్తే ఇంట్లో చెప్పేది ఏమిటి అని ఊరుకున్నాను. ఇవాళ సంగతి నాన్నగారితో చెపితే ఏం అంటారో]నని భయం వేస్తుంది. మరి చీకటి పడ్డాక ఇల్లు కదలవద్దని కట్టడి చేసి యింకేక్కడికీ వెళ్ళనీయరని భయం వేస్తుంది." "లేదు. ఇంట్లో చెప్పమ్మా. ఆ వెధవలని వీలయితే మీ నాన్నగారికి చూపు. ఎందుకన్నా మంచిది.ఈరోజు సంఘటనతో వాళ్ళు మరింత కోపం తెచ్చుకుని ఏమన్నా చేస్తారేమో, పోలీసులకి చెప్పడం మంచిదేమో ..." రాధాదేవి సాలోచనగా అంది. "అమ్మా! అలాచేస్తే యివాళ కాకపోతే రేపన్నా వాళ్ళు ప్రతీకారం తీర్చుకుంటా] రేమో ఆ కక్ష మనసులో పెట్టుకుని" శ్యామ్ అన్నాడు. "ఇప్పుడు మాత్రం కక్ష వుండదంటావా?" ఏమో పోలీసులకి చెప్పడం మంచిదేమో.....మీ నాన్నగారితో మాట్లాడి వారెలా చెపితే అలా చెయ్యమ్మా! మరిచేపోయాను. వుండు కాస్త కాఫీ తెస్తాను....శ్యామ్ వచ్చి యింటి దగ్గిర దింపుతాడులే. భయం లేదు." వద్దండి. మరోసారి వస్తాను. ఇప్పుడే పార్టీలో అన్నీ తీసుకున్నాను. ఇప్పటికే ఆలస్యం అయింది. అమ్మా నాన్న అరాటపడుతుంటారు. వెళ్తాను. శ్యామ్ , సారీ ట్రబుల్ ఇస్తున్నాను. నన్ను కాస్త దింపుతారా?" "ష్యూర్ .....ఆ మాట అడగాలా ....పదండి. "చాలా థాంక్స్ అండీ. మరోసారి తప్పకుండా వస్తాను. మీరు.....మీ శ్యామ్ నాన్నగారు లేరండి...." అంది కుతూహలంగా. శ్యామ్ తండ్రిని చూసి శ్యాం ఎవరి పోలికో చూడాలనుకుంది. ఆమె గొంతులో కుతూహలం శ్యామ్ గుర్తించాడు. ఆమెకి జవాబివ్వడానికి రాధాదేవి తడబడింది. అది గుర్తించిన శ్యామ్ ....."అమ్మా! రేఖ ఎందుకడిడిందో తెలుసా, నీ వంత చక్కగా వుంటే నీ కొడుకు ఇలా వున్నాడు. తండ్రి పోలికా అని చూడ్డానికి అడిగింది. అవునా రేఖా. నీ అంచనా తప్పు. మా నాన్నగారూ తెలుపే.....మా యింట్లో నేనే అనాకారిని...." హాస్యంగా అన్నా అతని మోహంలో భావం చూసి రేఖ నొచ్చుకుంది. తన భావం గుర్తించి నందుకు పట్టుబడ్డ దొంగలా తలదించుకుని "సారీ శ్యామ్ .....అందుకడగలేదు. ప్లీజ్ . పాత సంగతులు మరచిపో.... ఐయామ్ ఎషెమ్ డ్ ఆఫ్ మై సెల్ఫ్" అంది బాధగా. వింటున్న రాదాదేవికి సగం సంగతి అర్ధమైంది. రేఖని తీసుకొచ్చినప్పుడు కొడుకు మోహంలో కాంతి, ఆమెతో మాట్లాడుతున్నప్పుడు కళ్ళలో వెలిగే సంతోషం, ఆమెకి సాయపడ గల్గినందుకు గర్వం.....ఎప్పుడూ లేనంతగా శ్యామ్ మోహంలో కాంతిని చూసి, ఇప్పుడు రేఖ మాటలు విని శ్యాం తన రూపుని తను ఎందుకు ఈసడించుకుంటున్నాడో అర్ధం అయింది. అందాల రేఖని తను కళ్ళేత్తి కూడా చూసే యోగ్యత లేదని బాధపడ్డాడు ఇన్నాళ్ళు. రేఖ కాస్త కృతజ్ఞతగా మాట్లాడితే యెంత సంబరపడుతున్నాడు పిచ్చివాడు. "రేఖా.....చూశావా వాడి మాటలు.....వాడిలో ఈ యిన్ ఫీరియారిటీ కాంప్లెక్స్ పోగొట్టాలని నేను ఎంత ప్రయత్నించినా లాభం లేకపోతుంది. రేఖా! అందం అనేది మనసుకి వుండాలి గాని, శరీరానికి లేనంత మాత్రాన కించపడాలా? అందం చూసేవాళ్ళు కళ్ళను బట్టి , మనసుని బట్టి వుంటుంది. నా మట్టుకు నాకు శ్యామ్ ఆ నీలిమేఘశ్యామ్ లా కన్పిస్తాడు. అందుకే ఆ పేరు పెట్టాను. మనకు ఒక వ్యక్తి మీద యిష్టం వున్నప్పుడు కూరూపితనం కనపడదు. నీవూ చెప్పమ్మా ఆ మాట "రాధాదేవి కావాలనే రేఖకి అందం ప్రధానం కాదు అన్నట్లు చెప్పింది. ఆ మాటలకి రేఖ సిగ్గుపడి తలదించుకుంది. శ్యామ్ రూపుని తను ఎంత హేళన చేసిందో గుర్తుకు వచ్చి ఆ సహ్రుదయులైన తల్లీ కొడుకుల ముందు తలవంచుకుంది. "టేకిట్ యిజీ రేఖా.....నేను హాస్యంగా అన్నాను, పద వెళ్దాం" శ్యామ్ అన్నాడు. రేఖ సంస్కారం చేసి కదిలింది. గుమ్మంలో నిలబడి యుద్దర్ని చూస్తూ నిట్టూర్చింది రాధాదేవి. శ్యామ్ మనసులో కోరిక తీరేది కాదు. చూస్తూ చూస్తూ రేఖే కాదు ఎవరూ శ్యామ్ ని చేసుకోవడానికి ఇష్టపడరు. రేఖలో శ్యాం పట్ల కృతజ్ఞత తప్ప ఇంకేం వుంటుంది? ఉంటుందని ఆశించనూ కూడదు అనుకుంది. "శ్యామ్ ....మీ అమ్మాగారూ ఎంతందంగా వున్నారు! బాగా చదువుకున్నారా?" త్రోవలో అడిగింది రేఖ. "మా అమ్మ నవజీవన్ ఉమెన్స్ కాలేజీలో లెక్చరర్" అన్నాడు గర్వంగా. "నిజం?" రేఖ ఆశ్చర్యంగా అంది. శ్యామ్ ని చూసి ఏదో తక్కువ జాతివాడని , ఏ బీదవాడోననుకుంది. ఆ తల్లి, ఆ యిల్లు, ఆ సంస్కారం , ఆ అభిమానం అన్నీ చూసి ఒక్కసారిగా తన అభిప్రాయం మార్చుకుంది. శ్యామ్ పట్ల కుతూహలం పెరిగింది. "సారీ శ్యామ్ ! తెలియక నిన్ను గురించి ఏదో వాగాం.... క్షమించు. మీ అమ్మాగారి మీద నాకెందుకో ఎంతో గౌరవం కల్గింది. మీ నాన్నగారేం చేస్తారు?" కుతూహలంగా అడిగింది. శ్యామ్ మొహంలో రంగులు మారాయి. "ఆయనా లెక్చరర్ గా ఉండేవారుట" ముభావంగా అన్నాడు. రేఖ అర్ధం కానట్టు చూసింది. "ఆయనా మా అమ్మా ఒకే కాలేజిలో లెక్చరర్లుగా ఉండగా ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు..... కాని తరవాత ఎందుకో యిద్దరికీ పడక విడిపోయారు. ఆ తరవాత అయన సంగతి మా అమ్మ తెలుసుకోలేదు...." ఎందుకో అతనికి రేఖ దగ్గిర నిజం దాచాలనిపించక వున్న సంగతి చెప్పాడు. ఇవాళ కాకపోయినా రేపయినా తెలుస్తుందిగా అనుకున్నాడు. "ఐసీ....సారీ శ్యామ్ , తెలియక అడిగాను. అయితే మీ యిద్దరే వుంటారన్నమాట. మీ అమ్మగారే జాబ్ చేసి యిల్లు నడుపుతున్నారన్నమాట. అలా వంటరిగా వుండి నిన్ను పెంచుకుంటున్న ఆవిడ ధైర్యానికి మెచ్చుకోవాలి." "నిజంగానే మెచ్చుకోవాలి రేఖా! మా అమ్మ ఎంతో దక్షతగా సంసారం నడుపుతూ , నన్ను క్రమశిక్షణలో పెంచిందో తెలుసా? మేం ఏనాడు మగ అండ లేదేనని బాధపడలేదు. ఆవిడ వ్యక్తిత్వం మెచ్చుకోవాలి ఎవరన్నా. మా నాన్నతో ఎందుకు పడలేదో ఆ కారణం చెప్పలేదు ఎన్ని సార్లడిగినా. ఎంతో బలవంతపు కారణం వుంటే తప్ప మా అమ్మలాంటి సౌమ్యురాలు భర్తని వదిలి రాదనీ మాత్రం అర్ధం చేసుకున్నాను. అందుకే ఆ తరువాత అడగడం మానేశాను." మాటలమధ్యలో రేఖ ఇల్లు వచ్చింది. "బై రేఖా. ఆ రౌడీల పుణ్యమా అని నీతో పరిచయం కల్గింది. రేఖా ప్లీజ్! నన్ను అసహ్యించుకోకు. నేను నీనుండి ఏదీ ఆశించను. అని అభయం యిస్తాను. జస్ట్ - బీ ఫ్రెండ్లీ విత్ మీ....దట్సాల్.... నీతో మాటలాడే ఆనందాన్ని , నీ స్నేహాన్ని మాత్రం కోరుతున్నాను. నా పరిధి నాకు తెలుసు, నిన్ను కోరెంత సాహసం కలలో కూడా చేయను. ప్లీజ్ ....నీ స్నేహం కావాలి నాకు అంతే." రేఖకి తన మనస్సులో మాట చెప్పకపోతే తనేదో ఆశిస్తున్నాడని అనుకుంటే అసలే దూరం అవుతుందన్న భయంతో ఉద్వేగంతో అనేశాడు. "నో.... శ్యామ్ .......నన్నింకా నీ మాటలతో చిన్నపుచ్చకు . చెప్పానుగా ఐయాం సారీ ఫర్ ది పాస్ట్. మనిద్దరం ఈరోజు నుంచి స్నేహితులం. నేను మీ యింటికి వస్తుంటాను. మీ అమ్మగారు చాలా నచ్చారు నాకు. బై శ్యామ్ . ఆలస్యం అయింది. ఇంటికెళ్ళు....మరోసారి కలుద్దాం. గుడ్ నైట్" అంటూ గేటు తీసుకుని లోపలికి వెళ్ళింది. మరి రెండు రోజుల తరువాత .....ఉదయం కాఫీ తాగుతూ పేపరు తిరగేస్తున్న రాధాదేవి ఓ వార్త చదివి అదిరిపడి "శ్యామ్" అంటూ గావుకేక పెట్టి పేపరుతో కొడుకు గదిలోకి పరిగెత్తింది. "శ్యామ్....శ్యామ్ ,,," నిద్రపోతున్న శ్యామ్ ని కుదిపి లేపింది. బద్దకంగా కళ్ళు విప్పిన శ్యామ్ బద్ధకం తల్లిని చూడగానే ఎగిరిపోయింది. గాభరాగా లేచి "ఏంటమ్మా....ఏమిటి?" అన్నాడు తెల్లపోయి చూస్తూ. "చూడరా ఎంత ఘోరం జరిగిందో ...రేఖ ...రేఖని ఏం చేశారో చూడరా....." మంచం మీద కూలబడింది రాధాదేవి. శ్యామ్ ఒక్క ఉదుటున తల్లి చేతిలో పేపరు లాగి చదువుతూ "మైగాడ్...." అని అరిచాడు. వార్తా పూర్తిగా చదువుతుంటే అతని శరీరం భయంతో కంపించింది. చదివే పేపరు జారవిడిచాడు. "ఎంత ఘోరం....మైగాడ్" తల పట్టుకున్నాడు. రాధాదేవి కంపిస్తున్నా గొంతుతో 'శ్యామ్ ....నేను భయపడినంత జరిగింది . రేఖ.....పాపం, యింకేలా బతుకుతుంది ఈ లోకంలో? రామ, రామ. ఎంతకీ తెగించారు ఆ వెధవలు.....ఆమె బతుకు బండలు చేశారు. యెంత ఘతకం జరిగింది. ఎంత దారుణం...." ఆమె కళ్ళల్లో నీరు తిరిగింది. శ్యాం బాహ్యస్మ్ర్తుతి కోల్పోయిన వాడిలా మాటా పలుకు లేకుండా కూర్చుండి పోయాడు. "ఈ పత్రికల వాళ్ళోకరు ఓ ఆడపిల్ల జీవితం నాశనం అయితే అదింత పెద్ద అక్షరాలతో ఫోటోతో సహా ప్రచురిస్తే ఆ పిల్ల భవిష్యత్తు ఏమవుతుందన్న సనుభూతన్నా లేకుండా యిలా ప్రచురిస్తారు. అంతే.....ఎవరి ఆదుర్దా వారిది..... శ్యామ్ ...ఏమిటి అలా వుండిపోయావు?" "ఏమిటోనమ్మా. పెద్ద షాక్ తగిలినట్లయింది. ....మనకే యిలా వుంది. రేఖ ఎలా తట్టుకుందో ఈ ఘతకం. ఇంక ఆమె గతి ఏమిటమ్మా. ఈ పాటికి ఆమె తల్లిదండ్రులు వచ్చి యింటికి తీసికెళ్ళారేమో.....ఆమె ప్రాణాలతో బయట పడినందుకు సంతోషించాలి యింక...." "హు....ఈ దేశంలో మానం పోయిన ఆడదాని ప్రాణానికి ఎవరూ విలువ ఇవ్వరు శ్యామ్.....ఆమె ఏ బాధ తెలియకుండా చచ్చిపోతేనే బాగుండేది. లోకం అంతా ఆమెను దోషిలా చూస్తుంటే తప్పు లేకపోయినా తలెత్తుకోలేని బతుకు బతికేకంటే చావు మేలు.....అడ బతుకింతే నాయనా...." 'అమ్మా!....' ఆశ్చర్యంగా చూశాడు శ్యామ్. తన తల్లి.....చదువుకుని స్వతంత్యంగా బతుకుతున్న ఆమె కూడా అడ బతుకింతేనని నిరశాపడటం.....ఓ వ్యక్తిత్వం వున్న తల్లి కూడా లోకాని కింత భయపడడం! వింతగా అన్పించింది. "అమ్మా! నీవూ అలా మాట్లాడుతున్నావా.....ఇందులో రేఖ తప్పు ఏముందమ్మా.....ఆమె కావాలని చేస్తే అది తప్పు కాని ఎవరో అత్యాచారం చేస్తే రేఖ దోషం ఏముంది?" "శ్యామ్ .....ఆడదాని మానానికి మన వాళ్ళిచ్చిన విలువ యింకే దేశంలోనూ లేదేమో. కావాలని చేసినా, ఎవరో చేసినా శిక్ష అనుభవించేది ఆ స్త్రేయే. మానం పోగొట్టుకున్న స్త్రీని ఈ సంఘం వెలేస్తుంది. ఆమె పట్ల సానుభూతి చూపి చెయ్యదించే వారుండరు. యింక రేఖని పెళ్లాడెందుకు ఎవరన్నా ముందుకు వస్తారా? ఆ పిల్ల భవిష్యత్తు నాశనం అయింది శ్యామ్" ఆవేదనగా అంది రాధాదేవి. 'అమ్మా...." మంచం మీదనించి లేస్తూ 'అమ్మా! రేఖని ఒకసారి చూసి వస్తానమ్మా.....' ఏదో పోగొట్టుకున్న వాడిలా దిగులుగా అన్నాడు శ్యామ్. వెడతావా.....వద్దు శ్యామ్ ....ఇలాంటి సమయంలో యింకోరు చూపే సానుభూతి కూడా భరించలేరు. సానుభూతి చూపినా అవహేళన చేసినట్లే అన్పిస్తుంది వాళ్ళున్న పరిస్థితిలో. ఆమెని కొంచెం కుదుటపడనీ...." "లేదమ్మా..... స్నేహితులమానుకునేవాళ్ళు ఈ స్థితిలో వెళ్ళకపోతే కూడా బాధపడ్తారు. ఒక్కసారి రేఖని చూసి రావాలి...." అన్నాడు గంభీరంగా. "సరే పద. నేనూ వస్తాను. చూసిన మొదటి క్షణంలోనే రేఖ అంటే నా కెందుకో యిష్టం కల్గింది. అందులో ఈ పరిస్థితిలో వున్న రేఖని చూడకుండా వుండలేను. మనం అప్సత్రికే వెళ్దాం. ఇంటికి తీసికెళ్ళాక వాళ్ళింటికీ వెళ్ళాలంటే వాళ్ళెవరో మనకి తెలియదు , బావుండదు వెళ్ళడం . నీవు స్నానం అదీ కాని వేడ్దాం....." అంది రాధాదేవి. పేపరు చేతిలోకి తీసుకుని మళ్ళీ మళ్ళీ ఆ వార్త చదవసాగింది. "నగరంలో కాలేజీ విద్యార్ధినికి జరిగిన ఘోరమైన మానభంగం" అంటూ రేఖ ఫోటోతో సహా పెద్ద అక్షరాలతో ఆ వార్త ప్రచురించారు. "నిన్న తెల్లవారుజామున నాల్గుగంటలకి యునీవర్సిటీ రోడ్డువైపు పాలవ్యాను వేడ్తుంటే రోడ్డుకి అడ్డంగా పడివున్న ఒక స్త్రీని చూసి వ్యాను ఆపి దిగారు. ఆ యువతి తెలివి తప్పి వుంది. చిరిగిన జాకేట్టుతో, వంటిని లంగా మాత్రం వున్న ఆ యువతి వంటినిండా రక్కులు, బుగ్గలపై గాట్లు పెదాలు చిట్లి రక్తం గడ్డకట్టి వుండడం చూసిన ఆ పాల వ్యాన్ వాళ్ళకి సంగతి అర్ధం అయింది. వెంటనే ఆమెను విక్టోరియా ఆస్పత్రికి తీసికెళ్ళారు. ఆమెని రక్తసిక్తమైన ఆమె దుస్తుల్ని చూడగానే డాక్టర్లకి రేప్ కేసు అని అర్ధం అయింది. వెంటనే పోలీసు కంప్లయింట్ యిచ్చారు. ఉదయం ఏడు గంటలకి ఆమెకి తెలివి వచ్చింది. తెలివి వచ్చాక తన దుస్థితికి కన్నీరు మున్నీరుగా విలపించిన ఆమె దయనీయమైన పరిస్థితి చూసిన అందరికీ కళ్ళు చమర్చాయి. ఎంత అడిగినా ఆమె తన వివరాలు తెలవకుండా , తనని చంపేయమని ఒకటే ఏడ్పు. చచ్చిపోతానని హిస్టీరియా వచ్చిన దానిలా విలపించింది. అంతలో అదృష్టవశాత్తు ఆ వీధిలో వుండే రామారావు గారి భార్య ఆపరేషను అయి ఆస్పత్రిలో ఉందని ఉదయం కాఫీ పట్టుకు వచ్చిన అతను ఆ వర్డు వేపు వెడుతూ కిటికీ లోంచి ఆ అమ్మాయిని చూసి గుర్తుపట్టి ఆస్పత్రికి ఎందుకొచ్చిందా అని అరా తీయడానికి అడిగేసరికి అప్పుడు డాక్టర్లు ఆమె తండ్రి పేరు వగైరాలు తెల్సుకుని వెంటనే ఫోన్ చేశారు. అంతకుముందే సాయంత్రం కాలేజీ నుంచి కుమార్తె యిల్లు చేరలేదని రాత్రి పదిగంటలవరకు ఆరాటంగా ఎదురు చూసి, అందరి స్నేహితురాళ్ళ యిళ్ళకి వెళ్ళి కుమార్తె కనపడక బెంబేలు పడి అయన పోలీసు కంప్లయింట్ యిచ్చాడు. అసలు జరిగిన సంగతి ఏమనగా రేఖ అనే బి,ఏ. ఫస్టు యియర్ విద్యార్ధిని కాలేజిలో ఉండగా నాలుగిళ్ళ అవతల వుండే ఇంటర్ చదివే సుశీల అనే అమ్మాయి గాభరాగా క్లాసుకి వచ్చి రేఖ తండ్రికి యాక్సిడెంట్ అయి చావుబతుకుల్లో ఉన్నట్టుగా పక్కింటి అయిన చీటీ రాసి యిచ్చి రేఖ వుండే క్లాసు చూపి చీటీ యిచ్చి పిలుచుకు రమ్మని చెప్పాడట. సుశీల తెచ్చిన చీటీ చూసి గాభరాపడి మరేమీ ఆలోచించక అతని వెంట బయలుదేరినట్టు సుశీల రేఖ తండ్రితో చెప్పగానే అయన ఆందోళనతో పోలీసు కంప్లయింట్ యిచ్చాడు. ఎవరో కావాలని కధ అల్లి ఆమెని బలాత్కారంగా చెరిచారని అందుకు కారణం ఏమిటో తెలియదని పోలీసులు అన్నారు. రేఖ తల్లిదండ్రులు దుఃఖం వర్ణనాతీతం. ఎంతో సేపటికి గాని రేఖ నించి ఎవరూ అసలు విషయం రాబట్టలేకపోయారు. ఒక విధమైన షాక్ లో వున్న ఆమె మానసికంగా, శారీరకంగా గుర్తు పట్టలేనంత నీరసించిన ఆమె స్థితి డాక్టర్లకే గాభరా కల్గించింది. నిన్న సాయంత్రానికి కొద్దిగా మందుల ప్రభావం వల్ల తల్లిదండ్రులు అనునయించి బుజ్జగించినందువల్ల ఆ షాక్ నుంచి కాస్త తేరుకుని కుమారి రేఖ అసలు విషయం చెప్పింది. ఆ చీటీ తీసుకొచ్చిన అతను ఓ అటో ఎక్కించి తీసుకేళ్ళాడట. ఆమె గాభారాలో ఎటు వేడ్తున్నది గమనించలేదట. చాలాసేపు వెళ్ళాక ఓ యింటి ముందు ఆగిందట అటో. 'యిదేమిటి ఆస్పత్రికి వేడ్తున్నాం అన్నారు ' అందిట ఆశ్చర్యంగా. 'ప్రయివేటు నర్శింగ్ హోంలో చేర్చారు లోపలికి వెళ్ళి చూడండి" అన్నాడుట. రేఖ తలుపులోంచి లోపలికి వెళ్ళేటప్పుడు ఏదో బలమైన హస్తం ఆమెని గట్టిగా బందించి కాళ్ళు చేతులు కట్టేసి కళ్ళకు గంతలు కట్టారట. నోట్లో గుడ్డలు కుక్కరట. ఆ మాటలని, గొంతుల్ని బట్టి కనీసం ముగ్గురు మనుష్యులుంటారని ఆమె గుర్తు పడుతుంది. చాలాసేపు తరువాత ముగ్గురో నల్గురో ఒకరి తర్వాత ఒకరు ఎంత ఘోరంగా , ఎంత భీబత్సంగా గింజుకుంటున్న ఆమెని మానభంగం చేశారో చెప్తూ అది గుర్తు తెచ్చుకున్న ఆమె మళ్ళీ స్పృహ తప్పింది. ఆమె మానసికంగా చాలా నీరసించినందున డాక్టర్లు యింకా మాట్లాడడానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఆమె వారి ఘాతకచర్య చెప్తుంటే వినిన అందరూ చలించిపోయారు. ఆఖరికి పోలీసు ఇన్ స్పెక్టర్ కూడా విపరీతంగా చలించి ఒక ఆడపిల్లని ఇంత దారుణంగా రాక్షసప్రవృత్తిలో చెరచిన ఆ దుర్మార్గులని ఏనాటి కన్నా పట్టుకు తీరుతానని ప్రతిజ్ఞ పూనాడు. ఆ ముగ్గురూ ఎవరై వుంటారు? ఆ యువతిపై వారికింత పగ , కక్ష ఎందుకా అని పోలీసులు తేల్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దురదృష్టవశాత్తూ ఆ గాభరాలో ఆ అటో నెంబరు కూడా చూడలేదు ఆమె. చీటీ తెచ్చి యిచ్చిన అతను మారువేషం వేసుకుని ఉండవచ్చు అని అభిప్రాయపడ్తున్నారు పోలీసులు. ఈ ఘాతుక చర్య చేసిన వారి గురించి గాని, దీని వెనుక వున్న కారణం గురించి గాని తెలిసిన ఎవరన్నా ఏ చిన్న విషయం అయినా సరే పోలీసులకి చెప్పి సహాయపడవలెను. ఆ అటో డ్రైవర్ సహృదయంతో ముందుకు వచ్చి ఆ యిల్లు వగైరా ఆచూకీ యిచ్చిన మంచి బహుమతి ఇవ్వబడును. కుమారి రేఖపై జరిగిన ఈ అత్యాచారం మొత్తం స్త్రీ జాతిపైన జరపబడిన అత్యాచారంగా గుర్తించి నేరస్తులని శిక్షించడానికి పోలీసులకి సహాయపడవలనేని ఇన్ పెక్టర్ విజ్ఞప్తి చేశాడు -" పేపరు మడిచి దీర్ఘంగా నిట్టూర్చింది రాధాదేవి.

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published.